- గంజాయి స్మగ్లర్ల రాళ్ల దాడి నుంచి ఆత్మరక్షణ కోసం కాల్పులు
విశాఖపట్టణం: ఏజెన్సీ ప్రాంతమైన లంబసింగిలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. విశాఖ మన్యం నుంచి తెలంగాణ సరిహద్దు జిల్లాలకు అధికంగా గంజాయి సరఫరా జరుగుతున్నట్టు గుర్తించిన నల్గొండ పోలీసులు వారిని పట్టుకునేందుకు విశాఖ ఏజెన్సీకి వచ్చారు. పోలీసుల రాకను ముందుగానే గుర్తించిన స్మగర్లు వారిపై రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఏజెన్సీలోని కోయ్యూరు మండలం తులబాయి గడ్డ వద్ద పోలీసులకు, గంజాయి స్మగ్లర్లకు మధ్య రాళ్లదాడి.. కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం.
గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు నల్గొండకు చెందిన ఇద్దరు సీఐలు, నలుగురు కానిస్టేబుళ్లతో.. గాలిస్తుండగా... 20 మంది గంజాయి స్మగ్లర్లు నల్గొండ పోలీసులకు ఎదురుపడ్డారు. తప్పించుకుని పారిపోయేందుకు స్మగ్లర్లు రాళ్లదాడి చేయడంతో ఆత్మ రక్షణ కోసం పోలీసులు కాల్పులు ప్రారంభించడంతో గంజాయి స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామానికి చెందిన కిల్లో కామరాజు, రాంబాబుకు బుల్లెట్ గాయాలయ్యాయి. స్మగ్లర్ల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కాల్పుల్లో కొంత మంది స్మగ్లర్లకు తీవ్ర గాయాలైనట్టు పోలీసులు చెబుతున్నారు. క్షతగాత్రులను నర్సీపట్నం ఏరియా హాస్పటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నర్సీపట్నం పోలీసులు తెలిపారు. కాల్పులు చోటుచేసుకున్న విషయాన్ని జిల్లా ఎస్పీ రంగనాధ్ కూడా ధ్రువీకరించారు.