బీఆర్ఎస్ చూపు.. బీజేపీ వైపా..?

బీఆర్ఎస్ చూపు.. బీజేపీ వైపా..?


హమ్​తో డూబేంగే సనమ్ తుమ్సే మిల్కె అన్నట్లు, ఆయన ఎలాగూ మునిగాడు, నమ్ముకున్న కార్యకర్తలను కూడా ముంచాడు, డూబ్నె వాలేకో తిన్కేక సహారా అన్నట్లు, ఏదో ఒక పార్టీ అండ ఇప్పుడు బీఆర్ఎస్​కు కావాలి! మునిగేటోడికి తెడ్డు సహాయం, ఏముంటుంది? బీజేపీ తప్ప, మిగిలిన ఆప్షన్ అదే, ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్ తానాషాహీగిరి కారణంగా, ఆయన యాటిట్యూడ్ కారణంగా, విపక్షపార్టీల రాష్ట్రాల సీఎంల మద్దతు కూడా కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్​లో ఇప్పటి సీఎం చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా కనీసం తెలంగాణాలో నిరసనలకు కూడా అనుమతి ఇవ్వలేదు. కేసీఆర్​లో అధికారం జాదూ, మత్తు ఎంత నెత్తిమీదకు వచ్చిందంటే, ఆయన తన సహచర ఉద్యమకారులను, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలను పురుగులను చూసినట్లు చూసారు. ఎంతో కమిట్మెంట్​తో సాగిన ఈటల రాజేందర్ ను దూరం చేసుకోవడమే ఆయనకు ఓవర్ఆల్​గా కష్టాలు మొదలు అయ్యాయి. ప్రస్తుతం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరు రాష్ట్రం అంతా ఆయనను ఒక కేసీఆర్ బాధితుడుగా చూసింది. ఆయనకు సానుభూతి, కేసీఆర్ పట్ల వ్యతిరేకత పెరిగింది.  కేసీఆర్, ఆయన త్రయం, ఎన్ని వివరణలు ఇచ్చినా ప్రజలు నమ్మలేదు.అప్పటినుంచే కేసీఆర్  డౌన్ ఫాల్ ప్రారంభం అయ్యింది.

ఈటలను దూరం చేసుకున్నారు

ఈటల రాజేందర్​ను హుజురాబాద్​లో ఓడించడం కోసం కేసీఆర్ పడిన తంటాలు, అదే నేపథ్యంలో ప్రవేశపెట్టిన దళితబంధు లాంటి పథకాలు చూసాము. వంద కోట్లకు పైగా ఖర్చుచేశారు. అయినా ఈటల రాజేందర్ గెలిచారు. ఆయన కేసీఆర్ ఉద్యమ సహచరుడు అని కూడాచూడకుండా శత్రు ధోరణిని అవలంబించారు.ఈ విధానం తీవ్ర ఆక్షేపణీయం! అయినా లీడర్ తప్పు చేస్తున్నప్పటికి, పార్టీలోని ఈటల అభిమానులు సైతం కేసీఆర్ తప్పు చేస్తున్నాడని తెలిసినప్పటికీ ఆయనకు చెప్పలేకపోయారు. ప్రస్తుత చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి విషయంలోనూ, పార్లమెంట్ టికెట్ విషయంలో, టికెట్ ఇవ్వకుండా ఒక రకంగా చెప్పాలంటే చీట్ చేశారు. నమ్మించి మరీ గొంతుకోయడం కేసీఆర్ రాజనీతిలో ఒక అంశం! ఇలా చాలా మంది విషయంలో జరిగింది. 

బీజేపీలో బీఆర్​ఎస్​ విలీనం?

 మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవగానే, బీఆర్ఎస్​లో తిరుగుబాటు షురూ అయిపోయింది. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినా సగం మంది ఇప్పటికే కాంగ్రెస్​లో  చేరిపోయారు.పార్లమెంట్ ఎన్నికల్లో జీరో రిజల్ట్స్ వచ్చాయి. ఒక్కరు కూడా గెలవలేదు. పైగా మెజారిటీ 
బీఆర్ఎస్ అభ్యర్థులు డిపాజిట్ లు కోల్పోయారు. ఇక రాజ్యసభలో మిగిలిన నలుగురు బీజేపీలోకి విలీనం అనే ప్రచారం జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుందో!  కేసీఆర్ పరిస్థితి క్లిష్టతరంగా ఉంది. అలా విలీనం అంటే బీఆర్ఎస్​కు ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. పార్టీని నమ్ముకున్న వారిని ముంచినట్లే అవుతుంది. 

తమను కాపాడుకునే రాజకీయం!

మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన సింగరేణి యూనియన్ గుర్తింపు ఎన్నికల్లోను పోటీ వద్దని, టీబిజికెఎస్ యూనియన్ ను దాదాపు కిల్ చేశారు. ఎమ్మెల్సీ కవిత నిర్ణయం అది! ఇటీవల మళ్ళీ యూనియన్​ను తెరమీదికి తెచ్చి మిర్యాల రాజిరెడ్డి నేతృత్వంలో బొగ్గు బ్లాక్ ల కోసం పోరాడుతున్నారు. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆమెకు బెయిల్ రావడం లేదు. బీజేపీ కి అనుకూలంగా ఉంటే బెయిల్ వస్తుందని, కేసు లో కొంత వెసులుబాటు ఉంటుందని బీఆర్​ఎస్​ భావిస్తున్నది అనే ప్రచారం జరుగుతోంది. --------------------------------------------- 

‑ ఎండి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్