అభివృద్ధి పనులపై ప్రపోజల్స్​ ఇస్తే..ఫండ్స్​ తెస్తాం

అభివృద్ధి పనులపై ప్రపోజల్స్​ ఇస్తే..ఫండ్స్​ తెస్తాం
  • దిశ కమిటీ చైర్మన్​ రఘురాంరెడ్డి
  • పనిచేయడం ఇష్టం లేకపోతే వెళ్లిపోండి : ఎంపీ బలరాం నాయక్​
  • జిల్లాకు ఎంఆర్​ఐ తీసుకువస్తాం
  • 'దిశ' మీటింగ్​లో ఆఫీసర్ల తీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ‘జిల్లా కేం కావాలో మాకన్నా ఎక్కువగా మీకే తెలుస్తాయి. ఏఏ అభివృద్ధి పనులు అవసరం, ఎంత ఫండ్స్​ కావాలనే ప్రపోజల్స్​ ఇస్తే సెంట్రల్​, స్టేట్​ నుంచి నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాం’ అని దిశ కమిటీ చైర్మన్​, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, కో చైర్మన్​, మహబూబాబాద్​ ఎంపీ బలరాం నాయక్​ అన్నారు. ఎంపీ రఘురామిరెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్​లో శనివారం సాయంత్రం దిశ కమిటీ రివ్యూ మీటింగ్ రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది. మీటింగ్​లో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావ్​, మాలోత్​ రాందాస్​ నాయక్​ ఎంపీలతో పాల్గొన్నారు.

పంచాయతీరాజ్​, హెల్త్​ , మిషన్​ భగీరథ, నేషనల్​ హైవే, ఐసీడీఎస్​తో పాటు పలు శాఖలను సమీక్షించిన క్రమంలో ఆఫీసర్ల తీరుపై ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జిల్లాలో ఏమేం పనులు  కావాలో మేం అడిగే దాకా ఇవ్వడం లేదు, మీరు అడగకుండా మేం నిధులెట్లాతేవాలి’ అని ఆఫీసర్ల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా ఏమేం కావాలో సమగ్ర నివేదికలు తయారు చేసి తమకు ఇవ్వాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్​తో పాటు రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డితో మాట్లాడి అవసరమైన నిధుల కోసం కృషి చేస్తామన్నారు.

ఏజెన్సీ జిల్లాలో ఎంఆర్​ఐ లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్తున్నారన్నారు. స్కానింగ్​ ఉన్నా ఉపయోగం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నేషనల్​ హైవే పనితీరు బాగాలేదన్నారు. కొత్తగూడెం పట్టణంలో అసంపూర్తి డ్రైనేజీలు, రోడ్డు, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో అసంపూర్తి నిర్మాణాలు, గోతుల మయంగా మారిన రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడ్తున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్నారు. మీ వద్ద డబ్బులు లేకపోతే చెప్పండి   ఇస్తాం, గుంతలతో ప్రజల ప్రాణాలు పోతున్నాయన్నారు. 

పినపాక నియోజకవర్గంలో నెలకు 10 మందికి పైగా పాము కాటుకు గురవుతున్నారన్నారు. ఏజెన్సీలో పీహెచ్​సీ, సీహెచ్​సీలలో డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కొత్తగూడెంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో డెలివరీకి వచ్చే గర్బిణులను వెళ్లగొడ్తుండడం దారుణమన్నారు. జిల్లా గవర్నమెంట్​జనరల్​ హాస్పటల్​లో పారసిటమల్​ మందులు అందుబాటులో సక్రమంగా ఉండడం లేదన్నారు. ఫారెస్ట్​ పర్మిషన్స్​ రాక పలు పనులు ఆగిపోతున్నాయని, కొన్ని క్యాన్సల్​ అవుతున్నా ఆఫీసర్లు మా దృష్టికి తీసుకురావడం లేదని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. మధ్యాహ్నభోజనం వర్కర్స్​కు ప్రతి నెలా జీతం వచ్చేలా చూడాలన్నారు. 

సికిల్​సెల్​ ఏజెన్సీలో విజృంభిస్తుండడంపై సమగ్రంగా పరిశీలన చేయాలన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని రావికం పాడు ప్రాంతంలో నిర్మించిన అండర్​గ్రౌండ్​ రైల్వే లైన్​తో ప్రజలు పడ్తున్న ఇబ్బందులను ఎప్పుడైనా గమనించారా అంటూ రైల్వే ఆఫీసర్లపై మండిపడ్డారు. విభజన టైంలో సీలేరు ఆంధ్రలోకి పోవడంతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఎంపీ బలరాం వాపోయారు.పోలవరం బ్యాక్​ వాటర్​తో వెంకటాపురం, వాజేడుతో పాటు భద్రాచలానికి వరద ముప్పు తప్పదని అన్నారు. 

ఈ విషయంపై ఆఫీసర్లు సమగ్రంగా నివేధికలు తయారు చేసి ప్రజాప్రతినిధులతో పాటు గవర్నమెంట్​కు పంపాలన్నారు. వచ్చే మీటింగ్​ టైంకు యాక్షన్​ టేకెన్​ రిపోర్టులతో సమగ్ర వివరాలతో రావాలని చైర్మన్​ రామసహాయం రఘురామిరెడ్డి అన్నారు. ఈ ప్రోగ్రాంలో కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​, ఐటీడీఏ పీవో రాహూల్​, అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాల్​, మున్సిపల్​ చైర్మన్లు డి. వెంకటేశ్వరరావు, కె. సీతాలక్ష్మి, దిశ కమిటీ మెంబర్లు అందెల ఆనందరావు, వందనం స్వప్న, బుర్ర సురేష్​ పలు శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.