
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
దేవరకొండ(పెద్దఆడిశర్లపల్లి), వెలుగు : అక్కంపల్లి రిజర్వాయర్ లో మృతి చెందిన కోళ్లపై ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం పీఏపల్లి మండలం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, మండలంలోని వద్ధిపట్ల, మల్లాపురం గ్రామాల శివారులోని కోళ్ల ఫారాలను ఆమె సందర్శించారు. మృతి చెందిన కోళ్లు, వాటి వ్యర్థాలను రిజర్వాయర్ లో వేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవరకొండ ఏఎస్పీ మౌనికను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిజర్వాయర్‌లో మృతి చెందిన కోళ్లను వేసిన ఘటనపై జలమండలి తరఫున మల్టీ డిసిప్లీనరీ టీమ్ ను ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టామని తెలిపారు.
విచారణలో రిజర్వాయర్‌కు 9 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న పౌల్ట్రీ ఫార్మ్ యజమాని చనిపోయిన 45 కోళ్లను లింకు కెనాల్లో వేయడంతో అవి కొట్టుకొచ్చాయని చెప్పారు. రిజర్వాయర్‌లో కోళ్లను వేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు పంపినట్లు పేర్కొన్నారు. రెవెన్యూశాఖ తరపున పబ్లిక్ న్యూసెన్స్ కింద నిందితుడిపై 133 సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రిజర్వాయర్‌లో నీరు కలుషితం కాలేదని, కోళ్ల కళేబరాలు ఎక్కడా లేవని చెప్పారు.
అయినా నీటి శాంపిల్స్సేకరించి భూపాల్‌లోని ల్యాబ్‌కు పంపించామని, పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ల శాంపిల్స్ కూడాల్యాబ్ కు పంపించామని వివరించారు. నేటి నుంచి15 రోజులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని, జలమండలి తరఫున ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. రిజర్వాయర్ నుంచి తాగునీటిని మూడు దశల్లో ఫిల్టర్ చేసిన తర్వాతే బయటకు వెళ్తాయని చెప్పారు. ఫిల్టర్ చేసిన నీరు 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది.. కాబట్టి ప్రజలెవరూ అపోహలకు గురికావద్దని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రమణారెడ్డి, ఇరిగేషన్ డీఈ నాగయ్య, ఎంపీడీవో చంద్రమౌళి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ మహేందర్ రెడ్డి, అధికారులు ఉన్నారు.