మూసీ పునరుజ్జీవానికి కేంద్ర సహకారం లేనట్టే.. పార్లమెంట్​లో స్పష్టం చేసిన కేంద్రం

మూసీ పునరుజ్జీవానికి కేంద్ర సహకారం లేనట్టే.. పార్లమెంట్​లో స్పష్టం చేసిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవ పథకానికి కేంద్రం నుంచి సహకారం లేనట్టేనని తేలిపోయింది. ఇటీవలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్​లో కేంద్రం ఈ విషయం స్పష్టం చేసింది. మూసీ ప్రాజెక్టు పూర్తిగా రాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్టు అని, కేంద్రం సహకారం ఉండదని తేల్చి చెప్పింది. అర్బన్​ ప్లానింగ్ అనేది అర్బన్ లోకల్ బాడీల కిందకు వస్తుందని, కునుక రాష్ట్రమే చూసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, వివిధ పథకాల కింద ఆ ప్రాజెక్టుకు అవసరమైతే ఆర్థిక, సాంకేతిక సాయం అందించేందుకు సాధ్యమవుతుందని పేర్కొంది. ప్రత్యేకంగా మూసీ పునరుజ్జీవానికంటూ నిధులు ఇవ్వడం మాత్రం సాధ్యం కాదని స్పష్టం చేసింది. 

కాగా, మూసీ పునరుజ్జీవాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లండన్​లోని థేమ్స్, దక్షిణ కొరియాలోని హన్ నదులను శుద్ధి చేసిన తీరును ప్రభుత్వ ప్రతినిధులు, అధికారుల బృందం స్టడీ చేసింది. ఈ క్రమంలోనే ఆ ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి రూ.10 వేల కోట్ల మేర ఆర్థిక సాయాన్ని పొందే విధంగా సర్కారు ప్రణాళికలు పెట్టుకుంటున్నట్టు తెలిసింది. కానీ, కేంద్రం మాత్రం నిధులివ్వడం సాధ్యం కాదని చెబుతున్నది.

ప్రత్యామ్నాయం ఏంటి?

వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రధానమంత్రి కృషీ సించాయీ యోజన కింద కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తున్నది. కానీ, ఆ పథకం కింద సాయం పొందాలంటే చాలా నిబంధనలుంటాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న ఏకైక మార్గం ఇంట్రాలింక్ మాత్రమేనని అంటున్నారు. ఇంట్రాలింక్​గా ప్రాజెక్టును చేపట్టాలన్నా కూడా కేంద్రం ఓ నిబంధనను పెడుతున్నది. గోదావరి–కావేరి లింకింగ్ ప్రాజెక్టుపై కొన్నేండ్లుగా ఎడతెగని పంచాయితీ నడుస్తున్నది. ఆ ప్రాజెక్టులో భాగమైన రాష్ట్రాలన్నీ తమకు కావాల్సిన డిమాండ్లను నేషనల్ వాటర్ డెవలప్​మెంట్ అథారిటీ (ఎన్​డబ్ల్యూడీఏ) ముందు పెట్టాయి.

 ఓ దశలో అవన్నీ గొంతెమ్మ కోర్కెలంటూ ఎన్​డబ్ల్యూడీఏ అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మరో ప్రతిపాదననూ వివిధ రాష్ట్రాల ముందుంచింది ఎన్​డబ్ల్యూడీఏ. గోదావరి–కావేరి లింక్​కు రాష్ట్రాలు.. కేంద్రం చెప్పిన విధివిధానాలకు లోబడి ఒప్పుకుంటే ఆయా రాష్ట్రాలు చేపట్టే ఇంట్రాలింక్ ప్రాజెక్టులకు సహకరిస్తామని ఎన్​డబ్ల్యూడీఏ, కేంద్ర జలశక్తి శాఖ అధికారులు సూచించారు. ఈ ఇంట్రాలింక్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి పూర్తి సహకారం కాకపోయినా.. 40 శాతం వరకు ఆర్థిక సాయం అందుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. 

ప్రస్తుతం గోదావరి కావేరి లింక్ ప్రాజెక్టులో అధికారులు నీటి వాటాలు, ప్రాజెక్టు ఎత్తుపై అభ్యంతరాలు చెబుతున్నారు. 40 శాతం నీటి వాటాకు ఒప్పుకోవాలని ఎన్​డబ్ల్యూడీఏ చెబుతుండగా.. సగం వాటాగా 74 టీఎంసీలు ఇవ్వాలని మన అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గోదావరి–కావేరి లింక్​కు తాము చెప్పినట్టు ఒప్పుకుంటే రాష్ట్రాలకు ఇంట్రా లింక్​ ప్రాజెక్టులకు సహకరిస్తామని ఎన్​డబ్ల్యూడీఏ సూచించింది. గోదావరి–కావేరి లింక్ ప్రతిపాదనకు ఒప్పుకుంటే.. మూసీ ప్రాజెక్టుకు రూ.6 వేల కోట్ల వరకైనా కేంద్రం నుంచి ఆర్థిక సహకారం లభిస్తుందన్న అభిప్రాయాలు ఇరిగేషన్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. కానీ, రాష్ట్ర నీటి ప్రయోజనాల దృష్ట్యా అందుకు రాష్ట్ర సర్కారు ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కవనే అంటున్నారు.