
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ సర్వీస్ నుంచి రిటైర్ అయి.. అదే శాఖలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు 177 మందిని విధుల నుంచి తొలగిస్తూ గురువారం మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జల మండలి, మెప్మా, కుడా, రెరా, వైటీడీఏ, మెట్రో రైల్, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న రిటైర్ ఉద్యోగులను తొలగించింది.
ఇందులో ఎక్కువ మంది జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వైటీడీఏలోనే ఉన్నారు. వీరంతా కొన్నేండ్లుగా ఆయా శాఖలో కన్సల్టెంట్లుగా, రిటైరయిన పోస్టుల్లోనే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. విధుల నుంచి తొలగించిన వారిలో వైటీడీఏ సీఈవో రిటైర్డ్ ఐఏఎస్ కిషన్ రావు, హెచ్‌ఎండీఏలో ఇటీవల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న బీఎల్ఎన్ రెడ్డి, తహసీల్దార్లు, సీఈలు, ఈఈలు, డీఈఈలు, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు.