మిల్లర్ల సిండికేట్..​ భారీగా వడ్లు రావడంతో ధర తగ్గించిన మిర్యాలగూడ వ్యాపారులు

మిల్లర్ల సిండికేట్..​ భారీగా వడ్లు రావడంతో ధర తగ్గించిన మిర్యాలగూడ వ్యాపారులు
  • పది రోజుల క్రితం 
  • వడ్లు క్వింటాల్ కు ​రూ.2,600.. 
  • ప్రస్తుతం రూ.2 వేలు 
  • గత్యంతరం లేక మిల్లర్లకు అమ్ముకుంటున్న రైతులు

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని రైస్‌‌‌‌ మిల్లర్లు సిండికేట్‌‌‌‌గా మారి అన్నదాతలను నిలువునా దోచుకుంటున్నారు. సీజన్‌‌ ‌‌ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇచ్చిన మిల్లర్లు.. వడ్ల రాక పెరగడంతో మద్దతు ధరకు మంగళం పాడారు. వడ్ల ధరలో పైసా తగ్గించినా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినా మిల్లర్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. జిల్లాలో కొనుగోళ్ల కేంద్రాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడం, వర్షాలు కురుస్తుండడంతో త్వరగా అమ్ముకోవాలన్న ఆతృతతో రైతులు మిల్లర్లు చెప్పిన రేటుకే వడ్లు అమ్ముతున్నారు. మరికొందరు రైతులు మాత్రం మద్దతు ధర చెల్లించాల్సిందేనని ఆందోళనకు దిగుతున్నారు.

మిల్లర్లు చెప్పిందే రేటు..

జిల్లాలో అత్యధికంగా మిల్లులున్న మిర్యాలగూడ, హుజూర్​నగర్ ప్రాంతాల్లో మిల్లర్లు చెప్పిందే రేటుగా సన్న వడ్లను కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని 150కి పైగా మిల్లుల్లో పది రోజుల కిందటే కొనుగోళ్లు ప్రారంభమైనా, సన్న వడ్ల కొనుగోళ్లు కేంద్రాలు మాత్రం ఇంకా ప్రారంభించలేదు. జిల్లాలో సన్న ధాన్యం కొనుగోలు కోసం 75 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీంతో రైతులు మిల్లుల్లోనే తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. పది రోజుల కిందట మిల్లర్లు సన్న వడ్లు క్వింటాల్​కు రూ.2,600 వరకు ధర చెల్లించారు. ఏపీ నుంచి అధికంగా ధాన్యం వస్తుండడంతో ఒక్కసారిగా ధర తగ్గించేశారు. క్వింటాల్​కు రూ.2 వేల లోపే చెల్లిస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. 

పెరిగిన వడ్ల రాక.. తగ్గిన మద్దతు ధర..

మిర్యాలగూడ పరిధిలో వడ్లకు సీజన్ ప్రారంభంలో రూ.2,400 నుంచి రూ.2,600  వరకు చెల్లించిన మిల్లర్లు.. ప్రస్తుతం రూ.2 వేల నుంచి రూ.2,230 లెక్కన ఇస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.2,320 నిర్ణయించగా,వడ్ల రాక పెరగడంతో క్వింటాల్‌‌‌‌ కు రూ.300 నుంచి రూ.400 తగ్గించి మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రైతుల వద్ద మిల్లుర్లు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులను నియమించారు.

 అయినా యాద్గార్ పల్లి, అవంతీపురం, వేములపల్లి మండల పరిధి పలు రైస్ మిల్లుల్లో తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మిల్లర్లు కుమ్మక్కై ఒక్కో రోజు కొన్ని మిల్లుల్లోనే వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ నడిపిస్తున్నారు. వంతులవారీగా మిల్లులను నడుపుతుండడంతో రైతులు రెండు, మూడు రోజులపాటు క్యూలో ఉండాల్సి వస్తోంది. మరో వైపు వాతావారణంలో మార్పులు వస్తుండడంతో రైతులు ఎలాగైనా వడ్లను త్వరగా అమ్ముకోవాలనే ఆలోచనతో ధర విషయంలో రాజీపడుతున్నారు. 

ఏపీ నుంచి జోరుగా వస్తున్న ధాన్యం..

కోదాడ, మిర్యాలగూడ, హుజూర్​నగర్, హాలియా ప్రాంతాల్లోని మిల్లులకు ఏపీలోని నంద్యాల, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి సన్న వడ్ల లారీలు పెద్ద ఎత్తున వస్తున్నట్టు తెలిసింది. దీంతో మిల్లర్లు ధర తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం జిల్లాకు రాకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్టు ఆఫీసర్లు ప్రకటించి వదిలేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

సన్న వడ్లకు సరైన రేటు లేదు..

నాలుగు ఎకరాల్లో సన్న రకం వరి సాగు చేశా. వడ్లను కోసి తుంగపాడు మిల్లుకు తరలించిన. వడ్లు మంచిగున్నా మద్దతు ధర ఇవ్వకుండా క్వింటాల్​కు రూ.2,230 చెల్లిస్తున్నారు. సన్న వడ్లకు సరైన రేటు లేదు. ఆరుగాలం శ్రమించి పండిస్తే తక్కువ ధరకే వడ్లు కొనుగోలు చేస్తున్నారు. పెద్దబోయిన మల్లయ్య, బొర్రాయ పాలెం, త్రిపురారం మండలం