
- సాంప్రదాయం ఉట్టిపడేలా మెస్రం వంశీయుల పూజలు
- 80 మంది కోడళ్లు బేటింగ్
ఆదిలాబాద్, వెలుగు: సాంప్రదాయం ఉట్టిపడేలా మహాపూజతో ప్రారంభమైన నాగోబా జాతరలో మెస్రం వంశీయులు భక్తిశ్రద్ధలతో తమ దేవతలను పూజించుకుంటున్నారు. మంగళవారం రాత్రి నాగోబాకు మహా పూజ అనంతరం 80 మంది కొత్త కోడళ్ల బేటింగ్(పరిచయం) నిర్వహించారు. ఒంటిగంట నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు బేటింగ్ పూజలు నిర్వహించారు.
ఉదయం ఆలయం ముందు మెస్రం వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో బేటింగ్ లో పాల్గొన్న కొత్త కోడళ్లు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్లు పెద్దలు వెల్లడించారు. పుష్య అమావాస్యను పురస్కరించుకొని నియమనిష్టలతో ఉపవాసం ఉన్న కోడళ్లు ఆలయం ప్రాంగంలోని గోవడ్ వద్ద కొత్త కుండల్లో నైవేద్యం చేసి దేవతలకు సమర్పించి మొక్కులు తీర్చుకొని
సహపంక్తి భోజనలు చేశారు.
నేడు పెర్సపేన్, బాన్ పేన్ దేవతలకు పూజలు
నాగోబా జాతరకు ఉమ్మడి జిల్లా నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా జనం వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. జాతరలో భాగంగా ఆలయ పరిసరాల్లో వెలిసిన దుకాణ సముదాయాలతో అంతా సందడిగా మారింది. గురువారం పెర్సపేన్, బాన్ పేన్ దేవతల పూజలతో పాటు సంస్కృతిక కళా ప్రదర్శనలు చేపట్టనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కలెక్టర్ రాజర్షి షా ఓ ప్రకటనలో వెల్లడిం చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్, ఏఎస్పీ కాజల్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
లీగల్ సెల్ స్టాల్ ఏర్పాటు
నాగోబా జాతరలో బుధవారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లీగల్ సెల్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బి. సౌజన్య లీగల్ సెల్ స్టాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు చట్టాలపై అవగాహన కల్పిం చారు. లీగల్ సెల్ ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలు జాతరలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగహన కల్పిస్తున్నారు.