పుణె: టోక్యో ఒలింపిక్స్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా బుధవారం తన ఫేవరేట్ హీరో, హరియాణ నటుడు రణ్ దీప్ హుడాని కలుసుకున్నాడు. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్ స్టిట్యూట్ లో కలిసి ఫోటో దిగాడు. యాదృచ్చికమో కాకతాళీయమో గానీ ఇద్దరూ తెల్లని కుర్తాలోనే ఉన్నారు. భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లేలా చేసిన నీరజ్ చోప్రా తనను కలవడంపై హీరో రణ్ దీప్ హుడా సంతోషం వ్యక్తం చేస్తూ ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్టు చేశాడు. ఫోటోకు జతగా ‘‘సాధారణ స్థితి నుంచి అసాధారణ స్థాయికి ఎవరు చేరుకుంటారు.. ఎక్కడ చేరుకుంటారనే ప్రశ్నలకు కొద్ది మంది దగ్గరే సమాధానం ఉంటుంది. నువ్వు కూడా అలా అందనంత ఎత్తు ఎదిగిన అరుదైన కోవలోని వ్యక్తిగా నిలిచావు తమ్ముడూ అంటూ రణ్ దీప్ హుడా తన ఇన్ స్టాలో కామెంట్ రాసుకున్నాడు.
ఈనెల 16న ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రా తాను తరచూ హిందీ, ఇంగ్లీష్, పంజాబీ సినిమాలు చూస్తానని.. రణ్ దీప్ నటన అంటే చాలా ఇస్టమని.. ఆయన నటించిన హరియాణ యాసలోని ‘‘లాల్ రంగ్’’ అంటే చాలా ఇష్టమని నీరజ్ చోప్రా తెలిపాడు. అలాగే రణ్ దీప్ హుడా నటించిన మిగిలిన సినిమాల్లో హైవే, సర్పజీత్ కూడా చాలా బాగున్నాయి అని నీరజ్ చెప్పాడు. నీ ఆటో బయోపిక్ లో ఎవరు నటిస్తే బాగుంటుందని చెప్పగా.. ఇంకెవరు రణ్ దీప్ హుడానే, ఆయన కాకపోతే మరో చాయిస్ అక్షయ్ కుమార్ అంటూ నీరజ్ చోప్రా బదులిచ్చాడు. హరియాణకు చెందిన ఇద్దరికీ క్రీడలంటే చాలా ఇష్టం. నీరజ్ చోప్రా క్రీడల్లో సాధన చేసి బంగారు పతకం సాధించగా.. రణ్ దీప్ హుడా మాత్రం సినిమా రంగంలో ఉత్తరాది వారిని ముఖ్యంగా పంజాబీ వారిని ఆకట్టుకునే సినిమాలు చేస్తూ చెరగని ముద్ర వేసుకున్నారు.