నర్సాపూర్-ధర్మవరం రైలు కు ఆదివారం( జులై 30)న పెను ప్రమాదం తప్పింది. ఈ మధ్య వరుస రైలు ప్రమాదాలు రైలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నెలలో కనీసం రెండు ప్రమాదాలైన జరుగుతున్నాయి. ఈ రెండు , మూడు నెలల్లో గోదావరి ఎక్స్ ప్రెస్ , కోరమాండల్ ఎక్స్ ప్రెస్ , ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ తదితర రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా నర్సాపూర్ – ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని దుండగులు రైలు పట్టా ముక్కను అడ్డుగా పెట్టారు. ట్రాక్‌పై పట్టాను రైలు ఢీకొట్టింది. ఈ క్రమంలో రైలు పట్టా పక్కకు పడిపోవడంతో పెను ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కావలి – బిట్రగుంట మధ్య ఎగువ మార్గంలో ముసునూరు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెండు మీటర్ల రైలు పట్టా ముక్కను ట్రాక్ పై అడ్డుగా పెట్టారు. అదే మార్గంలో నర్సాపురం – ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది. ఆ పట్టా ముక్కను రైలు ఢీకొట్టింది.ఈ క్రమంలో రైలు బలంగా ఢీకొనడంతో పట్టా ముక్క ట్రాక్ పై నుంచి పక్కకు పడిపోయింది. లేకపోతే పెను ప్రమాదం జరిగేదని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఆర్‌పీఎఫ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైల్వే ట్రాక్‌పై అడ్డుగా పట్టా ముక్కను ఎవరు పెట్టి ఉంటారనే కోణంలో విచారణ చేస్తున్నారు.