మదర్​ డెయిరీ నెత్తిన అప్పుల కుంపటి!..ఏటికేడు పెరుగుతున్న నష్టాల భారం

  • పాత, కొత్త అప్పులు కలిపి రూ.24కోట్లు
  • డెయిరీని ముంచుతున్న రాజకీయాలు
  • వివాదంలో డెయిరీ మేనేజింగ్​డైరెక్టర్​ కుర్చీ

నల్గొండ, వెలుగు : నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహాయక సహకార సంఘంపై అప్పులు భారం ఎక్కువవుతోంది.  పాలవర్గంలో రాజకీయాలు చోటు చేసుకోవడం, ఖర్చుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలేవీ చేయకపోవడంతో ఏటికేడు నష్టాలు పెరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌‌లో బాధ్యతలు చేపట్టిన డెయిరీ కొత్త పాలకవర్గం మొదట్లో కొంత కఠినంగానే వ్యవహరించింది. డెయిరీని చక్కబెట్టాలనే ప్రయత్నంలో భాగంగా రైతులకు ఇన్సెంటీవ్స్‌ ఇవ్వడంతో పాటు పాల సేకరణ ధరలు కూడా పెంచింది. కానీ, డెయిరీ నిర్వహణ భారం పెరిగిపోవడంతో పాత అప్పులు తీర్చేందుకు కొత్తగా మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇలా ఈ తొమ్మిది నెలల కాలంలోనే  రూ.6 కోట్ల అప్పు చేశారు. దీంతో పాతవి కొత్తవి వడ్డీతో కలిపి మొత్తం అప్పులు రూ.24 కోట్లకు చేరాయి. 

దెబ్బకొట్టిన కరోనా..

మదర్ డెయిరీ కష్టాలు 2015 నుంచి మొదలయ్యాయి.  ఢిల్లీ మదర్ డెయిరీతో ఒప్పందం రద్దయినప్పటి నుంచి ఏటికేడు పెరుగుతూ వచ్చాయి.   ఢిల్లీ మదర్​డెయిరీ సేల్స్‌ను తట్టుకుని మార్కెట్లో నిలబడేందుకు అప్పటి పాలకవర్గం ఆఫర్లు ప్రకటించింది. డిస్ట్రిబ్యూటర్లు 12 లీటర్లు అమ్మితే అర లీటరు ఫ్రీగా ఇచ్చింది. ఇవి డెయిరీ మనుగడ కాపాడుకునే చర్యలే అయినప్పటికీ  సంస్థ ఆదాయం తగ్గి నష్టాలు పెరిగాయి.  ఈ నష్టాలను పూడ్చుకునే క్రమంలో డెయిరీ డెవలప్‌మెంట్​కార్పొరేషన్​, ప్రైవేట్‌ బ్యాంకుల నుంచి రూ.23 కోట్ల అప్పు తెచ్చారు. వీటిని తీర్చేందుకు అప్పుడున్న పాలకవర్గం పాలసేకరణపై దృష్టి పెట్టింది.  రోజువారీ పాలసేకరణ 1.50 లక్షల లీటర్ల నుంచి 2.25 లక్షల లీటర్లకు పెంచింది. దీనివల్ల నష్టాలు రూ.13కోట్లకు తగ్గాయి. పాలసేకరణ తగ్గకుండా ఉండేందుకు వచ్చిన కొద్దిపాటి లాభాల్లో రైతులకు బోనస్​ కూడా ఇచ్చారు. కానీ, మధ్యలో కరోనా రావడం వల్ల రూ.13కోట్ల అప్పులు అలాగే పెండింగ్‌లో ఉండిపోయాయి. 

రూలింగ్ పార్టీ రాజకీయాలతోనే..

