మరికల్, వెలుగు : డ్యూటీని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని నారాయణపేట అడిషనల్ కలెక్టర్ మియాంక్ మిట్టల్ హెచ్చరించారు. సోమవారం మరికల్ ఎంపీడీవో కార్యాలయాన్ని విజిట్ చేసి అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. ఏపీవో, పీఆర్ ఏఈ, సీనియర్ అసిస్టెంట్ రాకపోవడంతో షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఎంపీడీవో యశోదమ్మను ఆదేశించారు. అనంతరం అద్దె భవనంలో కొనసాగుతున్న ఎంపీడీవో కార్యాలయం కోసం ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. ఎమ్మార్సీ భవనంతో పాటు పెద్ద చెరువు పక్కన ఉన్న సింగిల్ విండో గోదాంను చూశారు. తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్‌కు వెళ్లి స్టూడెంట్లతో ఇంగ్లీష్ పాఠాలు చదవించారు. చక్కగా చదవడంతో శభాష్ అని అభినందించారు. అడిషనల్ కలెక్టర్ వెంట జడ్పీ సీఈవో జ్యోతి, ఎంపీవో బాలాజీ ఉన్నారు.
స్టూడెంట్లు సైంటిస్టులు అవ్వాలి:జడ్పీ చైర్పర్సన్ వనజమ్మ
నారాయణపేట, వెలుగు: స్టూడెంట్లు చిన్నప్పటి నుంచే సైన్స్‌పై ఆసక్తి పెంచుకుని సైంటిస్టులుగా తయారు కావాలని జడ్పీ చైర్పర్సన్ వనజ సూచించారు. జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌ను కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు రూపొందించిన ఎగ్జిబిట్లను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సైన్స్లేకపోతే దేశ భవిష్యత్ లేదని, స్టూడెంట్లు సమాజానికి అవసరం అయ్యే కొత్త ఆవిష్కరణలపై ఫోకస్ పెట్టాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సాంకేతిక పరిజ్ఞానమే పరిష్కారం చూపుతుందన్నారు. స్టూడెంట్లు క్రియేట్ చేసిన ఎగ్జిబిట్లలో ఎన్నో కొత్త అంశాలున్నాయని అభినందించారు. అంతకుముందు విద్యార్థుల సాంస్కృత్రిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీఈవో గోవిందరాజులు, మున్సిపల్ చైర్పర్సన్ గందెఅనసూయ, జడ్పీటీసీ అంజలి, కాలేజీ ప్రిన్సిపల్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ టూరిజం హబ్‌గా పాలమూరు:ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, వెలుగు : పాలమూరును మెడికల్ టూరిజం హబ్‌గా మార్చేందుకు అమెరికాకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఓల్డ్ కలెక్టరేట్ఆఫీస్లో సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. మిడిల్ ఈస్ట్, అమెరికా నుంచి వైద్యం కోసం మన దేశానికి వస్తుంటారని, ఇందులో భాగంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించి మెడికల్ టూరిజాన్ని ఆకర్షిస్తామని చెప్పారు. పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మించనున్న ఈ హాస్పిటల్ పనులకు వారం, పది రోజుల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు భూమి పూజ చేస్తారని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న కోర్టు కాంప్లెక్స్‌లో సరైన వసతులు లేవని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా అధునాతన కోర్టు భవనం నిర్మించేందుకు అంగీకరించారని తెలిపారు. పీయూ పక్కన బైపాస్ రోడ్డు సమీపంలో పది ఎకరాల స్థలంలో కోర్టు భవనాన్ని నిర్మించనున్నట్లు వివరించారు. సమావేశంలో కలెక్టర్ ఎస్.వెంకట్‌రావు ఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
తుల్జభవానీ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి
హన్వాడ మండలంలోని తువ్వగడ్డ తండాలో ఎస్టీ సెల్ అధ్యక్షుడు హరిచంత్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన తుల్జా భవానీ ఉత్సవాల్లో సోమవారం -ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులు మంత్రికి లంబాడీ నృత్యాలు, ఆటపాటలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి భవానీ మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయనిర్మల పాల్గొన్నారు.
