- ‘ఎలక్షన్ కోడ్’ వచ్చేలోపు అమలు చేసేందుకు కసరత్తు
- లబ్ధిదారుల అకౌంట్లలో రూ.10లక్షల చొప్పున జమ చేయాలని ప్లాన్
- 6 మండలాల్లో మొత్తం 30,065 మంది ఎస్సీలు ఉన్నట్లు గుర్తింపు
- సత్తుపల్లి నియోజకవర్గం, బోనకల్ మండలాల్లో కొనసాగుతున్న సర్వే
- 35 క్లస్టర్లుగా విభజించి, స్పెషల్ ఆఫీసర్ల నియామకం
ఖమ్మం, వెలుగు : దళితబంధు పథకం అమలుకు ఖమ్మం జిల్లా అధికారులు పరుగులు తీస్తున్నారు. వారం పది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్వస్తుందన్న ప్రచారం ఊపందుకోవడంతో అంతకు ముందే లబ్ధిదారుల అకౌంట్లలో రూ.10 లక్షల చొప్పున జమ చేయాలని కసరత్తు చేస్తున్నారు. గత నెల 30న ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ సత్తుపల్లిలో దళితబంధును పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని ప్రకటించారు. హుజూరాబాద్ తర్వాత పూర్తిస్థాయిలో ఇస్తుంది ఇక్కడ్నేనని తెలిపారు. అదే రోజును ప్రభుత్వం జీఓ రిలీజ్ చేసింది.
సత్తుపల్లితో పాటు మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలంలో100 శాతం దళితబంధు అమలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆధ్వర్యంలో ఇప్పటికే సత్తుపల్లి నియోజకవర్గంతోపాటు, బోనకల్ మండలంలో లబ్ధిదారుల గుర్తింపుపై సర్వే, ఫీల్డ్‌వర్క్ మొదలుపెట్టారు. సత్తుపల్లిలోని 5 మండలాలతో మధిరలోని బోనకల్మండలాన్ని కలుపుకుని 35 క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్‌కు జిల్లా స్థాయి ఆఫీసర్ ను స్పెషల్ఆఫీసర్గా నియమించారు. మండల స్థాయిలో పర్యవేక్షణకు మరొకరిని నియమించారు. వారి ఆధ్వర్యంలో సర్వే నడుస్తోంది.
కోరుకున్న యూనిట్లు ఇచ్చేలా..
సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 77,455 మంది ఎస్సీలు ఉండగా, 25,143 కుటుంబాలు ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. బోనకల్ మండలంలో 14,567 మంది ఎస్సీలు ఉండగా, 4,922 కుటుంబాలు ఉన్నట్లు తేల్చారు. మొత్తంగా ఆరు మండలాల్లో కలిపి 30,065 ఎస్సీ కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున మొత్తం రూ. 3006.50 కోట్లు త్వరలో రిలీజ్కానున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈలోగా సర్వే పూర్తిచేయాలని చూస్తున్నారు. సర్వేలో భాగంగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ వివరాలను తీసుకుంటున్నారు.
యూనిట్ల ఎంపికపై సూచనలు చేస్తున్నారు. కుటుంబంలోని వారే యూనిట్లను పూర్తిస్థాయిలో నిర్వహించుకోవాలని చెబుతున్నారు. అనుభవం, నైపుణ్యం కలిగిన యూనిట్లను ఎంపిక చేసుకుంటే ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని వివరిస్తున్నారు. సర్వే తర్వాత లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో రూ.10 లక్షలు జమ అవుతాయని అంటున్నారు. కోరుకున్న యూనిట్లను గ్రౌండింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు.
పొరపాట్లు సరిదిద్దుకొంటూ..
గతంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాలను దళితబంధు పైలట్‌ప్రాజెక్టు కోసం ఎంపిక చేసింది. అందులో మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం ఒకటి. కలెక్టర్ వీపీ గౌతమ్ ఆధ్వర్యంలో చింతకాని మండలంలో 3,642 మంది దళిత కుటుంబాలకు, నియోజకవర్గానికి 100 చొప్పున 483 కుటుంబాలకు, మొత్తంగా 4,125 కుటుంబాలకు దళితబంధు అమలు చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున రూ.412.50 కోట్లు అందజేశారు.
వివిధ రకాల యూనిట్లను గ్రౌండింగ్ చేశారు. ఆ అనుభవంతో, ఈసారి మరింత వేగంగా యూనిట్ల గ్రౌండింగ్ చేసేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు, యూనిట్ల ఎంపిక విషయంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రెండ్రోజుల్లో సర్వే పూర్తి చేస్తాం
సత్తుపల్లి నియోజకవర్గం, బోనకల్ మండలాల్లో దళితబంధు సర్వే ప్రారంభించాం. రెండు రోజుల్లో సర్వే పూర్తిచేస్తాం. తర్వాత లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ చేపడతాం. గతంలో చింతకాని మండలంలో శాచ్యురేషన్ మోడ్‌లో దళితబంధు అమలు చేశాం. ఆ అనుభవంతో వీలైనంత త్వరగా యూనిట్ల గ్రౌండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.
– వీపీ గౌతమ్, ఖమ్మం జిల్లా కలెక్టర్