రోడ్డు కోసం ఏండ్లుగా పోరాటం.. నిధులు మంజూరైన అసంపూర్తిగా పనులు

మెదక్, నిజాంపేట్, వెలుగు: నిజాంపేట మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు రోడ్డు కోసం ఏండ్లుగా పోరాటం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తర్వాత నిధులు మంజూరైనా పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు దీక్షలు చేపట్టారు. నిజాంపేట్ మండలం నస్కల్ ఎక్స్ రోడ్డు నుంచి నస్కల్, రాంపూర్, నందగోకుల్ మీదుగా చల్మెడ కమాన్ వరకు రోడ్డు అధ్వాన్నంగా మారడంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

రోడ్డు మొత్తం దెబ్బతిని, గుంతలు పడి, కంకర తేలి వాహనాల రాకపోకలు సాగించే పరిస్థితి లేకుండా తయారైంది. వర్షాలు కురిసినప్పుడు బురదమయంకావడంతో మరింత ఇబ్బంది కలుగుతోంది. రోడ్డు బాగాలేకపోవడంతో ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రోడ్డు బాగు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఎన్నో సార్లు మొర పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు 18 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం 2023లో ఆర్అండ్ బీ నుంచి రూ.12 కోట్లు మంజూరయ్యాయి. 

ఈ మేరకు టెండర్  ప్రక్రియ పూర్తయి  పనులు షురూ అయ్యాయి. దీంతో  రోడ్డు బాగై సమస్య తీరిపోనుందని ఆయా గ్రామాల ప్రజలు ఆశించారు. కానీ రోడ్డు పని చేపట్టి కొంత దూరం కంకర పోసిన కాంట్రాక్టర్ బిల్లులు రావడం లేదని పనులను నిలిపివేశారు. దీంతో సమస్య 'ఎక్కడ వేసిన గొంగడి అక్కడే' అన్నట్టు తయారైంది. ఆయా గ్రామాల ప్రజలకు ఎప్పటి లాగే రాకపోకలకు తిప్పలుతప్పడం లేదు. 

ఆరు రోజులుగా దీక్షలు 

అసంపూర్తి రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆరు రోజులుగా ఆయా గ్రామాల ప్రజలు నిజాంపేట్ లో దీక్షలు చేస్తున్నారు. స్టూడెంట్స్​, మహిళలు కూడా దీక్షలో కూర్చుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

ఎన్నో రకాల ఇబ్బందులు

మా ఊరికి వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలు పడింది. ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న మా పిల్లలకు, వాహనదారులకు యాక్సిడెంట్లు అవుతున్నాయి. చీకటి పడ్డాక నిజాంపేట నుంచి మా ఇంటికి పోవాలంటే ఒక్క ఆటో కూడా ఉండడం లేదు. ఆఫీసర్లు పట్టించుకుని వెంటనే రోడ్డు పనులు షురూ చేసి కంప్లీట్ చేయించాలే. - హేమలత, నస్కల్

కాంట్రాక్టర్ కునోటీసులు ఇచ్చాం

పనులు చేయడం లేదని సంబంధిత కాంట్రాక్టర్ కు నోటీసులు అందజేశాం. స్పందించిన ఆయన ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో పనులు ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే రోడ్డు పనులు పూర్తి అయ్యేలా చూస్తాం. 
- విజయ సారథి, ఆర్అండ్ బీ ఏఈ 

కాంట్రాక్టర్ కునోటీసులు ఇచ్చాం

పనులు చేయడం లేదని సంబంధిత కాంట్రాక్టర్ కు నోటీసులు అందజేశాం. స్పందించిన ఆయన ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో పనులు ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే రోడ్డు పనులు పూర్తి అయ్యేలా చూస్తాం. 
- విజయ సారథి, ఆర్అండ్ బీ ఏఈ