![భూభారతి సమగ్రమేనా?.. అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందా?](https://static.v6velugu.com/uploads/2025/02/new-bhubharati-act-2024-to-replace-dharani-act-is-perfect_X4ruat5scd.jpg)
కాంగ్రెస్ ప్రభుత్వ హామీ మేరకు ‘ధరణి’ చట్టం స్థానంలో కొత్త ‘భూభారతి చట్టం 2024’ను రూపొందించి అసెంబ్లీ సమావేశంలో ఆమోదించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం తెచ్చిన ఆర్ఓఆర్ 2020 (ధరణి) చట్టం ఆసరాగా భూ రికార్డుల్లో అనేక అక్రమాలు జరిగాయని, అన్ని సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త భూభారతి చట్టాన్ని రూపొందించామని రెవెన్యూ శాఖ మంత్రి సభలో చెప్పారు.
కొత్త చట్టం తీసుకురావలసిన ఆవశ్యకతను పరిశీలిస్తే, ధరణి చట్టం రాకముందు రాష్ట్రంలో ఆర్ఓఆర్ చట్టం 1971, దానికి అనుగుణంగా 1989లో రూపొందించిన నిబంధనల మేరకు భూరికార్డులు రాత పూర్వకంగా (2010 నుంచి వెబ్ పహానీలు వచ్చాయి) అందరు భూయజమానులకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో లోపాలను సరిదిద్దుతామని గత ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన చేపట్టింది.
నాటి ప్రక్షాళన ద్వారా 90 శాతానికిపైగా రికార్డులు జరిగినట్టు అధికారులు చెప్పినా, క్షేత్రస్థాయిలో సుమారు 25-30 శాతం వరకు ప్రక్షాళన జరగలేదు. ప్రక్షాళనలో సేక రించిన సమాచారం ధరణి పోర్టల్‌కు అప్లోడ్ చేసే సమయంలో అనేక తప్పులు నమోదుకావడం, వాటిని సరిచేయడానికి చట్టంలో ఎవరికీ అధికారాలు లేకపోవడం, తర్వాత 33 పైగా మాడ్యూల్స్ ద్వారా (ఆన్లైన్) సరిదిద్దడానికి మొదటగా జిల్లా కలెక్టర్లకే అన్ని అధికారాలను కల్పించడంతో అనేక దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇవికాక పార్ట్ బి సమస్యలు, నిషేధిత (22ఎ) జాబితాలో ఎటువంటి ఉత్తర్వులు లేకుండా పట్టాభూములు చేర్చడం జరిగింది.
సలహాలు మరిన్ని తీసుకోవాల్సింది
ధరణి పోర్టల్‌లోని తప్పులను పరిష్కరించడానికి వేసిన అధ్యయన కమిటీ చేసిన సిఫార్సుల మేరకు అన్ని వర్గాల సూచనలు తీసుకొని కొత్త ఆర్ఓఆర్ చట్టం తెచ్చారు. అయితే, రెవెన్యూ విభాగంలో వివిధ హోదాల్లో పనిచేసే క్షేత్రస్థాయిలో, వివిధ చట్టాలను అమలుచేసిన అనుభవంగల రిటైర్డ్ రెవెన్యూ ఉన్నతాధికారుల అభిప్రాయాలు, సలహాలను కొత్త చట్టం తయారీలో పట్టించుకోలేదని వారు కొంత మనస్తాపానికి గురవుతున్నారు. డ్రాఫ్ట్ బిల్లుపై అన్ని వర్గాల నుంచి సూచనలు కోరడానికి, చర్చ జరగడానికి సరైన సమయం ఇవ్వాల్సింది.
