![మేడిగడ్డపై రిపోర్ట్ ఏది?..ఇప్పటికీ ఇవ్వని ఎన్‌డీఎస్‌ఏ కమిటీ](https://static.v6velugu.com/uploads/2025/02/national-dam-safety-authority-committee-is-not-deciding-on-the-condition-of-medigadda-barrage_IegwXyjW4c.jpg)
- ప్రభుత్వం అడిగినా, కమిషన్ అడిగినా నో ఆన్సర్
- డిసెంబర్లో ఇవ్వాల్సి ఉన్నా స్పందన లేదు
- రిపోర్ట్ వస్తేనే సర్కారు ముందుకు వెళ్లే చాన్స్
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) కమిటీ ఎటూ తేల్చడం లేదు. బ్యారేజీలపై తుది నివేదిక ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నది. ఇటు ప్రభుత్వం పదే పదే రిక్వెస్ట్ చేసినా.. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ అడిగినా.. నివేదిక ఇవ్వడంలో లేట్ చేస్తున్నది. బ్యారేజీ కుంగినప్పుడు దానిపై ఇన్వెస్టిగేషన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌డీఎస్‌ఏకి లేఖ రాసింది. దీంతో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఎన్‌డీఎస్‌ఏ ఏర్పాటు చేసింది. పలు దఫాలుగా బ్యారేజీలను సందర్శించడం, అధికారులతో మీటింగ్ అనంతరం.. గత ఏడాది మేలో కమిటీ మధ్యంతర నివేదికను కమిటీ సమర్పించింది. అందులో తాత్కాలిక చర్యలను సిఫార్సు చేసిన కమిటీ.. తుది నివేదికను డిసెంబర్ నాటికి ఇస్తామని చెప్పింది. కానీ, ఇప్పటికీ ఇవ్వడం లేదు.
సాకులు చెప్తూ లేట్..!
మేడిగడ్డ బ్యారేజీ విషయంలో తుది నివేదిక ఇవ్వడం సాధ్యం కాదని ఎన్‌డీఎస్‌ఏ పదే పదే చెప్తున్నది. కారణం, మేడిగడ్డ బ్యారేజీ వద్ద పలు జియోఫిజికల్, జియో టెక్నికల్ టెస్టులు చేయాలని ఎన్‌డీఎస్‌ఏ సూచించింది. జియోఫిజికల్ టెస్టులను పూర్తి చేసినా.. జియోటెక్నికల్ టెస్టులను మాత్రం అధికారులు చేయలేదు. బోర్‌హోల్ డేటాను సేకరించలేదు. దానికి బదులు మేడిగడ్డ కింద అగాథాన్ని గ్రౌటింగ్ చేసి పూడ్చారు. ఫలితంగా అక్కడ ఎవిడెన్స్‌ను మాయం చేశారని, ఇప్పుడు టెస్టులు చేసినా ఫలితం ఉండదని ఎన్‌డీఎస్‌ఏ వాదిస్తున్నది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి విజ్ఞప్తి చేసినా.. ఎన్‌డీఎస్‌ఏ స్పందించలేదు. తుది నివేదికపై చడీచప్పుడు చేయడం లేదు. బ్యారేజీ విషయంలో ఏదో ఒకటి తేలిస్తే దానికి తగ్గట్టు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.