- ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో రూ.100 కోట్లు మంజూరు
- నిధులున్నా తప్పని నిరీక్షణ
- మూడు రాష్ట్రాలను కలిపే హైవేలో ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణం, విస్తరణకు ఆటంకాలు
- జోడు వాగుల వద్ద బ్రిడ్జి, శ్రీరాంపూర్‌లో విస్తరణకు ఎదురుచూపులు
కోల్‌బెల్ట్/నస్పూర్, వెలుగు:తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలిపే నిజామాబాద్–జగ్ధాల్పూర్63వ జాతీయ రహదారి అభివృద్ధికి అటవీ పర్మిషన్లు అడ్డుగా మారాయి. ఫండ్స్కేటాయిస్తున్నప్పటికీ ఏడేండ్లుగా అటవీ పర్మిషన్లు రాక రహదారి డెవలప్మెంట్ పనులు అసంపూర్తిగా మిగిలాయి. రాష్ట్రాలను పట్టణాలకు అనుసంధానించి వాటిని పురోభివృద్ధి బాట పట్టించేందుకు ప్రభుత్వం మెరుగైన రహదారుల నిర్మాణాణాలకు నిధులు మంజూరు చేస్తున్నా.. అటవీ పర్మిషన్లు రాకపోవడంతో ఏళ్లుగా పనుల్లో జాప్యం తప్పడంలేదు. ఫలితంగా మూడు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తప్పడంలేదు.
ఏడేండ్లుగా నిరీక్షణ
నిజామాబాద్–జగ్ధల్‌పూర్(ఛత్తీస్‌గఢ్) నేషనల్ హైవే 63 రహదారి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్మీదుగా వెళ్తుంది. తెలంగాణలో 268 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి జైపూర్, చెన్నూరు, సిరోంచ వైపు రాకపోకలకు ప్రధాన మార్గం కావడంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఏడేండ్ల క్రితం చేపట్టిన రహదారి విస్తరణ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. రోడ్డు ఇరుకుగా మారడంతో మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్ ప్రాంతాలతో పాటు భీమారం–చెన్నూరు మండలాల మధ్య తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
మంచిర్యాల పట్టణం తోళ్లవాగు నుంచి జైపూర్ మండలం రసూల్‌పల్లి వరకు 9.8 కి.మీ. మేర ఇరువైపులా 66 ఫీట్లతో ఫోర్ లేన్ రోడ్డు, మధ్యలో 15 మీటర్ల వెడల్పుతో డివైడర్లు, యూటర్న్లు, సెంట్రల్ లైటింగ్, 18 చోట్ల జంక్షన్లు, ఏడు బ్లాక్ స్పాట్లలో రోడ్డు విస్తరణ, ఆధునికీకరణ, భూసేకరణ పనులకు 2021-–22లో రూ.59.79 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. 2022 చివరల్లో రోడ్డు వెడల్పు కోసం శ్రీరాంపూర్ సింగరేణి ఎస్పార్పీ ఓసీపీ గనికి వెళ్లే రహదారి వైపు నుంచి బస్టాండ్, అరుణక్కనగర్, జీఎం ఆఫీస్(ఓసీపీ వైపు) దాదాపు 2.కి.మీ. దాకా రోడ్డుకు ఒక సైడ్6 అడుగుల వెడల్పుతో 4 అడుగుల లోతు కందకాలు తవ్వారు.
అయితే ఈ పనులకు అటవీశాఖ నుంచి పర్మిషన్లు లేవని ఆ శాఖ అధికారులు అభ్యంతరం చెప్పి అడ్డుకోవడంతో పాటు హైవే ఆఫీసర్లపై కేసు నమోదు చేస్తూ యంత్రాలను సీజ్ చేసి జరిమానా విధించారు. దీంతో హైవే అధికారులు కందకాలు పూడ్చివేశారు. ఏండ్లు గడస్తున్నా ఇప్పటివరకు రోడ్డు వెడల్పు పనులు ముందుకు సాగడంలేదు. గోదావరిఖని నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రానికి వచ్చే ఈ మార్గం ఇరుకుగా ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
రూ.100 కోట్లు సాంక్షన్ చేయించిన ఎంపీ, ఎమ్మెల్యే
నేషనల్ హైవే 63లోని భీమారం నుంచి చెన్నూరు మండలం కిష్టంపేట అర్బన్ పార్కు వరకు జోడువాగుల బ్రిడ్జి మీదుగా నేషనల్ హైవేలో ఏడేండ్లుగా అధ్వానంగా మారిన నాలుగు కిలోమీటర్ల పొడవు రహదారికి గత డిసెంబర్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రూ.1.80 కోట్లు ఫండ్స్ మంజూరు చేయించి బీటీ రోడ్డు నిర్మాణం చేయించారు. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు కష్టాలు తీరాయి. మరోవైపు ప్రయాణికులు, వాహనదారుల రవాణా వ్యవస్థ మరింత సులభతరం కోసం 4.కి.మీ పోడవున కొత్తగా ఫోర్‌లేన్ రహదారి నిర్మాణం, విస్తరణ కోసం కేంద్రం నుంచి రూ.100 కోట్లు ఫండ్స్‌ను ఎంపీ, ఎమ్మెల్యే సాంక్షన్ చేయించారు.
వివిధ రోడ్లు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు అటవీ పర్మిషన్లు మంజూరు చేయాలని సంబంధిత కేంద్ర మంత్రులను ఇప్పటికే పలుమార్లు కలిసి విన్నవించారు. శిథిలావస్థకు చేరిన జోడువాగుల బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి సంబంధిత ఆఫీసర్లు డీపీఆర్ రెడీ చేస్తున్నారు. టెండర్లు పూర్తయితే రూ.100 కోట్లతో ఫోర్‌లేన్ రహదారి నిర్మాణం, బ్రిడ్జి పనులు, బ్లాక్స్పాట్స్చోట నిర్మాణ పనులు పూర్తయ్యే ఛాన్స్ఉందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. అటవీ శాఖ పర్మిషన్లు వస్తే నేషనల్ హైవే 63లో ప్రయాణ ఇబ్బందులు తొలగిపోతాయని ప్రయాణికులు, వాహనదారులు ఎదురుచూస్తున్నారు.