సెక్షన్ (20) రికార్డ్ ఆఫ్ రైట్స్ రాతపూర్వకంగా లేదా ఎలక్ట్రానికల్‌గా లేదా రెండు రకాలుగా చెపుతూనే సెక్షన్ 13(1)లో సెక్షన్ 4, 5, 6, 7, 8 ప్రకారం చేసిన మార్పులను ఎలక్ట్రానికల్‌గా విలేజ్ అకౌంట్‌ను పొందుపరుస్తారు అని చెప్పారు. ఈ చట్టం ప్రకారం తయారు చేస్తే విలేజ్ అకౌంట్‌ను గానీ, ఏ రికార్డు అయిన అటు రాతపూర్వకంగా, ఎలక్ట్రానికల్‌గా రూపొందించి, ఆ ఆర్వోఆర్ రికార్డును ఏటా గ్రామంలో రికార్డింగ్ అథారిటీ సంతకంతో పబ్లిష్ చేయడమేగాకుండా, దాని కాపీలను ఆఫీసులలో ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఆ విలేజ్ అకౌంట్లో లేదా ఆర్వోఆర్లో రెవెన్యూ గ్రామంలోని అన్ని సర్వే నంబర్ల వివరాలు ఉండాలి.
సెక్షన్ (21) ప్రకారం రికార్డింగ్ అథారిటీగా తహసీల్దార్ లేదా ఆర్డీవో ఉండవచ్చు. వీరికి రికార్డుల తయారీ, అప్డేటింగ్, నిర్వహణ అధికారం ఉంటుంది. రికవరింగ్ అథారిటీ ఎవరన్నది స్పష్టత వస్తేనే మిగతా అంశాలపై తీసుకునే చర్యలు ఆధారపడి ఉంటాయి. 1971 చట్టంలో రికార్డింగ్ అథారిటీగా తహసీల్దార్‌కు అధికారం కల్పించారు.
సెక్షన్ 4(1) ప్రకారం హక్కుల రికార్డును నమోదుచేసే అధికారి ఎప్పటికప్పుడు నిర్ణీత నమూనాలో నవీకరిస్తారు. కానీ, ఇదే సెక్షన్ సబ్ సెక్షన్ (4)లో మాత్రం ప్రస్తుత ధరణి చట్టం ప్రకారం నిర్వహిస్తున్న ‘హక్కుల రికార్డ్’ను కొత్త చట్టం ప్రకారం తయారుచేసినట్లుగా పరిగణించబడుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. అసలు ధరణి ఆసరాతోనే గత ప్రభుత్వం అనేక అక్రమాలు జరగడం, భూరికార్డుల తారుమారు, కొంతమంది జిల్లా కలెక్టర్లు అవినీతికి పాల్పడ్డారని, ప్రస్తుతం ఒక జిల్లా కలెక్టరుపై ఈడీ దర్యాప్తును కూడా చూస్తున్నాం.
మరి కొత్త చట్టంలో ధరణిలోని రికార్డులనే ప్రామాణికంగా తీసుకుంటే నాటి అక్రమాలకు చట్టభద్రత కల్పించినట్లు అవుతుంది. కాబట్టి 2018లో భూప్రక్షాళన, తర్వాత ధరణి పోర్టల్ ద్వారా నమోదు చేసిన భూరికార్డులను ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన తర్వాతనే ఆర్వోఆర్ రికార్డును నోటిఫై చేయాలి.
సెక్షన్ 5 రిజిస్ట్రేషన్, మ్యుటేషన్.. దీనిలో కేవలం విక్రయ దస్తావేజులు, దాన పత్రాలు, తనఖా దస్తావేజులు, పరస్పర మార్పిడి, భాగ పంపిణీ దస్తావేజులే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయబడతాయి. కానీ, రిజిస్ర్టేషన్ యాక్ట్-1908 ప్రకారం వైపీఏ, డీవైపీఏ, రాటిఫికేషన్లు లాంటి అన్ని దస్తావేజులకు కూడా అవకాశం కల్పించాలి. ప్రతి దస్తావేజుతో పాటు సర్వే నంబర్, సబ్ డివిజన్ మ్యాప్ జతపరచాలన్న నిబంధన సాధ్యపడకపోవచ్చు. సమగ్ర భూసర్వే చేస్తే తప్పితే ఇది సాధ్యపడకపోవచ్చు.
సెక్షన్ 6 (1) సాదా బైనామాల క్రమబద్ధీకరణ... 1989 నుంచి 2014 దాకా చాలావరకు సాదాబైనామాల క్రమబద్ధీకరణ విధానాలు కొనసాగాయి. ఇంకా 9 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయంటే వాటి గురించి విశ్లేషణ చేయవలసి వస్తుంది. సాదాబైనామా క్రమబద్ధీకరణ ద్వారా, న్యాయంగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ ద్వారా మ్యుటేషన్ చేసుకున్న భూయజమానులకు అనవసర న్యాయ వివాదాలు రేపినట్లవుతుంది.
