త్వరలో 26 రాఫెల్ మెరైన్ జెట్స్ : నేవీ చీఫ్​ అడ్మిరల్​ డీకే త్రిపాఠి

త్వరలో 26 రాఫెల్ మెరైన్ జెట్స్ : నేవీ చీఫ్​ అడ్మిరల్​ డీకే త్రిపాఠి

న్యూఢిల్లీ: తీర ప్రాంతాల్లో గస్తీ కోసం 26 రాఫెల్  మెరైన్  జెట్లతో పాటు మూడు అదనపు సబ్ మెరైన్లను కొనుగోలు చేయనున్నామని నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే త్రిపాఠి తెలిపారు. ఆ విమానాలు, జలాంతర్గాములకు సంబంధించిన కొనుగోలు ఒప్పందం వచ్చే నెలలో జరగవచ్చని వెల్లడించారు. సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో త్రిపాఠి మాట్లాడారు. పాకిస్తాన్, చైనా నేవీ కార్యకలాపాలను గమనిస్తున్నామని చెప్పారు. 

‘‘ఫ్రాన్స్  నుంచి రాఫెల్  మెరైన్లను కొనుగోలు చేస్తున్నాం. ఆ జెట్ విమానాల ప్రొక్యూర్ మెంట్  కీలక దశలో ఉంది. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం పొందడం ఒక్కటే మిగిలింది. అది గవర్నమెంట్ టు గవర్నమెంట్  డీల్  కావడంతో ప్రొక్యూర్ మెంట్​కు పెద్దగా టైం పట్టకపోవచ్చు. ఫ్రాన్స్  నుంచి రాఫెల్  ఎం జెట్ల కొనుగోలు కోసం రక్షణ మంత్రి రాజ్​నాథ్  సింగ్ నిరుడు జులైలో ఆమోదం తెలిపారు. యుద్ధ విమానాలను తీసుకెళ్లే, దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్​పై రాఫెల్ ఎం జెట్లను మోహరిస్తాం” అని త్రిపాఠి తెలిపారు.