తెలుగు రాష్ట్రాల నీటి హక్కులకు ఎలాంటి నష్టం ఉండదు

తెలుగు రాష్ట్రాల నీటి హక్కులకు ఎలాంటి నష్టం ఉండదు
  • జీసీ లింక్​లో సాగర్​ను బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​గా వాడుకోవడంపై ఎన్​డబ్ల్యూడీఏ
  • నేటి నుంచి సాగర్​ ఆయకట్టు పరిధిపై అధ్యయనం

హైదరాబాద్, వెలుగు: గోదావరి, కావేరి అనుసంధానం (జీసీ లింక్​)లో నాగార్జునసాగర్​ను బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​గా వాడితే తెలుగు రాష్ట్రాల నీటి హక్కులకు ఎలాంటి నష్టం ఉండదని నేషనల్​వాటర్​ డెవలప్​మెంట్ అథారిటీ (ఎన్​డబ్ల్యూడీఏ) స్పష్టం చేసింది. దానికి సంబంధించిన సిమ్యులేషన్​స్టడీస్​ను తెలంగాణ, ఏపీకి పంపించింది. కృష్ణా జలాల్లో వాటాలు తేలేవరకు సాగర్​ను బ్యాలెన్సింగ్​రిజర్వాయర్​గా వాడుకోవడానికి వీల్లేదంటూ గతంలో జరిగిన మీటింగుల్లో తెలంగాణ తేల్చి చెప్పింది. జీసీ లింక్​లో భాగంగా చత్తీస్​గఢ్​ వాడుకోని వాటా జలాల్లోని 148 టీఎంసీలను తమిళనాడు వరకు తరలించాలని ఎన్​డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

అందులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని యోచిస్తున్నది. అయితే, అందుకు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇచ్చంపల్లికి బదులు సమ్మక్కసాగర్​ను వాడుకోవాలని చెబుతున్నది. తమిళనాడుకు తరలించే జలాల్లో 43 టీఎంసీలు తెలంగాణకు ఇస్తామని ఎన్​డబ్ల్యూడీఏ చెబుతున్నది. కానీ, తెలంగాణ మీదుగా తీసుకెళ్తున్నారు కాబట్టి.. సగం వాటా ఇవ్వాలని తెలంగాణ పట్టుబడుతున్నది. తరలింపులో భాగంగా 100 టీఎంసీల నీళ్లను సాగర్​కు తరలించి.. అక్కడి నుంచి సోమశిలకు, అటు నుంచి తమిళనాడుకు తరలించేలా జీసీ లింక్​కు ఎన్​డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. 

అయితే, ఇప్పుడు ట్రిబ్యునల్​లో వాదనలు జరుగుతున్నందున సాగర్​ను బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​గా వాడుకోరాదని, వాటాల్లో తేడాలొస్తాయని తెలంగాణ స్పష్టం చేస్తున్నది. ఈ క్రమంలోనే ఎన్​డబ్ల్యూడీఏ సిమ్యులేషన్​ స్టడీస్​ చేసి.. ఎవరికీ నష్టం కలగదని రెండు రాష్ట్రాలకూ సూచించింది. దాంతో పాటు సాగర్​ ఆయకట్టు పరిధిపైనా అధ్యయనం చేయించాలని ఎన్​డబ్ల్యూడీఏ నిర్ణయించింది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు ఎన్​డబ్ల్యూడీఏ సదరన్​ రీజియన్​ సీఈ దేవేందర్, ఎస్ఈ నాయుడు క్షేత్రస్థాయిలో స్టడీ చేయనున్నారు. అలాగే, ఈ అంశంపై ఈ నెల 12న సమావేశం నిర్వహించనున్నట్టు ఎన్​డబ్ల్యూడీఏ తెలిపింది.