మహిళల ఆర్థిక సాధికారతకు చేయూత :  ఎంపీ డాక్టర్ కడియం కావ్య

మహిళల ఆర్థిక సాధికారతకు చేయూత :  ఎంపీ డాక్టర్ కడియం కావ్య

కాజీపేట, వెలుగు: మహిళల ఆర్థిక సాధికారత కోసం కృషి చేస్తూ, వారికి చేయూతనందిస్తున్న బాలవికాస సంస్థ ఆదర్శంగా నిలుస్తుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. బుధవారం ‘సుస్థిర వ్యాపారం మహిళా వికాసం’ అనే అంశంపై మహిళలతో కాజీపేట బాలవికాసపీపుల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో రాష్ట్రంలోని 8 జిల్లాల బాలవికాస మహిళల రాష్ట్రస్థాయి మహాసభను నిర్వహించారు.

కార్యక్రమానికి ఎంపీ హాజరై మాట్లాడుతూ మహిళల ఆరోగ్యంపై బాలవికాస సంస్థ ప్రత్యేక కార్యక్రమం తీసుకోవాలని సూచించారు. వ్యాపారంలో రాణించిన నలుగురు మహిళలకు బాలవికాస మహిళా ఔత్సాహిక వ్యాపార సాఫల్య పురస్కారం 2024 అవార్డులను అందజేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళా సాధికారతకోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.

బాలవికాససంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి మాట్లాడుతూ ప్రతి మహిళలను లక్షాధికారిగా చేయడమే బాలవికాస సంస్థ ప్రధాన ధ్యేయమన్నారు. బాల వికాస వ్యవస్థాపకురాలు బాల థెరిస్సా జింగ్రాస్ కెనాడా దేశం నుంచి ఆన్ లైన్ లో మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్డీఏ అధికారి సుధీర్, డీపీఎం అనిల్, డీఎంఎం రజిత, జనవికాస అధ్యక్షుడు లూర్దు మర్రెడ్డి, బాలవికాస బోర్డు మెంబర్ హరీశ్, డైరెక్టర్లు  తదితరులు పాల్గొన్నారు.