చివరివరకూ అదే నమ్మకంతో ఉన్నా : నవీన్ చంద్ర

చివరివరకూ అదే నమ్మకంతో ఉన్నా : నవీన్ చంద్ర

నవీన్ చంద్ర హీరోగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో సాయి అభిషేక్ నిర్మించిన చిత్రం ‘28 డిగ్రీస్ సెల్సియస్’. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ ‘‘ఆరేళ్ల క్రిందట ఈ సినిమా ప్రయాణం మొదలైంది. అనిల్ విశ్వనాథ్‌‌ చెప్పిన స్టోరీ లైన్‌‌ యూనిక్‌‌గా అనిపించింది. అప్పటికి నాపై ‘అందాల రాక్షసి’ ప్రభావం చాలా ఉండేది.  ఓ లవ్‌‌ స్టోరీతో సాగే ఎమోషనల్ థ్రిల్లర్ కావడంతో వెంటనే ఓకే చెప్పాను. కథ ప్రకారం మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అయిన కార్తీక్, అంజలి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. 

వాళ్లిద్దరు డాక్టర్స్‌‌గా సెటిల్ అవుతారు. అయితే అంజలికి అనారోగ్య సమస్య వల్ల ఆమెను 28 డిగ్రీ టెంపరేచర్‌‌‌‌లోనే చూసుకోవాలి. ఈ క్రమంలో ఆ జంట చేసిన ఎమోషనల్ జర్నీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌తో ఆసక్తికరంగా సాగుతుంది. ఇందులో నేను మినహా అంతా కొత్తవాళ్లే. కంటెంట్‌‌పై ఉన్న కాన్ఫిడెన్స్​తో పాటు ఫస్ట్ డే షూట్ తర్వాత అనిల్ బాగా హ్యాండిల్ చేయగలడనే నమ్మకం ఏర్పడింది. చివరివరకూ అదే నమ్మకంతో ఉన్నా. జార్జియా వెళ్లినప్పుడు రెండుసార్లు రిజెక్ట్ అవడం మొదలు.. రిలీజ్‌‌ ఇబ్బందుల వరకూ ఎన్నో  అవరోధాలు ఎదురయ్యాయి.

అయితే థియేటర్‌‌‌‌లోనే కాదు టీవీ, ఓటీటీల్లో ఎక్కడ విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం  నాకుంది. ఫైనల్‌‌గా డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారు  సినిమా చూసి రిలీజ్ చేస్తానని ముందుకు రావడం సంతోషంగా ఉంది.   ప్రస్తుతం రవితేజ గారి ‘మాస్‌‌ జాతర’లో నటిస్తున్నా. నన్ను ఇందులో ఓ సరికొత్త క్యారెక్టర్‌‌‌‌లో చూస్తారు. షో టైమ్, 11  సినిమాలతో పాటు ఇన్ స్పెక్టర్ రిషి’ వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతోంది’’ అని చెప్పాడు.