గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం : రఘువీర్ రెడ్డి

  • నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి 

దేవరకొండ(చందంపేట, డిండి, నేరేడుగొమ్ము), వెలుగు : గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. గురువారం డిండి మండల కేంద్రంలోని సెంట్రల్ లైటింగ్ రోడ్డు నిర్మాణ పనులు, చందంపేట నుంచి డిండి పీడబ్ల్యూడీ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే బాలునాయక్ తో కలిసి ప్రారంభించారు. చందంపేట మండల పరిధిలోని తిమ్మాపురం నుంచి శాఖవెల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

అంతకుముందు డిండి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నమూనా పనులకు శంకుస్థాపన, శ్రీనిధి మత్స్యశాఖ ద్వారా సబ్సిడీలో సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని తెలిపారు. రాబోయే నాలుగేండ్లు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సీపీ రోడ్లు వేస్తామన్నారు. నియోజకవర్గన్ని ఎంపీ, మంత్రుల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు.   

పల్లె రుచులకు ప్రాధాన్యత ఇవ్వాలి 

హాలియా, వెలుగు : పల్లె రుచులకు ప్రాధాన్యత ఇవ్వాలని నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. గురువారం హాలియాలోని సాగర్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు ప్రీమియం పచ్చళ్ల షాపును ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేసిన రకరకాల పచ్చళ్లను, ఇతర వంటకాలను వివిధ దేశాలకు ఎగుమతి చేయడం అభినందనీయమన్నారు.