- ఓ వైపు రైల్వే కోల్‌కారిడార్, మరోవైపు గ్రీన్‌ఫీల్డ్ హైవే
- ఇటీవల ప్రారంభమైన రైల్వే లైన్ పనులు
- ఇప్పటికే పెద్దపల్లి రైల్వే జంక్షన్
- నవంబర్‌లో ప్రారంభంకానున్న గ్రీన్ ఫీల్డ్ పనులు
- మారనున్న జిల్లా కేంద్రం రూపురేఖలు
పెద్దపల్లి, వెలుగు: కొత్తగా రానున్న రైల్వే కోల్ కారిడార్, గ్రీన్‌ఫీల్డ్ హైవేలతో పెద్దపల్లి జిల్లాకేంద్రం ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా మారనుంది. ఇప్పటికే పెద్దపల్లిలో రైల్వే జంక్షన్‌గా ఉండగా, హైదరాబాద్– మంచిర్యాల రాజీవ్ రహదారి కూడా జిల్లాకేంద్రం మీదుగా పోతుంది. వీటికి అదనంగా రైల్వే కోల్ కారిడార్‌తోపాటు ఉమ్మడి నాలుగు జిల్లాలను కలుపుతూ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించనున్నారు. దీంతో జిల్లాకేంద్రం రూపురేఖలు మారనున్నాయి.
సింగరేణి బెల్ట్‌ను కలుపుతూ..
పెద్దపల్లి జిల్లా రామగుండం– మణుగూరును కలుపుతూ 207 కిలో మీటర్ల మేర రైల్వే కోల్ కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే భూసేకరణ పూర్తికాగా రాఘవాపూర్ సమీపంలో ఈ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ లైన్ విస్తరించనుంది. ఇప్పటికే ఈ జిల్లాల్లో ప్రధాన రైల్వే స్టేషన్లను కూడా గుర్తించారు. ఈ లైన్ పూర్తయితే ములుగు జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను చేరుకోవడం సులువుకానుంది.
దీంతో బొగ్గు రవాణా కూడా స్పీడ్ అందుకోనుంది. ప్రస్తుతం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ప్రయాణికులు కొత్తగూడెం, మణుగూరు వెళ్లాలంటే వరంగల్ మీదుగా తిరిగిపోవాల్సి వస్తుంది. కొత్త లైన్ పూర్తయితే పెద్దపల్లి నుంచి ములుగు, భూపాలపల్లి జిల్లాల మీదుగా నేరుగా కొత్తగూడెం చేరుకోవచ్చు. దీంతో వందల కిలోమీటర్ల దూరం, ఖర్చు తగ్గిపోనుంది. మరోవైపు ఇప్పటికే పెద్దపల్లి రైల్వే జంక్షన్‌గా ఉంది. కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే రైళ్లు ఇక్కడ ఇంజన్లను మార్చుకుంటాయి. దీని కోసం దూరం వెళ్లే ట్రైన్లు కూడా గంటలకొద్దీ ఆగాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పెద్దపల్లిలో రైల్వే బైపాస్ లైన్ నిర్మిస్తున్నారు. పెద్దబొంకూర్ మీదుగా ఈపనులు వేగంగా సాగుతున్నాయి.
మొదలు కానున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు
పెద్దపల్లి జిల్లా మీదుగా వరంగల్– మంచిర్యాల మధ్య(250 కిలోమీటర్లు) గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించనున్నారు. ఈ పనులు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా భూసేకరణ, పరిహారం విషయంలో లేట్ అయింది. ఈ సమస్యలన్నీ కొలిక్కి రాగా హైవే పనులను నవంబర్ రెండో వారం నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఫోర్ లేన్ పూర్తయితే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్జిల్లాల మధ్య రవాణా మెరుగవుతుంది. పెద్దపల్లి జిల్లాలో 40 కిలోమీటర్లు ఈ హైవే నిర్మించనుండగా.. మంథని, ముత్తారం, రామగిరి పరిధిలోని 16 గ్రామాల్లో దాదాపు 1400 మంది రైతుల నుంచి 500 ఎకరాలు సేకరించారు. ఈ హైవే నిర్మాణం పూర్తయితే ఆయా మండలకేంద్రాలతోపాటు గ్రామాలు కూడా అభివృద్ధి బాటపట్టనున్నాయి. దీంతోపాటు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బస్ డిపో కూడా పెద్దపల్లిలో ఏర్పాటు కానుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.