క్రమబద్ధీకరణ ఉత్తర్వులపై అప్పీలు చేసుకునే ప్రొవిజన్ ఉంది కాబట్టి వివాదం ఎడతెగని సమస్యగా మారుతుంది. ఇదివరకే క్రమబద్ధీకరణ జరిగినవాటిని తిరిగి పరిశీలించాల్సిన అవసరం లేదు. కొత్త ప్రక్రియ గురించి మరోసారి ఆలోచించాలి.
సెక్షన్ 7 వీలునామా, వారసత్వ విషయంలో మ్యుటేషన్... ధరణిలో వీలునామా ద్వారా మ్యుటేషన్ చేసుకునే విధానం లేనప్పటికీ, వారసత్వంపై సరైన విచారణ జరపకుండా, అదేరోజు మ్యుటేషన్ ద్వారా అనేక అక్రమాలు జరిగాయి. వాటిని అప్పీలు చేసే ప్రొవిజన్ కూడా లేకపోవడంతో సివిల్ కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది.
1989 రూల్స్ ప్రకారం వారసత్వ కేసులు (పాత విరాసత్) చనిపోయినవారి పేరు ఆర్వోఆర్లో ఉండకుండా, సుమోటోగా తహసీల్దార్ గ్రామసభలో విచారణ జరిపి ఎటువంటి ఫీజు లేకుండా మార్పిడి చేసేవారు. కొత్త చట్టంలో ఇదే పద్ధతి ఉన్నప్పటికీ వాటికి కూడా సబ్ డివిజన్ సర్వే మ్యాప్ పెట్టాలంటే, వారసుల మధ్య తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ కేసులను ఉచితంగా సుమోటో చేసే అధికారం, వీలైనంతవరకు ప్రాసెస్ చేసే అవకాశం కల్పించాలి.
సెక్షన్ 8 ఇతర కేసులలో మ్యుటేషన్.. సెక్షన్ 2 సబ్ సెక్షన్ 12లో చూపిన దస్తావేజులను మ్యుటేషన్ చేసే ప్రక్రియ ఆర్డీవోకు కల్పిస్తూ అభ్యంతరాలను స్వీకరించి డిస్పోజ్ చేస్తారు. ఈ విధానం ధరణిలో లేకున్నా 1971 ఆర్వోఆర్ చట్టంలో రికార్డింగ్ అథారిటీగా తహసీల్దార్లకు కల్పించారు. ఇందులో (ఎం), (ఎన్) సంబంధించిన ఓఆర్సీలు, 38ఇ సర్టిఫికెట్స్ ఆయా చట్టాల ప్రకారం ఆర్డీవోనే జారీ చేస్తారు. అదే ఆర్డీవో మళ్ల ఇక్కడ రికార్డింగ్ అథారిటీగా ఉండడం ఎంతవరకు న్యాయసమ్మతమో ఆలోచించాలి.
సెక్షన్ 9 భూధార్.. దీని ప్రకారం ప్రతి కమతానికి మొదలు తాత్కాలికంగా, తర్వాత శాశ్వతంగా భూధార్ నంబర్ ఇవ్వడం మంచి ప్రక్రియే. కానీ ఆచరణలో కష్టసాధ్యం. ప్రతి సర్వే నంబర్లో అనేక బై నంబర్లు ఉండటం వల్ల సమగ్ర భూసర్వే జరిపితేగానీ ఇది సాధ్యపడకపోవచ్చు. కొన్ని సర్వే నంబర్లలో ఆర్‌ఎస్‌ఆర్‌లో చూపిన విస్తీర్ణం కంటే ఎక్కువ నమోదు కావడం, ఈ కేసులు ‘ఎక్స్టెంట్ నాట్ ట్యాలీ’ పేరుతో పార్ట్–బిలో నమోదయ్యాయి. వాటిని పరిష్కరించాలంటే సంవత్సరంవారీగా పహాణీలను పరిశీలించాలి. ఎక్కడ ఎక్కువ నమోదైందో గుర్తించి, వారికి తగు అవకాశం ఇచ్చి, పర్మిటయిన డాక్యుమెంట్స్, పొసెషన్ పరిశీలించి సరిచేయాల్సి ఉంటుంది.
