- ఐదు రోజులు అక్కడే ఉండి లాబీయింగ్ చేసిన ఫైనాన్స్ స్పెషల్ సీఎస్
- రెండు రోజులు ప్రయత్నించిన ఎనర్జీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
- ఆర్థిక సంస్థలతో చర్చించేందుకు వెళ్లిన రజత్‌కుమార్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ నిర్వహణ, స్కీంల అమలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, పవర్ ప్లాంట్ల నిర్మాణానికి లోన్ల కోసం ఆఫీసర్లు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. రిజర్వ్ బ్యాంక్‌తో పాటు ఆర్థిక సంస్థలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఫైనాన్స్, ఎనర్జీ, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్‌లు ఈ పనిలోనే బిజీగా ఉన్నారు. ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు ఐదు రోజులపాటు ఢిల్లీలో ఉండే కొత్త అప్పులకు పర్మిషన్ తెచ్చుకునేందుకు ప్రయత్నించి తిరిగి వచ్చేశారు. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లకు అప్పుల కోసం ఎనర్జీ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ.. రెండు రోజులు హస్తినలోనే ఉండి ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవసరమైన అప్పుల కోసం ఆర్థిక సంస్థలతో చర్చించేందుకు ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ ఢిల్లీకి వెళ్లారు. లిఫ్టులకు అవసరమైన మోటార్లు, పంపుల సప్లయ్‌పై చర్చించేందుకు సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్ ఇప్పటికే భోపాల్‌కు వెళ్లి బీహెచ్‌ఈఎల్ అధికారులతో చర్చించారు. ఇటీవల జలసౌధలో బీహెచ్‌ఈఎల్ డైరెక్టర్ సహా ఇతర అధికారులతో రజత్ కుమార్ సమావేశమై మోటార్లు సప్లయ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, బ్యాంకుల కన్సార్షియం, నాబార్డు లోన్లు ఇవ్వడానికి విముఖత చూపడంతో ఆయా సంస్థలతో చర్చించి ఎలాగైనా లోన్‌లు తెచ్చే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు.
ఒక్క నెలకే రూ.16 వేల కోట్లు కావాలె
రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ, జీతాలు, పెన్షన్లు, ఆసరా పెన్షన్లకు ప్రతినెలా రూ.5,500 కోట్లు కావాలి. ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీలు, ఇన్‌స్టాల్ మెంట్ల రీపేమెంట్‌కు రూ.4 వేల కోట్లు అవసరం. జూన్‌లో రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో రూ.7,400 కోట్లు వేయాల్సి ఉంది. పల్లె, పట్టణ ప్రగతికి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు, ఇతర అభివృద్ధి పథకాలకు సంబంధించిన చెల్లింపులు అన్ని కలుపుకుంటే జూన్ నెలకు రూ.26 వేల కోట్లకు పైగా అవసరం ఉన్నాయి. రైతుబంధును జనవరి, జూన్ నెలల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ రెండు నెలలు మినహాయిస్తే మిగతా 10 నెలలు నెలకు రూ.17 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. స్టేట్ ఓన్ రెవెన్యూ రూపంలో జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, ఇతర ట్యాక్సుల రూపంలో రూ.9 వేల కోట్ల వరకు వచ్చే ఆస్కారముంది. పెంచిన ధరలతో ఇంకో వెయ్యి కోట్లు అదనంగా సమకూరినా జూన్ నెలకు ఇంకో రూ.16 వేల కోట్లకు పైగా నిధులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మిగతా నెలల్లో రూ.7 వేల కోట్లకు పైగా నిధుల కొరత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తీసుకొని భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లు నిర్మిస్తోంది. వీటికి సంబంధించిన పెండింగ్ బిల్లులతో పాటు చేయాల్సిన పనులకు భారీ ఎత్తున నిధులు అవసరమున్నాయి. కాళేశ్వరం, పాలమూరు - రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతలు సహా ఇతర ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలకు ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకోవడం తప్ప బడ్జెట్ నుంచి నిధులు సర్దుబాటు చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే ఇరిగేషన్‌లో రూ.8 వేల కోట్ల వరకు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అవి క్లియర్ చేస్తే తప్ప పనులు చేయబోమని కాంట్రాక్టర్లు తేల్చిచెప్తున్నారు. లిఫ్టులకు అవసరమైన మోటార్లు సప్లయ్ చేయడానికి ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్ కూడా వెనుకడుగు వేస్తోంది. ఈనేపథ్యంలో అప్పులు చేయడం అనివార్యమైంది.
వేరే దారి లేక
నిధులు సర్దుబాటు కాక ప్రతి నెల ప్రభుత్వ నిర్వహణ భారమవుతోంది. ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులతో పాటు వేస్ అండ్ మీన్స్, కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చి తీసుకున్న మొత్తం లోన్లు కలుపుకుంటే రూ.4.50 లక్షల కోట్లు దాటాయి. రాష్ట్ర పరపతికి మించి అప్పులు తీసుకుంటున్నారని, ఇలాగే కొనసాగితే ఆర్థికంగా దివాలా తీయడం ఖాయమని ఆర్‌బీఐ కొత్త లోన్లకు, బాండ్ల వేళానికి అనుమతి ఇవ్వడం లేదు. ఆర్‌బీఐ ఆంక్షలతో ఆర్థిక సంస్థలూ కార్పొరేషన్లకు రుణాలు ఇవ్వడం లేదు. దీంతో ప్రాజెక్టులతో పాటు పవర్ ప్లాంట్ల పనులకూ బ్రేక్ పడింది. కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే కొత్త అప్పులు తీసుకోవడం మినహా ఇంకో మార్గం లేకుండా పోయింది. చార్జీల పెంపు రూపంలో రెవెన్యూ భారీగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నా.. అది నెలవారీ పద్దులకు సరిపోవడం లేదు.