ఇందూరులో రేపటి నుంచి రైతు మహోత్సవం

ఇందూరులో రేపటి నుంచి రైతు మహోత్సవం
  •  వేడుకకు నిజామాబాద్ ముస్తాబు  

నిజామాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని రైతు మహోత్సవ వేడుకలకు నిజామాబాద్​ నగరం రెడీ అవుతోంది. ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు జరిగే  రైతు పండగ కోసం ప్రభుత్వ గిరిరాజ్​ డిగ్రీ కాలేజీ గ్రౌండ్​ను సిద్ధం చేస్తున్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతుండగా ఓపెనింగ్​కు మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు రానున్నారు.  కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు శనివారం ఏర్పాట్లు పరిశీలించారు.  ఎక్కడా చిన్న లోపాలకు తావు ఇవ్వొద్దని ఆదేశించారు. 

150 దాకా స్టాల్స్​

సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో  రైతు మహోత్సవాల ఏర్పాట్లు నడుస్తున్నాయి. జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చే రైతులు తాము పండించిన ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శిస్తారు.  సహజ సిద్ధంగా పంటల సాగు, యంత్రాల వినియోగం వాటి లాభాలు, పంట విత్తనాలు, పరిశ్రమల స్థాపనకు అవకాశాలపై అవగాహన కలిగించేలా దాదాపు 150 స్టాల్స్​ ఏర్పాటు చేయనున్నారు.  పంటల మెరుగైన సాగుకు ఉపయోగపడే అంశాలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, స్టార్టప్​ కంపెనీలు, బ్యాంకులు, వ్యవసాయ వర్సిటీలు, సైంటిస్టుల సహకారంపై చర్చ ఉంటుంది. ప్రగతిశీల రైతులతో మీటింగ్​లు ఉంటాయి.  అగ్రికల్చర్​ కమిషనరేట్​ నుంచి వచ్చిన ఏడీవోలు హుస్సేన్​బాబు, వినోద్​కుమార్​ అరెంజ్​మెంట్ల  పరిశీలనకు వచ్చారు.