
న్యూఢిల్లీ: స్కూల్ ఫీజు కట్టలేదని ఎగ్జామ్ రాయనివ్వకపోవడంతో తొమ్మిదో తరగతి స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నది. ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాలో శనివారం ఈ దారుణ ఘటన జరిగింది. పరీక్ష రాయడానికి బాలిక శనివారం స్కూల్ కు వెళ్లింది. ‘‘నువ్వు ఇంకా రూ.800 బాకీ ఉన్నావు. ఫీజు కడితేనే పరీక్ష రాయనిస్తాం” అని స్కూల్ మేనేజ్ మెంట్ చెప్పింది. పరీక్ష రాయనివ్వాలని బాలిక ఎంత వేడుకున్నా కనికరించలేదు. దీంతో బాలిక తన ఇంటికెళ్లి ఆత్మహత్య చేసుకుంది. పొలం పనుల కోసం వెళ్లిన ఆమె తల్లి తిరిగి ఇంటికి వచ్చాక తన కూతురు ఆత్మహత్య చేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇప్పటికే రూ.1,500 ఫీజు చెల్లించామని, ఇంకా రూ.800 కట్టాలని మేనేజ్ మెంట్ బలవంతం చేస్తున్నదని ఆమె తెలిపారు. ఫీజు కట్టలేదని స్కూల్ మేనేజ్ మెంట్ తన కూతురిని అవమానించిందని, ఆ అవమానం తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో ఆరోపించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహితలో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.