- పోలీసులకు చిక్కకుండా నైజీరియన్స్ ఎత్తులు
- సిగరెట్ బాక్స్‌లో ప్యాకింగ్, అర్ధరాత్రి టైమ్‌లో సప్లయ్
- మ్యూల్ అకౌంట్స్‌తో డబ్బులు వసూలు
- రెండు గ్యాంగులకు చెందిన ఐదుగురు అరెస్ట్
- 130 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ,10 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న నైజీరియన్ ముఠా గుట్టురట్టయింది. ‘డెడ్ డ్రాప్’ లొకేషన్ షేరింగ్ పద్ధతిలో డ్రగ్స్ డెలివరీ చేస్తున్న రెండు నైజీరియన్ గ్యాంగ్‌లకు చెక్ పెట్టారు. ఇద్దరు నైజీరియన్లు సహా ఐదుగురిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్‌న్యూ) పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి 130 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ, 10 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.20.75 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు.
నైజీరియాకు చెందిన కుర్బా స్టూడెంట్ వీసాపై హైదరాబాద్‌కు వచ్చాడు. బెంగళూరు, గోవా నుంచి ఎమ్‌డీఎమ్‌ఏ, కొకైన్ తీసుకొచ్చి సప్లయ్ చేసేవాడు. 2022లో హెచ్‌న్యూ పోలీసులు కుర్బాను అరెస్ట్ చేశారు. అనంతరం విడుదలైన అతను సిటీలో పోలీసుల నిఘా పెరగడంతో బెంగళూరుకు మకాం మార్చాడు. హైదరాబాద్‌లో డ్రగ్స్ డెలివరీ కోసం నైజీరియా, టాంజానియా, సూడన్, పాలస్తీనాలకు చెందిన వారితో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. డ్రగ్స్ డెలివరీ చేస్తే 40 శాతం కమీషన్ ఇచ్చేవాడు. టోలీచౌకీలో నివాసం ఉంటున్న సూడాన్ దేశస్తుడు మహ్మద్ అబ్దుల్ రెహమాన్ ఉస్మాన్ అలియాస్ హనీన్( 24)తో కాంటాక్ట్ పెంచుకున్నాడు. హనీన్ బెంగళూరుకు వెళ్లి ఎమ్‌డీఎమ్‌ఏ, కొకైన్ సహా ఇతర డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చేవాడు.
మ్యూల్ అకౌంట్స్‘డెడ్‌డ్రాప్’ లొకేషన్‌తో డెలివరీ..
కస్టమర్లతో ఎలాంటి కాంటాక్ట్ లేకుండా ‘డెడ్‌డ్రాప్’ సిస్టమ్‌తో కుర్బా గ్యాంగ్ డ్రగ్స్‌ను డెలివరీ చేసేది. డార్క్ వెబ్‌తో పాటు ఇతర సోషల్‌మీడియా ఫ్లాట్‌పామ్స్‌పై కూడా ఆర్డర్స్ తీసుకునేవారు. గూగుల్ పే ద్వారా డబ్బులు కలెక్ట్ చేసేవాడు. కస్టమర్లు కోరిన డ్రగ్ వివరాలను టోలీచౌకీలోని హనీన్‌కు పంపించేవాడు. పేమెంట్, డ్రగ్ వివరాలను కోడ్ భాషలో వాట్సాప్‌లో షేర్ చేసేవాడు. కస్టమర్ అడ్రస్‌ను, వారి ఫొటోను కూడా పంపేవాడు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం నకిలీ బ్యాంక్ అకౌంట్స్ (మ్యూల్) వినియోగించేవారు. సిగరెట్ బాక్స్‌లో డ్రగ్స్ ప్యాక్ చేసి, సిటీలోని నిర్మానుష్య ప్రాంతాల్లో బెంగళూరులో ఉన్న కుర్బా ఆదేశాలతో అర్ధరాత్రి12 దాటాక డ్రగ్స్ సప్లయ్ చేసేవారు. ఈ గ్యాంగ్ గురించి తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. బెంగళూరులో ఉన్న కుర్బాను, హైదరాబాద్‌లోని హనీన్‌ను అరెస్ట్ చేశారు.
వీరి నుంచి రూ.7.74 లక్షల విలువ చేసే 50 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే, బెంగళూరులో నివాసం ఉంటున్న మరో నైజీరియన్ చుకవ్ ఎక్‌బాయ్ కేరళ, హైదరాబాద్‌కు చెందిన పెడ్లర్లకు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న హెచ్‌న్యూ పోలీసులు.. కేరళకు చెందిన నందకుమార్ అలియాస్ లాలు(25), హైదరాబాద్‌కు చెందిన కొడిదెల నవీన్(24), బంజారాహిల్స్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్(29)ను అరెస్ట్ చేశారు. వీరి వద్ద రూ.13 లక్షలు విలువ చేసే 80 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ, 10 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను సీజ్ చేశారు.
కస్టమర్లపై కఠిన చర్యలు..
ఈ రెండు డ్రగ్స్ గ్యాంగ్స్ నుంచి సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నాం. వాట్సాప్ చాటింగ్స్, కాంటాక్ట్స్ ఆధారంగా 24 మంది కస్టమర్లను గుర్తించాం. ఇందులో గుంటూరుకు చెందిన వ్యక్తితో పాటు హైదరాబాద్‌లోని బిజినెస్, ఐటీ, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వారి వివరాలు సేకరించాం. అవసరమైతే అందరినీ అరెస్ట్ చేస్తాం. రీహబిలిటేషన్స్ సెంటర్స్‌కి తరలిస్తాం. డ్రగ్స్ డిమాండ్ తగ్గించేందుకు కస్టమర్లపై కఠినంగా వ్యవహరిస్తాం. – సీపీ సీవీ ఆనంద్