
- కెపాసిటీ 590 అడుగులు కాగా 522 అడుగులకు నీళ్లు
- 510 అడుగులకు చేరితే ఎమర్జెన్సీ పంపింగ్ చేయాల్సిందే
- వేసవి ప్రారంభంలోనే ఆందోళనకరంగా లెవెల్స్
- తాగునీటికి ఇబ్బంది రాకుండా చూడాలని ఇరిగేషన్ శాఖకు వాటర్ బోర్డు లెటర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటిని అందిస్తున్న నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు ఆందోళనకర రీతిలో తగ్గుతున్నాయి. రోజుకు దాదాపు 2 టీఎంసీల నీటిని సాగర్ నుంచి వివిధ అవసరాలకు ఇరిగేషన్అధికారులు వినియోగిస్తున్నారు. సాగర్‌లో నీటి నిల్వలు తగ్గితే హైదరాబాద్తాగునీటి అవసరాలకు తీవ్ర ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి ఉందని, సిటీ తాగునీటి అవసరాలకు సరిపడా నిల్వలను మెయిన్‌టెయిన్ చేయాలని వాటర్ బోర్డు అధికారులు ఇరిగేషన్ శాఖకు లెటర్ రాశారు. డెడ్ స్టోరేజీ(510 అడుగులకు)కి చేరితే ఎమర్జెన్సీ పంపింగ్చేయాల్సి వస్తుందని వాటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు.
గ్రేటర్‌తో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీలకు మెట్రో వాటర్‌బోర్డు నీరు అందిస్తోంది. ప్రస్తుతం నగరానికి ఆరు ప్రధాన వనరుల నుంచి రోజుకు 581.35 ఎంజీడీల(మిలియన్ గ్యాలన్స్ పర్ డే) నీటిని సరఫరా చేస్తున్నారు.
ఒక్క నాగార్జున సాగర్ నుంచే కృష్ణా ప్రాజెక్టు ఫేజ్1, 2, 3 ద్వారానే రోజుకు 275 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. మొదటి దశ ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి నుంచి 163 ఎంజీడీలు, సింగరూరు నుంచి 69.07 ఎంజీడీలు, మంజీరా నుంచి 40.62 ఎంజీడీలు, హిమాయత్ సాగర్‌నుంచి 10.58 ఎంజీడీలు, ఉస్మాన్‌సాగర్ నుంచి 22.50 ఎంజీడీల నీటిని సప్లయ్చేస్తున్నారు. కాగా నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం ఉన్న నీటి నుంచే 6 నెలల పాటు అంటే ఫిబ్రవరి నుంచి జులై వరకు నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని మెట్రో వాటర్‌బోర్డు అధికారులు ఫిబ్రవరి 13న ఇరిగేషన్ అధికారులకు లెటర్ రాశారు. కచ్చితంగా నీటి నిల్వలు మెయింటెయిన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ముందుస్తుగా ఏర్పాట్లు
ఎండలు ముదరడంతో సిటీలో రోజురోజుకూ నీటి డిమాండ్ పెరుగుతోంది. గ్రేటర్, ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలకు, మున్సిపాలిటీలకు కలిపి ప్రస్తుతం 550 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. నాగార్జున సాగర్‌లో నిల్వలు పడిపోతే ఆ ప్రభావం గ్రేటర్సిటీపై పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ఫిబ్రవరి 13 నాటికి 542 అడుగుల మేర నీరు ఉంది. నెల రోజుల్లోనే 522 అడుగులకు పడిపోయింది. ప్రస్తుతం సాగర్ నుంచి భారీ మొత్తంలో నీరు తరలిపోతున్న నేపథ్యంలో ఏప్రిల్ నాటికే డెడ్‌స్టోరేజీకి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సాగర్‌లోని పుట్టంగండి వద్ద పంపింగ్‌స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కోదండపూర్ నీటిశుద్ధి కేంద్రానికి నీటిని పంపింగ్చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పనులు చేపట్టేందుకు ఆయా సంస్ధల నుంచి తాజాగా వాటర్ బోర్డు అధికారులు టెండర్లను ఆహ్వానించారు. సాగర్ వద్ద ఎమెర్జెన్సీ పంపింగ్ పనుల నిర్వహణకు దాదాపు రూ. 4.50 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ పనులు మూడు వారాల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ఇది పూర్తయితే ఏప్రిల్ఆఖరు వారంలోనే నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ నగరానికి ఎమర్జెన్సీ పంపింగ్ద్వారా నీటి సరఫరా చేయనున్నారు.