శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ : మంత్రి సీతక్క

శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి  బజార్ : మంత్రి సీతక్క
  • 5న స్టాల్స్ ప్రారంభించనున్న మంత్రి సీతక్క 
  • రూ.9 కోట్లతో స్టాల్స్ పునరుద్ధరణ పనులు 

హైదరాబాద్, వెలుగు: మాదాపూర్​లోని శిల్పారామంలో  ‘ఇందిరా మహిళా శక్తి బజార్’ ను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 5న మంత్రి సీతక్క మహిళా సంఘాలకు కేటాయించిన స్టాల్స్​ను  ప్రారంభించనున్నారు. మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు రైతు బజార్ తరహాలో వీటిని సిద్ధం చేశారు. ప్రభుత్వం రూ.9 కోట్లు కేటాయించి స్టాల్స్ పునరుద్ధరణ పనులు చేపట్టింది. 

ఇక్కడ దాదాపు 106 స్టాల్స్​ఉండగా..  సుమారు ఏడేండ్ల నుంచి  నిరుపయోగంగా ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వం స్టాల్స్​ను పునరుద్ధరించి  ప్రారంభానికి ముస్తాబు చేసింది.  ఈ స్టాల్స్ లో చేనేత, హస్తకళలు, గృహ సంబంధిత వస్తువులు, అలంకరణ పరికరాలు, కళంకారి, జ్యువెలరీ, క్లాత్స్, ఇతర వస్తువులతోపాటు ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. 

స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ స్టాల్స్​కేటాయించారు. గ్రామీణ ఉత్పత్తి దారులను పట్టణ, అంతర్జాతీయ వినియోగదారులతో అనుసంధానించడం ద్వారా  మార్కెటింగ్ అవకాశాలు పెరిగే అవకాశం ఉందని, మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంతోపాటు వారి స్వయం ఉపాధికి బాటలు వేసేలా ప్రభుత్వం ముందుకు సాగుతుంది.

దివ్యాంగులకు కాంగ్రెస్ సర్కార్ అండ: మంత్రి సీతక్క

దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి సీతక్క చెప్పారు. మంగళవారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరుపుకోనుండటంతో దివ్యాంగులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. విభిన్న ప్రతిభావంతులు ఏ రంగంలో ఉన్నా వారిని ప్రోత్సహించాలని కోరారు. అంగ వైకల్యంతో కుమిలిపోవాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులను అన్ని రకాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏమీ లేదన్నారు. దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్ర స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వ ప్రోత్సహంతో దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.