- ఓరుగల్లు రోడ్లపైకి ఎలక్ట్రిక్ బస్సులు
- 82 సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ లతో సేవలు
- నెలలో ప్రయాణికులకు అందుబాటులోకి..
- బీఆర్ఎస్ హయాంలో వెనక్కు వెళ్లిన 25 ఎలక్ట్రిక్ బస్సులు
వరంగల్, వెలుగు: ఓరుగల్లు ప్రయాణికులను ఐదారేండ్లుగా ఊరిస్తున్న కాలుష్యరహిత ఎలక్ట్రిక్ సూపర్ బస్సులు అతి త్వరలో ఇక్కడి రోడ్లపై తిరగనున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ ఆర్టీసీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. వరంగల్ రీజియన్‌లో 82 సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు నడిపేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఎలక్ర్టిక్ బస్సులు తొలిసారిగా నెల రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. వీటిని వరంగల్ నుంచి హైదరాబాద్, నిజామాబాద్, ఏటూరునాగారం, మంగపేట, ఖమ్మం, భూపాలపల్లి రూట్లలో నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
2019లో పట్టింపులేక వెనక్కు..
ఫేం ఇండియా స్కీంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2019లో వరంగల్ సిటీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసింది. కాగా, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్పందించకపోవడంతో ఆర్టీసీ అధికారులు కావాల్సిన చర్యలు చేపట్టలేదు. దీంతో ఓరుగల్లు రోడ్లపై ఐదేండ్ల క్రితమే తిరగాల్సిన ఎలక్ట్రిక్ బస్సులు చేజేతులా వదులుకున్నట్లయింది.
వరంగల్ _2 డిపోలో ఏర్పాట్లు..
వరంగల్ రీజియన్ 82 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరవగా, ఇందులో సూపర్ లగ్జరీ (18), డీలక్స్ (14), సెమీ డీలక్స్ (21), ఎక్స్‌ప్రెస్ (29) ఉండనున్నాయి. ఢిల్లీకి చెందిన జేబీఎం కంపెనీ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో వీటిని నడిపేందుకు రెడీ అవుతోంది. నిర్వహణకు గ్రేటర్ వరంగల్ కేంద్రంగా ఉన్న వరంగల్_2 డిపోలో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యాధునిక హంగులతో ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
ఎలక్ట్రిక్ బస్సులో హైఫై ఫీచర్స్..
వంద శాతం కరెంట్ ద్వారా నడిచే 12 ఎం బస్సు నుంచి ఎటువంటి కాలుష్యం ఉండదు. సూపర్ లగ్జరీ-41 సీటింగ్ కెపాసిటీ ఉండగా, డీలక్స్- 45, 2+2 సీటింగ్ ప్యాటర్న్, ఎక్స్‌ప్రెస్ - 55, 2+3 సీటింగ్ ప్యాటర్న్ ఎర్గోనామిక్‌గా డిజైన్ చేశారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యానికి ఫ్రంట్ అండ్ రియర్ ఎయిర్ సస్పెన్షన్ ఉండనుంది. నెల బ్యాకప్‌తో 2 అంతర్గత భద్రతా కెమెరాలను క్యాబిన్, సెలూన్‌లో ఉంటాయి. వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, పానిక్ బజర్ తోపాటు ప్రతీ సీటుకు మొబైల్ యూఎస్బీ ఛార్జింగ్ సదుపాయం ఉంది. 12 హై వోల్టేజ్ బ్యాటరీలు, 2 లో వోల్టేజ్ బ్యాటరీల ద్వారా ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే 360 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.
బస్సు గరిష్టంగా 80 కిలోమీటర్లతో స్పీడ్ లాక్ అవుతుంది. ఫైర్ యాక్సిడెంట్లు తెలిపేలా ఫైర్ డిటెక్షన్ అండ్ అలారింగ్ సిస్టమ్ ఉంటుంది. వాహన ట్రాకింగ్, కెమెరాలు, ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులు, జీపీఎస్ ప్రకటనలతో కూడిన ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. హాల్ట్ బ్రేక్ సిస్టమ్ ద్వారా ప్రయాణికులు లేదంటే డ్రైవర్ తలుపులు తెరిచి ఉంచితే వార్నింగ్ ఇస్తుంది.