యాసంగికి ఢోకా లేదు ప్రాజెక్టుల్లో ఆశాజనకంగా నీటి నిల్వలు

యాసంగికి ఢోకా లేదు ప్రాజెక్టుల్లో ఆశాజనకంగా నీటి నిల్వలు
  • పంటలకు ఆన్, ఆఫ్ పద్ధతిలో సాగు నీరు
  • మిషన్ భగీరథకు ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తలు
  • నిర్మల్ జిల్లాలో 2.84 లక్షల ఎకరాల్లో యాసంగి పంటల సాగు

నిర్మల్, వెలుగు: జిల్లాలో యాసంగి పంటలు చేతికొచ్చే వరకు సాగు నీరందించేందుకు ఇరిగేషన్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టుల్లో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆన్, ఆఫ్ పద్ధతిలో కాలువల ద్వారా పంటలకు నీటిని విడుదల చేస్తున్నారు. నిర్మల్​జిల్లాలో ఈ ఏడు యాసంగి సీజన్​లో మొత్తం 2.84 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. లక్షా 5 వేల ఎకరాల్లో వరి, లక్షా 2 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 50 వేల ఎకరాల్లో శనగ పంటతోపాటు మరికొన్ని పంటలను రైతులు సాగు చేస్తున్నారు. 

జిల్లాలోని కడెం ప్రాజెక్ట్, గడ్డన్న వాగు, స్వర్ణ ప్రాజెక్టులతో పాటు ఎస్సారెస్పీ పరిధిలోని సరస్వతి కాలువల కింద సాగవుతున్న పంటలకు సాగు నీరు అందించేందుకు ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే షెడ్యూల్ రూపొందించారు. దీనికి అనుగుణంగా వారాబందీ పద్ధతిలో కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. గతేడాది కన్నా ఈసారి అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు మెరుగ్గా ఉండడంతో యాసంగి పంటలకు నీటి కొరత ఏర్పడబోదని అధికారులు వెల్లడిస్తున్నారు. 

కడెం కింద 16,500 వేల ఎకరాల సాగు

జిల్లాలో ప్రధానమైన కడెం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.583 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. యాసంగి పంట కోసం 1.4  టీఎంసీల నీరు అవసరముంటుందని, ఈ సీజన్​లో 16,500 ఎకరాల పంటలకు సాగు నీరందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏప్రిల్ 12 వరకు షెడ్యూల్ కు అనుగుణంగా నీటిని అందించనున్నారు. అలాగే ఇక్కడి నుంచి గూడెం ఎత్తిపోతల పథకం కింద సాగయ్యే 17,800 ఎకరాలకు కూడా సాగు నీటితో కలిసి మొత్తం 34,300 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది కంటే ప్రస్తుతం ఒకటిన్నర టీఎంసీల నీరు ఎక్కువగా ఉండడంతో యాసంగి పంటలకు చివరి వరకు నిరందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

గడ్డెన్న వాగు ప్రాజెక్టులో..

గడ్డన్నవాగు ప్రాజెక్టులోనూ నీటి నిల్వలు పుష్కలంగానే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.852 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.964 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా కూడా యాసంగి సీజన్​ ముగిసేవరకు చివరి ఆయకట్టు వరకు నీరందించాలని భావిస్తున్నారు. ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు 80 క్యూసెక్కుల నీటిని, మిషన్ భగీరథ పథకం కోసం 20 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు.  

స్వర్ణ, సరస్వతి ఆయకట్టుకు భరోసా

స్వర్ణ ప్రాజెక్టు పరిధిలోని పంట భూములకే కాకుండా ఎస్సారెస్పీ పరిధిలోని సరస్వతి కాలువ ఆయకట్టుకు కూడా యాసంగి పంటల కోసం చివరి వరకు సాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 6 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఎస్సారెస్పీలో గరిష్ట నీటిమట్టం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 29.27 టీఎంసీల నీరుంది. 

గతేడాది ఈరోజు నాటికి ఈ ప్రాజెక్టులో కేవలం 20.774 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈసారి 9 టీఎంసీల నీరు అదనంగా ఉండడంతో పంటలకు సాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా సరస్వతి కాలువ ఆయకట్టుకు, మిషన్ భగీరథ పరిధిలో తాగు నీటిని అందించనున్నారు.