సౌత్‌జోన్ పోటీలను పీయూ జట్ల ఎంపిక
మహబూబ్‌నగర్ రూరల్, వెలుగు : ఈ నెల 23 నుంచి 27వ వరకు వరకు చెన్నైలోని ఎస్ఆర్ఎంలో, ఈ నెల 27 నుంచి 31వ వరకు కేరళలోని కొట్టాయం మహాత్మా గాంధీ యూనివర్సిటీలలో జరిగే వాలీబాల్ పోటీలకు పాలమూరు యూనివర్సిటీ జట్లను సోమవారం ఎంపిక చేశారు. వాలీబాల్ మహిళాల విభాగంలో 63 మంది సెలక్షన్స్‌లో పాల్గొనగా 16 మందిని, పురుషుల విభాగంలో 50 మంది పాల్గొనగా 16 మందిని సెలెక్ట్ చేసినట్లు పీడీ ఐయూటీ సెక్రటరీ కె.బాలరాజ్ గౌడ్ తెలిపారు.
బెంగళూరు వెళ్లిన కబడ్డీ టీమ్
బెంగళూరులోని సిటీ యూనివర్సిటీలో బుధవారం నుంచి జరిగే యూనివర్సిటీ సౌత్ జోన్ కబడ్డీ పోటీలకు పాలమూరు యూనివర్సిటీ క్రీడాకారులు సోమవారం బయల్దేరి వెళ్లారు. వీరికి పీయూ వైస్ ఛాన్సలర్ ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్ ట్రాక్ షూట్, క్రీడా దుస్తులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కబడ్డీలో రాణించి పీయూకు ఖ్యాతిని తీసుకురావాలని కోరారు.
ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలి:టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, నారాయణపేట, నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: తప్పులతడకగా ఉన్న ధరణి పోర్టల్‌ను వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి డిమాండ్ చేశారు. సోమవారం టీపీసీసీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించి.. కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో మల్లు రవి, వనపర్తిలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి, గద్వాలలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ ధరణితో భూ సమస్యలు పెరగాయే తప్ప తగ్గలేదన్నారు. ముఖ్యంగా చిన్న, సన్న కారు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పోడు భూములను సాగు చేస్తున్న రైతులపై ఫారెస్టు ఆఫీసర్లు దాడులు చేస్తున్నారని, సర్కారు వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేయాలని, కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, నారాయణపేటలో కలెక్టరేట్‌కు ర్యాలీగా కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి, కొందరిని మాత్రమే కలెక్టరేట్‌కు తీసుకెళ్లారు. డీసీసీ ప్రెసిడెంట్లు ఉబేదుల్లా కొత్వాల్, వాకిటి శ్రీధర్, పటేల్ ప్రభాకర్ రెడ్డి, వంశీకృష్ణ, శంకర్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ , నేతలు నాగరాజు గౌడ్, రఘుపతి రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వినోద్ కుమార్, సీజే బెనహర్, తిరుపతయ్య, ప్రదీప్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, నాగం శశిధర్ రెడ్డి, అర్థం రవి, అభిలాష్ రావు, వీర బాబు, బలిగేర నారాయణరెడ్డి, షెక్షావలి, జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు .
12 నుంచి కొత్త కలెక్టరేట్‌లో ప్రజావాణి:కలెక్టర్ ఎస్.వెంకట్ రావు
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వచ్చే సోమవారం నుంచి కొత్త కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు తెలిపారు. ఇందుకోసం అన్ని శాఖల ఆఫీసులను వచ్చే బుధవారంలోగా ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం రెవెన్యూ మీటింగ్ హాల్‌లో ప్రజావాణి అనంతరం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ జిల్లా కార్యాలయాలన్ని ఒకే చోట ఉంటే ప్రజలకు ఎంతో ఉపయోగమన్నారు. అనంతరం వైద్యకారణాలతో రిటైర్‌మెంట్, వారసత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించారు. వైద్యకారణాలతో సర్వీస్ నుంచి రిటైర్ అయ్యే ఎంప్లాయీస్ కు సంబంధించి జిల్లా స్థాయి కమిటీ పరిశీలించాకే అనుమతులిస్తామని స్పష్టం చేశారు.