
- ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు
- చౌరస్తాల వద్ద మొదలుపెట్టని ప్లై ఓవర్లు, అండర్ బ్రిడ్జిల పనులు
సంగారెడ్డి, వెలుగు: ముంబై 65వ నేషనల్ హైవే విస్తరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి లింగంపల్లి (బీహెచ్ఈఎల్) వరకు రూ.800 కోట్లతో 30 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు జరుగుతున్నాయి. 4 లైన్ల నుంచి 6 లైన్లుగా విస్తరించే ఈ హైవే పనులు ఈ ఏడాదితో పూర్తి చేయాల్సి ఉంది కానీ ఇప్పటివరకు 30 శాతం పనులు కూడా జరగలేదు. మధ్య మధ్యలో గ్రామాలు, చౌరస్తాల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జిల నిర్మాణాలు మొదలుపెట్టలేదు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో నాణ్యత లోపించి ప్రజాధనం వృథా చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. పనుల పర్యవేక్షణపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందని విమర్శిస్తున్నారు.
లింగంపల్లి టు జహీరాబాద్
65వ నేషనల్ హైవేలో భాగంగా లింగంపల్లి టు జహీరాబాద్ వరకు ప్రతిరోజు వాహనాల రద్దీ ఉంటుంది. ఈ హైవేకు 161 నేషనల్ హైవే కలుస్తుండడంతో రద్దీ విపరీతంగా పెరిగి నిత్యం గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోడ్డుకు రెండు వైపులా ఒకేసారి పనులు చేస్తున్న కారణంగా వాహనదారులకు ఇబ్బందిగా మారింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఈ హైవే విస్తరణ పనులను పర్యవేక్షిస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో పనులు జరగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పరిధిలో కొనసాగుతున్న ఈ హైవేలో మొత్తం 9 ఫ్లై ఓవర్, అండర్ పాస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది.
సంగారెడ్డి చౌరస్తా, కంది, ఐఐటీహెచ్ పాయింట్, గణేశ్ గడ్డ, రుద్రారం, లక్డారం, ఇస్నాపూర్, నవోపాన్ కమాన్, లింగంపల్లి స్టేజీల వద్ద బ్రిడ్జిలు నిర్మించాలి. ఇప్పటి వరకు హైవేకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించి డ్రైనేజీ లైన్లను మాత్రమే నిర్మించారు. మధ్య మధ్యలో మూడు నాలుగు చోట్ల రోడ్డు విస్తరణ పనులు మొదలుపెట్టినా పూర్తిచేయలేదు. సర్వీస్ రోడ్లు అధ్వానంగా ఉండడంతో రోడ్డు పక్కన గ్రౌండ్ లెవెల్ లో కాంక్రీట్ తో పూర్తి చేయాల్సిన పనులను మట్టితో నింపి ఇరువైపులా స్తంభాలను అలాగే ఉంచారు. కాకపోతే లింగంపల్లి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తిచేసి తాత్కాలికంగా వాహనాలకు అనుమతి ఇచ్చారు.
2 గంటలు పడుతోంది..
రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో సంగారెడ్డి నుంచి లింగంపల్లి చేరుకోవాలంటే రెండు గంటల టైం పడుతోంది. విస్తరణ పనులు స్లోగా సాగడంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రాఫిక్ జామ్ వల్ల రోడ్డుపై కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోతున్నాయి. నిర్మాణాల చోట్ల కనీసం హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు లేకపోవడంతో ఇరువైపులా తవ్విన గుంతల్లో వాహనదారులు పడిపోతున్నారు. మధ్యలో వచ్చే గ్రామాలు, యూటర్న్ లు, చౌరస్తాల వద్ద రాత్రి వేళల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. హైవే అథారిటీ అధికారులు రహదారిపై సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు అంటించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.