
- ఏడాది కిందే చెప్పినా ఎందుకు పట్టించుకోలే?
- ఏపీని నిలదీసిన ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్
- వర్షాకాలంలోపు రిపేర్లు చేయకపోతే ప్రాజెక్ట్ కే ముప్పు
- ఇంత డ్యామేజ్ జరిగితే నిర్లక్ష్యం ఎందుకని ఫైర్
- ప్రాజెక్ట్ మెయింటెనెన్స్‌పై ఎన్డీఎస్ఏకు తెలంగాణ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్‌లో పడిన గొయ్యికి మే నెలలోపు రిపేర్లు చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏపీని ఆదేశించింది. వర్షాకాలం సీజన్ ప్రారంభమయ్యేలోపు అన్ని మరమ్మతులు చేయాలని, లేదంటే ప్రాజెక్టు మనుగడకే ముప్పు అని హెచ్చరించింది. ప్రాజెక్టుకు వచ్చే గరిష్ట వరదపై మరోసారి అధ్యయనం చేయించాలని ఆదేశించింది. శ్రీశైలం ప్రాజెక్టు రిపేర్లపై ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్ష నిర్వహించారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని ఏడాది కిందే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చినా.. ఎందుకు పట్టించుకోలేదని ఏపీని ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ప్రశ్నించారు. ఇంత పెద్ద డ్యామ్‌కు దిగువన 143 అడుగుల కింది వరకు ఏర్పడిన ప్లంజ్‌పూల్ గొయ్యికి వెంటనే రిపేర్లు చేయించాలని చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడమేంటని మండిపడ్డారు. అయితే, ఎన్డీఎస్ఏ ఇచ్చిన సిఫార్సులను అధ్యయనం చేసిన తర్వాత పుణెకి చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)కు బాధ్యతలు అప్పగించామని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు వివరించారు.
శ్రీశైలానికి ఓనర్ ఎవరు?
శ్రీశైలం ప్రాజెక్టు ఎవరి అధీనంలో ఉందని, ఓనర్ ఎవరని అనిల్ జైన్ ప్రశ్నించారు. ఇప్పటికీ ఓ స్పష్టత లేదని ఏపీ సమాధానం చెప్పింది. ప్రాజెక్టు నిర్వహణను ఎవరు చూస్తున్నారని అనిల్ జైన్ ప్రశ్నించగా.. తామే చూస్తున్నామంటూ ఏపీ బదులిచ్చింది. అలాంటప్పుడు డ్యామ్‌పై పూర్తి బాధ్యత మీది కాదా? అని అనిల్ జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ చూసే వాళ్లే డ్యామ్‌కు ఓనర్ అన్న విషయం తెలియదా? అని మండిపడ్డారు. శ్రీశైలం ఓనర్‌గా ఆ ప్రాజెక్ట్ సీఈ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఓనర్‌గా నల్గొండ సీఈలు ఉండాలని తేల్చి చెప్పారు. ఆ రెండు ప్రాజెక్టుల పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదేనని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
టెట్రాపాడ్స్‌తో గొయ్యిని పూడ్చండి
శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్‌పూల్‌లో ఏర్పడిన గొయ్యిని కాంక్రీట్ టెట్రాపాడ్స్‌తో పూడ్చాల్సిందిగా ఎన్డీఎస్ఏకి తెలంగాణ ఈఎన్సీ జి.అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జియోలాజికల్ స్టడీస్, డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ పరీక్షలు నిర్వహించేలా ఏపీని ఆదేశించాలన్నారు. 2009లో వచ్చిన భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు కొంత కుదుపులకు లోనైందని గుర్తు చేశారు. ఆ ఏడాది ఎన్నడూ లేనంతగా 24 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైందన్నారు. దీంతో ప్రాజెక్టులోని ప్రెజర్ సెల్స్ పనిచేయడం లేదని వివరించారు. డ్యామ్ గ్యాలరీలోని డ్రైనేజీ రంధ్రాలు మూసుకుపోయాయన్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో భూకంపాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన పరికరాలూ పనిచేయడం లేదని, వాటిని ఏపీ పట్టించుకోవడం లేదని ఎన్డీఎస్ఏకి అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు.
గెజిట్ ప్రకారం శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అయితే, ప్రస్తుతం ఆ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నదని, నీటి పంపకాలపై ట్రిబ్యునల్‌లో వాదనలు జరుగుతున్నాయని, అలాంటప్పుడు బోర్డుకు ప్రాజెక్టులను ఎలా అప్పగిస్తామని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సీఈ ప్రమీల, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ మోహన్ కుమార్, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యప్రసాద్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వర రావు, శ్రీశైలం సీఈ కబీర్ బాషా తదితరులు హాజరయ్యారు.