రామగుండంలో  విద్యుత్​ ప్లాంట్లు పెట్టండి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రామగుండంలో  విద్యుత్​ ప్లాంట్లు పెట్టండి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • కేంద్ర మంత్రి ఖట్టర్​కు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వినతి
  • సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ, వెలుగు: రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల మూడు పవర్​ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం పార్లమెంట్ లో కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ... రామగుండంలో  800 మెగావాట్ల మూడు ప్లాంట్లను ఏర్పాటు చేస్తే, రామగుండం పవర్ ప్లాంట్ ప్రాజెక్టు దేశ విద్యుత్ ఉత్పత్తిలో మరింత ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు.

దీంతో దేశానికి 25% విద్యుత్ అవసరాలను రామగుండం తీర్చగలదని కేంద్ర మంత్రికి వివరించినట్లు చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో ఈ ప్రాజెక్ట్ మరో మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. త్వరలో ప్లాంట్ల ఏర్పాటుకు హామీ ఇచ్చారని తెలిపారు. 

పెద్దపల్లి అభివృద్ధికి కృషి

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెద్దపల్లి ప్రాంత అభివృద్ధికి ప్రతినిత్యం పోరాటం చేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. రామగుండం ఇప్పటికే దేశీయ విద్యుత్ ఉత్పత్తిలో ప్రధాన కేంద్రంగా నిలిచిందన్నారు. కొత్తగా 3 x 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తిని పెంచడమే కాకుండా, దేశంలోని పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సుస్థిరమైనశక్తిని అందిస్తుందని వివరించారు.

కొత్త ప్రాజెక్ట్ దేశ ప్రగతికి అవసరమైన మౌలిక వసతులు, కావాల్సిన సహకారాన్ని క్రోడికరిస్తుందని ఆయన చెప్పారు. ఇటీవల పెద్దపల్లి సభలో తాను ఇచ్చిన ఈ వాగ్దానానికి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలపడం ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు మరింత బలం చేకూర్చిందన్నారు. కాగా, విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎంపీ వంశీకృష్ణ చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర మంత్రి ఖట్టర్​ అభినందించారు.