
- చేపల నిల్వకు ఐస్ ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజీల కొరత
- ప్రతి ఏటా 50 వేల టన్నుల చేపల ఉత్పత్తిపై ప్రభావం
- ఇక్కడి చేపలకు హైదరాబాద్, నాగ్‌పూర్‌లో భారీ డిమాండ్
- మార్కెట్లో కిలో రూ.150.. కానీ చెల్లించేది రూ.50 మాత్రమే
నిర్మల్ వెలుగు: చేపల ఎగుమతుల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న మత్స్యకారులకు నిరాశే మిగులుతోంది. ఇతర ప్రాంతాలకు ఎగుమతులకు సౌకర్యాలు కల్పించకపోవడం, కోల్డ్ స్టోరేజీలు, ఐస్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయకపోవడంతో మత్స్యకారుల శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. నిర్మల్ జిల్లాలోని గోదావరి, దాని ఉపనదుల పరివాహకంలో ఉన్న అనేక రిజర్వాయర్లు, కాలువలు, చెరువుల్లో దొరికే చేపలు రుచికరమైనవి కావడంతో స్థానికంగానే కాకుండా హైదరాబాద్, మహారాష్ట్రలోని నాగపూర్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది
స్థానికంగా చేపల ఉత్పత్తి ఘనణీయంగా ఉన్నా.. ఆ మేరకు స్థానికంగా డిమాండ్ లేదు. ఇదే అదునుగా భావిస్తున్న దళారులు.. మత్స్యకారుల నుంచి తక్కువ ధరకు చేపలను కొని వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జిస్తున్నారు. కొనుగోళ్లు సక్రమంగా లేకపోవడం, దళారుల ప్రభావం ఎక్కువగా ఉంటుండడంతో మత్స్యకారులు శ్రమదోపిడీకి గురవుతున్నారు.
ఏటా 50 వేల టన్నుల చేపల ఉత్పత్తి
ఉమ్మడి జిల్లాలో 320 మత్స్య సహకార సంఘాలుండగా వీటిల్లో 20 వేల కుటుంబాలకు సభ్యత్వం ఉంది. చేప పిల్లల పెంపకానికి పెద్ద సంఖ్యలో నీటి వనరులు అందుబాటులో ఉన్నాయి. గోదావరి నది, దాని ఉపనదులతో పాటు మొత్తం 14 రిజర్వాయర్లతోపాటు జిల్లా వ్యాప్తంగా 1501 చిన్న నీటి వనరులున్నాయి. ఈ వీటిల్లో ఏటా 10 కోట్ల చేప పిల్లలను వదులుతున్నారు. ఫలితంగా మొత్తం 50 వేల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
జిల్లాలలోని చిన్న నీటి వనరుల్లో బొచ్చ, రోహు, బంగారు తీగ, రిజర్వాయర్లలో మ్రిగాల అనే రకం చేప పిల్లలను పెంచుతున్నారు. ఇతర చేపల కంటే ఈ రకాలు రుచిగా ఉండడంతో వాటికి నాగ్‌పూర్, హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. స్థానికంగా కిలో రూ.100 నుంచి రూ.150 వరకు ధర పలుకుతుండగా దళారులు మాత్రం రిజర్వాయర్లు, చెరువుల వద్ద మత్స్యకారుల నుంచి టోకు పద్ధతిలో కిలోకు రూ.45 నుంచి రూ.50 మాత్రమే చెల్లిస్తున్నారు.
అడ్వాన్సులు చెల్లించి తక్కువ ధరకే కొనుగోళ్లు
స్థానికంగా చేపల కొనుగోళ్లు ఎక్కువగా లేకపోవడం, ఎగుమతులకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో మత్స్యకారులకు దళారులు వల విసురుతున్నారు. మత్స్యకారుల అవసరాలను ఆసరాగా చేసుకుంటూ వారి నుంచి తక్కువ ధరకే చేపలను కొంటున్నారు. కొంతమంది అడ్వాన్సులు చెల్లించి వారు వేటాడిన చేపలన్నింటినీ తాము నిర్ణయించిన ధరకే కొనేస్తున్నారు. ఈ వ్యవహారమంతా బహిరంగంగానే సాగుతోంది. అయినప్పటికీ అధికారులు మాత్రం దళారీ వ్యవస్థను అరికట్టి మార్కెటింగ్ విషయంలో మత్స్యకారులకు మార్గం చూపడం లేదు.
కోల్డ్ స్టోరేజీలు, ఎగుమతులపై దృష్టి పెట్టాలి
ప్రతి ఏటా దాదాపు 50 వేల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ స్థానికంగా మార్కెట్ లేకపోవడం మత్స్యకారులకు శాపంగా మారుతోంది. చేపలను ఇతర ప్రాంతాలకు మార్కెటింగ్ చేసేందుకు అనుకూలమైన ప్రాంతాల్లో ‘తెలంగాణ ఫిష్’ పేరిట నోడల్ సెంటర్లను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ప్రతిపాదించింది. ఈ సెంటర్ల ద్వారా ప్రధాన పట్టణాలు, నగరాలకు చేపలను ఎగుమతి చేయాలని భావించింది. కానీ ఆ ప్రతిపాదనలు ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.
చేపల ఎగుమతికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మత్స్యకారులు కోరుతున్న నేపథ్యంలో.. సంబంధిత అధికారులతో నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ రివ్యూ నిర్వహించారు. అనుకూలమైన చోట్ల ఐస్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలించాలని సూచించారు. రైతులకు ఆర్థికంగా చేయూతనందించి వారి చేతనే ఐస్ ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసేలా కసరత్తు చేయాలన్నారు.
చేపల రకం కిలో మార్కెట్ రేటు దళారులు కొంటున్న ధర
రాహు 150-200 80–100
బొత్స 100-120 40–50
రావట 100-120 40–50
బంగారు తీగ 150–200 70–80