రివార్డు పైసలు ఇవ్వట్లే జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులకు దక్కిన ఎన్ క్వాస్​ రివార్డు

రివార్డు పైసలు ఇవ్వట్లే జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులకు దక్కిన ఎన్ క్వాస్​ రివార్డు
  • రెండేండ్లు గడిచినా నయా పైసా అందలేదు 
  • నిరాశలో వైద్య సిబ్బంది 

నల్గొండ, వెలుగు : జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులకు ఎన్ క్వాస్​అవార్డులు దక్కినా దానికి సంబంధించిన పైసలు మాత్రం ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రులు నాణ్యతా ప్రమాణాలు పాటించి ఉత్తమ వైద్య సేవలు అందించినందుకు రెండేండ్ల కింద కేంద్ర బృందం ఎన్ క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్) అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డులకు అనుగుణంగా కేంద్రం నగదు ప్రోత్సాహకాన్ని అందించాల్సి ఉంది. రెండేండ్లు గడిచినా రివార్డులు రాకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో వైద్య సిబ్బంది తీవ్ర నిరాశలో ఉన్నారు. 

జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులకు దక్కిన ఎన్ క్వాస్ రివార్డు..

రోగులకు ఉత్తమ సేవలు, మందుల పంపిణీ, రికార్డుల నిర్వహణ, ఆస్పత్రి పరిశుభ్రత, గర్భిణులకు అందిస్తున్న సేవలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల అమలు తీరు, ప్రసవాల సంఖ్య ఆధారంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వైద్యశాలలను ఎన్ క్వాస్ అవార్డుకు ఎంపిక చేస్తుంటారు.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఏడాదికి రూ.3 లక్షల చొప్పున మూడేండ్లకు రూ.9 లక్షలు, యూపీహెచ్​సీలకు ఏడాదికి రూ.2 లక్షల చొప్పున మూడేండ్లకు రూ.6 లక్షలు, ఆరోగ్య ఉప కేంద్రాలకు ఏడాదికి రూ.1.50 లక్షల చొప్పున మూడేండ్లకు రూ.4.50 లక్షలు ఎన్ క్వాస్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. 

కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఈ ప్రోత్సాహక బహుమతితో ఆస్పత్రి అభివృద్ధికి 75 శాతం, మిగతా 25 శాతం సిబ్బందికి అందజేస్తారు. లక్ష్య, ఎన్ క్వాస్, ముస్కాన్ అవార్డుల ఎంపికకు ముందు రెండు, మూడు నెలలపాటు సిబ్బంది శ్రమించారు. క్షేత్రస్థాయిలో నాణ్యతా ప్రమాణాల మెరుగు, రికార్డుల నిర్వహణలో అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషిస్తారు. 

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 24 ఆస్పత్రుల గుర్తింపు..

సూర్యాపేట జిల్లాలో 15 వైద్యశాలలు ఎన్​ క్వాస్ అవార్డుకు ఎంపికయ్యాయి. వీటిలో 5 పీహెచ్​సీలు, 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 యూపీహెచ్​లు ఉన్నాయి. ఇందులో పెన్ పహాడ్, ఆత్మకూరు, కాపుగల్లు, నేరేడు చర్ల, చిలుకూరు పీహెచ్​సీలు, గిరినగర్, రాజీవ్ నగర్, పెన్ పహాడ్, ఆత్మకూర్, కాపుగల్లు, నేరేడుచర్ల, చిలుకూరు యూపీహెచ్​సీలు, కేసారం, రామారం, కందగట్ల, పంచ్య నాయక్ తండా, బాలేంల, ఏండ్లపల్లి, కసార్ల పహాడ్, ఊర్లుగొండ ఆరోగ్య ఉప కేంద్రాలను ఎంపిక చేశారు. నల్గొండ జిల్లాలో వేములపల్లి, దామరచర్ల, హాలియా, శాలిగౌరారం, తిప్పర్తి, చిట్యాల, చందంపేటల పీహెచ్ సీ సెంటర్లను గుర్తించారు.      

నయా పైసా అందలేదు..

ఎంపికైన ఆస్పత్రులకు రెండేండ్లు గడిచినా కేంద్రం ఫండ్స్ విడుదల చేయలేదు. మొదట్లో కొంత ఇచ్చినా రెండేండ్ల నుంచి ఫండ్స్ రావడం లేదు. జాతీయ నాణ్యతా పరిశీలన బృందాలు తనిఖీలకు వచ్చిన సమయంలో ఆస్పత్రులను సిబ్బంది తీర్చిదిద్దారు. ఫండ్స్ రాకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారింది. కష్టానికి తగిన ఫలితం దక్కకపోవడంతో పలు ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బంది తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆస్పత్రులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు రిలీజ్ చేయాలని కోరుతున్నారు.

ఫండ్స్ రావడం లేదు :- సూర్యాపేట జిల్లాలో 15 ఆస్పత్రులను ఎన్​క్వాస్​ అవార్డులకు ఎంపిక చేశారు. వీటికి సంబంధించిన ఫండ్స్ మొదట్లో కొంత ఇచ్చారు. రెండేండ్ల నుంచి ఇవ్వడం లేదు. - డాక్టర్ కోట చలం, డీఎంహెచ్​వో, సూర్యాపేట జిల్లా