
నాగర్ కర్నూలు ఉర్కొండలో జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి ఐజీ సత్యనారాయణ కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.మహిళపై అత్యాచారం జరిగిన ఘటనా స్థలాన్ని ఏప్రిల్ 1న పరిశీలించారు ఐజీ. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఉర్కొండ పేటలో గ్యాంగ్ రేప్ జరగడం దారుణమన్నారు. మహిళలు ఒంటరిగా రావడాన్ని నిందితులు అదునుగా తీసుకున్నారని చెప్పారు. మహిళను బెదిరించి అత్యాచారం చేశారని తెలిపారు.
నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు ఐజీ..అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితులు గతంలో ఆలయ పరిసరాల్లో కొందరిని బెదిరించిన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. భవిష్యత్ లో ఆలయం దగ్గర వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.
మార్చి 31న నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలోని అంజన్న ఆలయం దగ్గర మొక్కులు తీర్చుకోవడానికి దర్శనానికి వచ్చిన భక్తులు .. రాత్రి నిద్ర కోసం అక్కడే నిద్రించారు. మహబూబ్ నగర్ కు చెందిన ఓ యువతి కాలకృత్యాల కోసం ఆలయ సమీపంలోని గుట్ట ప్రాంతం వైపుకు వెళ్లగా.. ఎప్పటి నుంచి మాటు వేశారో తెలియదు. అమ్మాయిని బలవంతం చేయబోయారు. భయంతో అమ్మాయి గట్టిగా కేకలు వేయడంతో ఆమె బంధువు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతడిని చితకబాది చేతులు కట్టేశారు. ఆ తర్వాత ఆ యువతిని బలవంతంగా గుట్ట ప్రాంతం అవతలివైపు ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఊర్కొండపేట గ్రామానికి చెందిన ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని నిర్ధారణకు వచ్చారు.