కొత్త రేషన్ కార్డులకు మరో చాన్స్..మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ

కొత్త రేషన్ కార్డులకు మరో చాన్స్..మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ
  • ఇప్పటి వరకు అప్లయ్​ చేయని వారే అర్హులు
  • సర్కార్​ చెంతకుగ్రామ సభల ఆర్జీల డేటా

నిజామాబాద్, వెలుగు :   కొత్త రేషన్​ కార్డుల కోసం కాంగ్రెస్​ ప్రభుత్వం మరో చాన్స్​ ఇచ్చింది.  గ్రామ సభలు, ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్​ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.  సోమవారం నుంచే మీ-సేవ సెంటర్లలో దరఖాస్తులు తీసుకుంటున్నారు. కొత్తగా పెండ్లి చేసుకున్న వారు కుటుంబ కార్డులో పేర్లు డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. తహసీల్దార్లు ఆఫ్​లైన్​లో ఈ దరఖాస్తులు తీసుకుంటున్నారు.

పదేండ్ల నిరీక్షణ తొలగింది.. 

జిల్లాలో 4,02,473  ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ​ప్రతి నెలా 12,89,889  లక్షల మందికి 6,410 మెట్రిక్​ టన్నుల బియ్యం పంపిణీ అవుతున్నది. పదేండ్ల కింద అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం కొత్త రేషన్​ కార్డులను ఇవ్వలేదు. ఉమ్మడి కుటుంబంలో కొత్తగా పెండ్లిళ్లు అయినవారు.. వారి పిల్లలు కొత్త రేషన్​ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త రేషన్​ కార్డుల కోసం గతంలో దరఖాస్తులు తీసుకోలేదు. కాంగ్రెస్​ సర్కారు వచ్చిన వెంటనే ఈ విషయాన్ని గమనించి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించింది. రేషన్​ కార్డుల కోసం 81,148 దరఖాస్తులు వచ్చాయి.  

అధికారులు  వాటిని ఆన్​లైన్​ చేసి అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. జనవరి 26న పైలెట్​గా ఎంపిక చేసిన31 గ్రామాల్లో 1,066 మందికి రేషన్​ కార్డులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్​ ఇచ్చారు.  మిగితా అప్లికేషన్లను తహసీల్దార్​లు ఆన్​లైన్ చేస్తున్నారు. దరఖాస్తుదారుడి కుటుంబం వివరాలు, ఆధార్​ నంబర్​, ఇన్​కమ్​, క్యాస్ట్​, ఫోన్​ నంబర్​ తదితర వివరాలతో డేటాను పొందుపరుస్తున్నారు. వాటిని ప్రజాపాలన అప్లికేషన్లతో క్రాస్​ చెక్​ చేసి డబుల్​ దరఖాస్తులు తొలగించాక కార్డులను జారీ చేయనున్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కొత్త రేషన్​కార్డులు మంజూరు కానున్నాయి.  ఎవరైనా మిగిలి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. 

టైం లిమిట్​ లేదు..

అర్హత గల ప్రతి కుటుంబానికి ఎఫ్​ఎస్​సీ కార్డు మంజూరవుతుంది. ఇప్పుడు తీసుకుంటున్న దరఖాస్తులు మిస్​ అయిన వారి కోసమే. కొత్త పేర్ల యాడింగ్​కు వెళ్లొచ్చు. ప్రజాపాలన, గ్రామ సభలో ఆర్జీలు ఇచ్చినవారు మళ్లీ  చేయొద్దు.  కొత్త కార్డుల మంజూరు కంటిన్యూగా నడిచే ప్రక్రియ.  - అరవింద్​రెడ్డి, డీఎస్​వో, నిజామాబాద్

ALSO READ : పంచాయతీలకు పైసలు రాక.. కరెంట్ బిల్లులు పెండింగ్​

డబుల్​కు నో చెప్పేలా సాఫ్ట్​వేర్..

సర్కారు ఆదేశాల ప్రకారం సోమవారం నుంచి మీ-సేవ సెంటర్లలో కొత్త రేషన్​ కార్డులు, ఇప్పుడున్న కార్డులలో అదనపు పేర్ల చేరిక అఫ్లికేషన్లు మాత్రమే తీసుకుంటున్నారు.  ప్రజాపాలన, గ్రామ సభలో అఫ్లికేషన్లు ఇచ్చిన వారు మళ్లీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక వేళ వెళ్లినా సాఫ్ట్​వేర్ అంగీకరించదు. ఇప్పటికే అప్లికేషన్లు పెట్టుకున్న వ్యక్తుల పేరు, ఆధార్​ నంబర్ ఎంటర్​ చేయగానే ప్రాసెస్​లో ఉన్నదని చూపుతుంది. ప్రస్తుతం స్వీకరిస్తున్న అఫ్లికేషన్లు డబుల్​ అయ్యే చాన్స్​లేదు. పెండ్లి అయ్యాక వేరు కాపురం ఉంటున్న ఫ్యామిలీ ఫ్రెష్​ కార్డు కోసం దరఖాస్తుపెట్టుకుంటే ప్రస్తుతం ఎంటరై​ ఉన్న కార్డుల నుంచి పేర్లు తొలగించుకోవాల్సి ఉంటుంది. నేమ్ డిలీట్​ ఆర్జీలను తహసీల్దార్లు ఆఫ్​లైన్​లో  తీసుకుంటున్నారు. అవి ఫైనల్​ అయితేనే కొత్తవి మంజూరవుతాయి.