మదర్ డెయిరీలో రూలింగ్​ పార్టీ రాజకీయాలు మితిమీరి పోవడంతో నష్టాలు తీరట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చైర్మన్​ పీఠం కోసం బీఆర్ఎస్​లో జరిగిన రాజకీయాలు సంస్థ ప్రతిష్టను మరింత దిగజార్చాయి. 2021 సెప్టెంబర్‌‌లో ఎన్నికైన చైర్మన్​ కృష్ణారెడ్డి పనితీరు బాగాలేదని చెప్పి 2022లో ఆయన్ని పదవి నుంచి దింపేశారు.  ఇతను  చైర్మన్ కుర్చీని కాపాడుకోవడంలోనే  ఏడాదంతా గడిపారు. దీంతో నష్టాల సంగతి దేవుడెరుగు కొత్తగా రూ.5 కోట్లు అప్పు చేశారు.  సంస్థకు ప్రతి నెలా వచ్చే నికర ఆదాయం కోటి రూపాయలు కూడా పాలకవర్గం ఖర్చులకు చాలట్లేదు. డైరెక్టర్లకు ఎడాపెడా సిట్టింగ్​ఫీజులు చెల్లించడం, చిల్లింగ్​సెంటర్లలోఫ్యాట్​పర్సంటేజీ తగ్గించి అవకతవకలకు పాల్పడడంతో డెయిరీ పాలన గాడి తప్పింది. 

అధికారుల్లో అభద్రత...

రెండేళ్లుగా పాలకవర్గం చర్యల తో ఇటు అధికారులు, అటు ఉద్యోగుల్లో అభద్రత భావం నెలకొంది. ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్ల వ్యవహారంలోమాజీ చైర్మన్​ కృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు వివాదస్పదంగా మారడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రస్తుతం డెయిరీ ఎండీ పోస్టు వివాదంలో చిక్కుకుంది. డెయిరీ మేనేజింగ్​డైరెక్టర్​అశోక్​ అనారోగ్యం కారణంగా కొంత కాలంగా సెలవులో ఉన్నారు. దీంతో ఆయన ప్లేస్​ జీఎం కేడర్​ ఉన్న అధికారికి ఇన్​ చార్జి బాధ్యతలు అప్పగించాలి. కానీ,  రూల్స్​కు విరుద్ధంగా సీజీఎం నాలుగో కేడర్​ కలిగిన అధికారిని ఇన్‌చార్జి డీఎంగా నియమించారు. పైగా సెలవు లో ఉన్న ఎండీ అశోక్​కు కనీసం సమాచారం ఇవ్వకుండానే డీఎం పోస్టు నుంచి తొలగించారు. మూడు రోజుల కింద ఆయన చార్జ్​ తీసుకు నేందుకు వెళ్లగా తొలగించిన విషయాన్ని చెప్పారు. దీంతో అశోక్​ పాలకవర్గం పెద్దలను ఆశ్రయించగా వచ్చే బోర్డ్​ మీటింగ్‌లో పరిశీలిస్తామని దాటవేసినట్లు తెలిసింది.  ఈ విషయమై అశోక్‌ను​ వివరణ కోరగా.. అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నానని,  తనను ఎండీ పోస్టు నుంచి తొలగించడంతో పాలకవర్గాన్ని కోరగా.. వచ్చే బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటామన్నారని  ‘వెలుగుతో చెప్పారు. 

పెరిగిపోతున్న అప్పుల భారం...

2021 నాటికి రూ.13 కోట్లు ఉన్న అప్పులు కాస్తా కొత్త వాటితో కలిపి  రూ.24 కోట్లకు చేరాయి. ఈ రెండేళ్లలోనే రూ.11 కోట్ల అప్పులు చేశారు. డెయిరీ నడపడం కష్టంగా మారిందని 2021లో రూ.5కోట్ల అప్పులు చేయగా, ఈ తొమ్మిది నెలల్లో మరో రూ.6 కోట్లు చేశారు. నల్గొండ డీసీసీబీ నుంచి రూ.7 కోట్ల అప్పుకోసం ప్రయత్నిస్తే అధికారులు తిరస్కరించారు. దీంతో డెయిరీ డెవలప్మెంట్​ కార్పొరేషన్​ నుంచి రూ.3 కోట్లు, ప్రైవేటు బ్యాంకు నుంచి మరో రూ.3 కోట్లు రుణం తీసుకున్నారు. చివరకు టాప్ అప్​లోన్ కూడా తీసు కునే పరిస్థితి వచ్చింది.  పాత అప్పులు రూ.18 కోట్లతో కలిపి మొత్తం బకాయిలు రూ.24కోట్లకు చేరాయి.