
- మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
ములుగు, వెలుగు: కేంద్రం ఆపరేషన్కగార్ను వెంటనే ఆపాలని ఆదివాసీ, దళిత, గిరిజన, ప్రజా సంఘాల సమన్వయ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ములుగులోని రాయల్ ప్లాజా లో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నేతలు పాల్గొని మాట్లాడారు. ఆపరేషన్ కగార్ తో చత్తీస్ గఢ్ లో అమాయక ఆదివాసీలు, మహిళలు, చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి, ఆదివాసీల అభివృద్ధికి మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు. ఈనెల 30న ములుగు జిల్లా కేంద్రంలో శాంతి ర్యాలీ నిర్వహించేందుకు తీర్మానించారు.
ఆదివాసులపై అమానవీయమైన చర్యలను నిలిపివేసి, కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలని కోరుతూ తీసే శాంతి ర్యాలీలో యువత, మహిళలు, ప్రజా, కుల, హక్కుల సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ లక్ష్మయ్య, గోర్ సభ జాతీయ అధ్యక్షుడు జై సింగ్ రాథోడ్, తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఎంఆర్ పీఎస్ జాతీయ నేత పీరయ్య, గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ నాయక్, గోర్ సభ రాష్ట్ర అధ్యక్షుడు మంగిలాల్ నాయక్, పలు సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.