ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు

ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు
  • థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
  • అధికారులకు సీఎం జగన్ ఆదేశం

విజయవాడ: ఏపీలో మరో రాత్రిపూట కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మరో వారం రోజుల వరకు  రాత్రిపూట  10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయి. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని.. అలాగే అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సంస్థల సిబ్బంది కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా లాక్ డౌన్.. రాత్రిపూట కర్ఫ్యూ రేపటితో ముగియనున్న నేపధ్యంలో మంగళవారం సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. రోజు రోజుకూ కరోనా కొత్త వేరియంట్లు బయటపడుతున్న కొద్దీ నిపుణులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై చర్చించారు. ఒకవేళ థర్డ్ వేవ్‌ వస్తే తగిన ప్రణాళికలతో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. 
వైద్య సేవల నాణ్యత మెరుగుపరచండి
కరోనా థర్డ్ వేవ్ నేపధ్యంలో వైద్య సేవల కొరత ఎక్కడా రానీయకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి పట్టణాలలో చిన్న పిల్లల  సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే పోలీస్‌ బెటాలియన్లలో కూడా కోవిడ్‌ కేర్‌ ఎక్విప్‌మెంట్‌ ను సిద్ధంగా ఉంచుకోవాలని.. అవసరమైన చోట వైద్యులను నియమించాలన్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలన్నారు.  కమ్యూనిటీ ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉంచాలని.. అన్ని సబ్‌సెంటర్ల వరకు టెలీమెడిసిన్‌ సేవలు, ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉండాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులకు కూడా వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఉండాలన్నారు. కోవిడ్‌ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగించడంతోపాటు అన్ని చోట్లా కోవిడ్ ప్రొటోకాల్స్ తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు స్పష్టం చేశారు.