Cricket World Cup 2023: నెదర్లాండ్స్ అని లైట్ తీసుకుంటే.. మన కపిల్ దేవ్ రికార్డ్ బ్రేక్ చేశారు

Cricket World Cup 2023:  నెదర్లాండ్స్ అని లైట్ తీసుకుంటే.. మన కపిల్ దేవ్ రికార్డ్ బ్రేక్ చేశారు

పసికూన జట్టుగా భావించిన నెదర్లాండ్స్ వరల్డ్ కప్ లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో ఈ మెగా టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. జట్టు సమిష్టి ప్రదర్శన చేసినా ఈ  విజయంలో ప్రధాన పాత్ర మాత్రం కెప్టెన్ స్కాట్ ఎడ్వార్డ్స్ కే వెళ్తుంది. ఒకదశలో జట్టు స్కోర్ 112 పరుగులకే 6 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 

ఈ సమయంలో డచ్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టదని చాలా మంది భావించారు. కానీ ఎడ్వార్డ్స్ అసాధారణ పోరాటంతో నెదర్లాండ్స్ జట్టు 43 ఓవర్లలో ఏకంగా 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎడ్వార్డ్స్ 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో  68 బంతుల్లో 78 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ క్రమంలో భారత లెజెండరీ కపిల్ దేవ్ 36 ఏళ్ళ రికార్డ్ బ్రేక్ చేసాడు.  

ప్రపంచకప్ చరిత్రలో నెంబర్ 7 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా ఎడ్వార్డ్స్ తన  పేరు మీద రికార్డ్ లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్  టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ పేరిట ఉంది. 1987 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌పై 72* పరుగులు చేసాడు. తాజాగా.. ఈ 36 ఏళ్ల రికార్డును డచ్ కెప్టెన్ అధిగమించాడు. ఓవరాల్‌గా ఈ రికార్డ్..నాథన్ కౌల్టర్-నైల్  పేరిట ఉంది. 2019 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై కౌల్టర్ నైల్ 60 బంతుల్లో 92 పరుగులు చేసాడు.  

               
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. కెప్టెన్ ఎడ్వార్డ్స్ 68 బంతుల్లో 78 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ కి తోడు వాండెర్ మెర్వ్ (29) ఆర్యన్ దత్ (23) రాణించారు. ఇక లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో సౌత్ ఆఫ్రికా 207 పరుగులకు ఆలౌటైంది. మిల్లర్ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.