అయ్యో అయ్యో..అయ్యయ్యో..ఇదేం వానరా బాబు..వరల్డ్ కప్ జోరుగా ప్రారంభమైంది. ఇక అక్టోబర్ 8వ తేదీన భారత్ తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచును అంతా కలిసి వీక్షిద్దామని ప్లాన్ చేసుకుంటే..వరుణుడు అడ్డు తగిలేలా ఉన్నాడు. మొన్నటి దాకా ఆసియాకప్ 2023 మ్యాచులకు ఇబ్బంది పెట్టిన వర్షం..ఇప్పుడు వరల్డ్ కప్ ను వదలనని అంటున్నాడు. అక్టోబర్ 8వ తేదీన చెన్నై వేదికగా జరిగే భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం తమిళనాడుతో పాటు..చెన్నై అంతటా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందుతుండటంతో ... చెన్నై నగరంలో వర్షం కురుస్తోంది. ఈశాన్య రుతుపవనాలు వచ్చినప్పటికీ. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో ముందస్తు వర్షాలు ప్రారంభమవుతాయి. దీంతో మూడు రోజుల నుంచి చెన్నైలో వర్షాలు పడుతున్నాయి.
గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఉత్తర తమిళనాడును ఆనుకుని ఉన్న తుఫాను సర్క్యులేషన్‌తో చెన్నైలో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే తూర్పు తీరం వెంబడి బంగ్లాదేశ్‌కు అనుకుని ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8వ తేదీ ఆదివారం కూడా వానలు కురిసే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షార్పణం అయ్యే అవకాశాలున్నాయి.
అక్టోబర్ 8వ తేదీ టీమిండియా తన వరల్డ్ కప్ వేటను ప్రారంభిస్తుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డుతగిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించడంతో అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. అయితే మొత్తం ఆటకు అంతరాయం కలిగిస్తుందా అంటే..కాదనే చెప్పాలి. రోజు చివరలో చిరు జల్లులు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. భారీ వర్షం అయితే ఉండకపోవచ్చు..కానీ ఆటకు మాత్రం ఖచ్చితంగా వరుణుడు అడ్డు తగులుతాడని పేర్కొంది.