సెక్షన్ 13. విలేజ్ అకౌంట్స్‌లో, సర్వే రికార్డుల్లో నమోదు.. ఆర్వోఆర్ను తయారు చేశాక, అలాగే సెక్షన్ 5, 6, 7, 8 ప్రకారం అప్డేట్ చేసినవాటిని రికార్డుల్లో ఎలక్ట్రానిక్‌గానే కాకుండా మాన్యువల్ గా కూడా నమోదు చేయాలి. కానీ, సర్వేమ్యాప్లో చేయాలంటే దానికి తగ్గట్టుగా సప్లిమెంటరీ సెక్షన్లు జారీ చేస్తూ, మ్యాప్‌లో ఇన్కార్పొరేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న కమతాల నంబర్ల ప్రకారం ఇది ఎంతవరకు సాధ్యమనేది ప్రశ్నార్థకం.
సెక్షన్ 14 ప్రకారం ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం మంచిదే. కానీ, ఏ స్థాయిలో, ఎవరితో ఏర్పాటు చేస్తారో స్పష్టత రాలేదు. కానీ, ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేవరకు లేదా ఖాళీలు ఏర్పడితే కమిషనర్ డీమ్డ్ ట్రిబ్యునల్‌గా పరిగణిస్తారనడం సరికాదు. ప్రత్యేక ల్యాండ్ ట్రిబ్యునల్‌కు రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టరు స్థాయి అంతకుమించిన అధికారులతో ఏర్పాటు చేయాలి. సీసీఎల్ఏనే ట్రిబ్యునల్‌గా పరిగణిస్తే సరైన న్యాయం దొరుకుతుందా అన్నది అనుమానాస్పదమే.
సెక్షన్ 15 రైతులకు ఉచితంగా న్యాయ సహాయం అందించే చర్యలు.. ఉచిత న్యాయ సహాయ సేవల కోసం ప్రభుత్వం ఎవరిని ఏర్పాటు చేస్తున్నది స్పష్టంగా చెప్పలేదు. రైతులు, అధికారులకు మధ్య సంధానకర్తలుగా ఉండేవారయితే అవినీతికి అవకాశం లేకుండా చూడాలి. సెక్షన్16. కొన్ని రకాల భూములపై (దేవాదాయ, వక్ఫ్, భూదాన్, లావుణి) కమిషనరుకు సుమోటో అధికారం.. ఏ అధికారి అయినా ఉద్దేశపూర్వకంగా, మోసపూరితంగా రికార్డులను తారుమారు చేస్తే దీనిపై విచారణ అధికారం కల్పించడం న్యాయసమ్మతం కాదు. ఆయా భూములకు సంబంధించి ప్రత్యేక ట్రిబ్యునల్స్, చట్టాలు ఉన్నాయి. సుమోటో అధికారం దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది.
సెక్షన్ 20 శిక్షలు.. మోసపూరితంగా, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ భూములలో ఏ అధికారి అయిన పీపీబీ, టీడీలు జారీచేస్తే వారిని ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారు. అయితే, ఈ యాక్షన్ కు ముందు ప్రభుత్వ భూములకు సంబంధించిన నిషేధిత జాబితాను (సెక్షన్ 22ఎ) రిజిస్ట్రేషన్ కాకుండా ఆటోమేటిక్ గా బ్లాక్ చేయాలి.
చివరిగా ధరణితో పోలిస్తే ప్రస్తుత భూభారతి చట్టం-2024 అన్నిరకాలుగా ప్రయోజనకారిగా ఉంది. ఏది ఏమైనా కొత్త చట్టం ముఖ్యంగా పార్ట్ బి భూముల సమస్యకు, ధరణిలో ఏర్పడ్డ 16 రకాల సమస్యలకు, అన్యాయంగా నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములకు పరిష్కారం చూపించాల్సి ఉంది. దీనికి అనుగుణంగా రూల్స్ రూపొందించాలి. రెవెన్యూ విభాగంలో అనుభవంగల మేధావులు, రిటైర్డ్ అధికారుల సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
- సురేష్ పొద్దార్, జాయింట్ కలెక్టర్ (రిటైర్డ్), అడ్వకేట్