- ఏడేండ్ల తర్వాత రిక్రూట్మెంట్
- వరంగల్ రీజియన్‌లో 275 ఖాళీలు
మంచిర్యాల, వెలుగు: విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏడేండ్ల తర్వాత గ్రేడ్-2 సూపర్వైజర్ల నియామకాలకు మోక్షం కలిగింది. వరంగల్ రీజియన్‌లోని 275 ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. చివరిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఎగ్జామ్ నిర్వహించి, 2014లో రిక్రూట్మెంట్ చేపట్టారు.
తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ర్టవ్యాప్తంగా వందల పోస్టులు ఖాళీలున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎట్టకేలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో ఇన్నాళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న అంగన్వాడీ టీచర్లతో పాటు ఆ డిపార్ట్మెంట్లోని స్టాఫ్ ఆనందం వ్యక్తం
చేస్తున్నారు.
రీజియన్‌లో 275 ఖాళీలు...
వరంగల్ రీజియన్‌లో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి నాలుగు జోన్లలో గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టులు 275 ఉన్నాయి. కాళేశ్వరం జోన్లో 56, బాసరలో 68, భద్రాద్రిలో 79, రాజన్న జోన్లో 72 ఖాళీలను ప్రకటించారు. ఇందులో ఓసీలకు 104, బీసీ ఏ 23, బీసీ బీ 20, బీసీ సీ 4, బీసీ డీ 18, బీసీ ఈ 10, ఎస్సీ 41, ఎస్టీ 16 పోస్టులు ఉండగా, అంధులకు 4, బధిరులకు 4, వికలాంగులకు 4, ఈడబ్ల్యూఎస్‌కు27 పోస్టులను కేటాయించారు.
సెలక్షన్ ఇలా...
గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. మెయిన్, మినీ సెంటర్ల అంగన్వాడీ టీచర్లు, ఐసీడీఎస్, ప్రాజెక్టులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సూపర్వైజర్లు, అంగన్వాడీ ట్రెయినింగ్ సెంటర్లలో పనిచేస్తున్న కో ఆర్డినేటర్లు, ఇన్స్ర్టక్టర్లు, మిడిల్ లెవల్ ట్రైనింగ్ సెంటర్స్‌లో పనిచేస్తున్నవారు అర్హులు. టెన్త్ పాసైన అభ్యర్థులు అంగన్వాడీ టీచర్లుగా లేదా డిపార్ట్మెంట్లో పదేండ్ల సర్వీస్ కలిగి, 50 ఏండ్ల లోపు ఉండాలి. ఎలిజిబిలిటీ లిస్ట్‌ను నిరుడే తయారుచేసి పంపినప్పటికీ రిక్రూట్మెంట్ ఆలస్యమైంది.
మంచిర్యాల జిల్లాలో 530 మంది అర్హులు ఉండగా, రీజియన్‌లో 8వేల మందికిపైగా ఉన్నారు. త్వరలోనే వీరికి ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అందులో సాధించిన మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా రిక్రూమెంట్ చేపడుతారు. ఆన్లైన్లో https:/wdcw.tg.nic.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 27లోగా అప్లై చేసుకోవాలి.