జడ్చర్ల, వెలుగు: కొత్తగా ఏర్పాటైన మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాల్టీలో మూడేళ్లు పూర్తి కాకముందే చైర్ పర్సన్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టారు. దీంతో కొత్త చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. స్థానిక మున్సిపల్ ఆఫీసులో సోమవారం ఉదయం 11 గంటలకు చైర్పర్సన్ ఎన్నిక జరగనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మహబూబ్‌నగర్ ఆర్డీవో నవీన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. చైర్పర్సన్ సీటు బీసీ మహిళకు రిజర్వ్ అయింది. జడ్చర్ల మున్సిపాల్టీలో 27 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్ కు 20 మంది, కాంగ్రెస్‌కు ఆరుగురు, బీజేపీకి ఒక కౌన్సిలర్ ఉన్నారు.
బీఆర్ఎస్కు 20 మంది సభ్యుల బలం ఉన్నా.. సభ్యులు చేజారిపోవద్దనే ముందస్తు ప్లాన్ చేసింది. క్యాంపు రాజకీయాలకు ఆ పార్టీ లీడర్లు తెరతీశారు. చైర్ పర్సన్ పదవి కోసం ఆ పార్టీలో ముగ్గురు పోటీ పడుతుండడంతో పార్టీ పెద్దలు అలర్ట్ అయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా తమ కౌన్సిలర్లను తీర్థయాత్రల పేరుతో క్యాంప్‌నకు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలతో పాటు పోలీసు సిబ్బందిని నియమించారు. మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు స్థానిక పోలీసులకు పలు సూచనలు చేశారు.