- ఎంపీ రఘునందన్ రావు
మెదక్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచితే మీ పిల్లలకే నష్టం జరుగుతుందని, ఎట్టి పరిస్థితిలో దీనిని అంగీకరించొద్దని ఎంపీ రఘునందన్ రావు ఉద్యోగులకు సూచించారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అధ్యక్షతన మెదక్ తెలంగాణ భవన్ లో మంగళవారం జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్, టీఎన్జీవో డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే సునీతా రెడ్డి, టీఎన్జీవో సెంట్రల్ కమిటీ మాజీ అధ్యక్షుడు దేవి ప్రసాద్ రావుతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ .. రాబోయే నాలుగేళ్లలో 40 వేల మంది రిటైర్ అయితే రూ.20 వేల కోట్లు కావాలని, అందుకే ప్రభుత్వం ఏజ్ పెంచే ఆలోచనలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు రిటైర్మెంట్ కాకపోతే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉద్యోగాలకు ప్రిపేర్అవుతున్న నిరుద్యోగులు ఏం కావాలన్నారు.
రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్రావడం లేదన్నారు. రిటైర్అయ్యాక 30 రోజుల్లో అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసు పెంచొద్దని టీఎన్జీవోలు తీర్మానం చేయాలని సూచించారు. ఉద్యోగులకు, జర్నలిస్టులకు హెల్త్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాల్సిన అవసరం ఉందన్నారు.
గతంలో తాను దుబ్బాక ఎమ్మెల్యేగా ఈ విషయం గురించి మాట్లాడినట్లు గుర్తు చేశారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎవరి ఒత్తిడికి లొంగకుండా నిబంధనల మేరకు పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ టీఎన్జీవోలు లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదన్నారు. మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలిపే వరకు ఉద్యోగుల ఉద్యమంలో ముందుంటానన్నారు.
ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సకల జనుల సమ్మెలో టీఎన్జీవో ఉద్యోగుల పాత్ర కీలకం అన్నారు. టీఎన్జీవో కేంద్రం సంఘం మాజీ అధ్యక్షుడు దేవి ప్రసాద్ రావు మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు సీరియస్ గా ఆలోచిస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
ఉద్యోగులు కరువు భత్యం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో మంత్రి దామోదర రాజనర్సింహ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరేందర్, రాజ్ కుమార్, మాజీ అధ్యక్షుడు శ్యాం రావు, శ్రీనివాస్ రెడ్డి, అనురాధ, ఇక్బాల్ పాషా, రామాగౌడ్, శ్రీనివాస్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ చంద్ర గౌడ్ పాల్గొన్నారు.