- ఏండ్ల కింద నిర్మించిన రాజన్న ఆలయ వసతి బిల్డింగులు
- పెచ్చులూడుతున్న పైకప్పులు.. అపరిశుభ్రంగా రూమ్‌లు
- డ్రైనేజీ కంపు, బాత్ రూముల్లో లీకేజీలు
- సౌలత్‌లు లేక ఇబ్బందులు పడుతున్న భక్తులు
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయంలో వసతి గదుల మెయింటెనెన్స్‌ను ఆలయ అధికారులు పట్టించుకుంటలేరు. ఏండ్ల కింద నిర్మించిన బిల్డింగులు కావడంతో పైకప్పులు పెచ్చులూడుతున్నాయి. దీంతో వసతి గదుల్లో బస చేయాలంటే భక్తులు భయపడుతున్నారు. అపరిశుభ్రత ఓవైపు.. మరోవైపు పైకప్పులు ఊడుతుండడం, డ్రైనేజీ వాసన, బాత్ రూమ్‌లలో లీకేజీలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రూముల్లో బెడ్ షీట్స్ కూడా ఇవ్వడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.
సరిపడా రూంలు లేవు..
నిత్యం వేల మంది వచ్చే రాజన్న ఆలయానికి నేటికీ సరిపడా వసతి రూంలు లేకపోవడంతో భక్తులు ఓపెన్ స్లాబ్, లేదా వచ్చిన వాహనాల్లోనే పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఉన్న వసతి రూముల్లో సౌలతుల్లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం 400 రూములే ఉండగా వేలాదిగా వచ్చే భక్తులు రూములు సరిపోక అవస్థలు పడుతున్నారు.
రద్దీ టైంలో ప్రైవేట్ రూంలే దిక్కు
ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, నల్గొండ, మెదక్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం వస్తుంటారు. ముఖ్యంగా ఎక్కువ రద్దీ ఉండే శుక్ర, ఆది, సోమవారాల్లో వసతి రూములు సరిపోక భక్తులు రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి. మరికొందరు ప్రైవేటు అద్దె గదులను ఆశ్రయిస్తున్నారు. ఆలయానికి ఏటా దాదాపు రూ.80 కోట్ల ఆదాయం వస్తున్నా భక్తులకు సౌలతులు కల్పించడంలో ఆలయ అధికారులు, ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. భీమేశ్వర ఆలయం సమీపంలో మూడేండ్ల కింద 50 వసతి రూములు నిర్మించినా.. అద్దె రేట్లు సామాన్య భక్తులకు అందుబాటులో లేవు. దేవస్థానం ఆధ్వర్యంలో 550 రూంలు నిర్మించగా అందులో 400 మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
రక్షణ లేని ధర్మశాలలు..
వేములవాడ ఆలయం వసతి గదులలో భక్తుల వస్తువులకు రక్షణ లేకుండా పోయింది. కొద్దిరోజుల కింద హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం నందీశ్వర కాంప్లెక్స్ లో రెండు గదులను అద్దెకు తీసుకుని దర్శనానికి వెళ్లి వచ్చేసరికి తాళం పగలగొట్టి నగదు, సెల్ ఫోన్స్ ఎత్తుకెళ్లారు. అంతే కాకుండా ధర్మశాలలో నిత్యం కొంత మంది మందు, మాంసంతో పార్టీలు కొనసాగిస్తున్నారు. దీంతో లిక్కర్ తాగిన కొందరు పక్క గదుల్లో ఉన్న భక్తులను ఇబ్బందులకు గురి చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి.
స్పెషల్ డ్రైవ్చేపడుతాం...
దేవస్థానంలోని వసతి గదుల్లో భక్తుల ఇబ్బందుల దృష్ట్యా..స్పెషల్ డ్రైవ్ చేపట్టి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తాం. పార్వతీపురంలో కొన్ని రూములు బాగాలేవు. వాటిని శుభ్రం చేస్తాం. కొన్ని రూములు డిస్మెంటల్ చేయాల్సి ఉంది.పూర్తి అనుమతులు రాగానే కూల్చివేస్తాం.
—కృష్ణ ప్రసాద్, ఈవో, రాజన్న ఆలయం