విస్తరణకు ఓఎంసీల పెట్టుబడి రూ.2 లక్షల కోట్లు!

విస్తరణకు ఓఎంసీల పెట్టుబడి  రూ.2 లక్షల కోట్లు!
  • మనదేశ ఇంధన అవసరాలు తీర్చడానికే
  • పెట్రో ప్రొడక్టులకు  భారీ డిమాండ్​

న్యూఢిల్లీ:  పెట్రోల్, డీజిల్ ​వంటి ఇంధనాల కోసం వేగంగా పెరుగుతున్న డిమాండ్​ను తీర్చడానికి మన ఆయిల్​ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) రెడీ అవుతున్నాయి.  ప్రభుత్వ యాజమాన్యంలోని ఓఎంసీలు- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్,  హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్- తమ రిఫైనరీ కెపాసిటీని పెంచుకోవడానికి  ప్లాన్లు వేస్తున్నాయి. విస్తరణ కోసం లక్షల కోట్ల రూపాయలు గుమ్మరించనున్నాయి.

 2029–-30 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తమ ముడి చమురు శుద్ధి సామర్థ్యాన్ని 35-–40 మిలియన్ టన్నులకు పెంచనున్నాయి.  క్రిసిల్ రేటింగ్స్ ఇటీవలి రిపోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం.. ఇప్పటికే ఉన్న ప్లాంట్ల విస్తరణల కోసం రూ. 1.9 లక్షల కోట్ల నుంచి రూ. 2.2 లక్షల కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నాయి.

 అదనపు శుద్ధి సామర్థ్యాలు 2030 నాటికి మనదేశ రిఫైనింగ్ బేస్‌‌‌‌‌‌‌‌ను 295 మిలియన్ టన్నులకు పెంచుతాయి.  కొత్త వాటిని నిర్మించడం కంటే ఇప్పటికే ఉన్న సౌకర్యాలను అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేయడం మేలని ఓఎంసీలు భావిస్తున్నాయి. చమురు ధరల హెచ్చుతగ్గుల కారణంగా ఈ వ్యూహాన్ని అవి ఎంచుకున్నాయి. రిఫైనర్లు 2016 నుండి 2024 వరకు బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు  9-11 డాలర్ల చొప్పున సగటు రాబడిని సాధించగలిగారు. ఫలితంగా పెట్టుబడిపై 12-–14 శాతం రాబడి వచ్చింది. 

 పెట్రోలియంకు పెరిగిన డిమాండ్

మనదేశంలో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. దేశీయ వినియోగం గత దశాబ్దంలో ఏడాదికి 4 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ కాలంలో, భారతదేశం  శుద్ధి  సామర్థ్యం 215 మిలియన్ టన్నుల నుండి 257 మిలియన్ టన్నులకు పెరిగింది. మొత్తం వినియోగంలో 56 శాతం వాటా కలిగిన రవాణా ఇంధనాలు కూడా 4 శాతం వృద్ధి చెందగా, వినియోగంలో 7 శాతం ఉన్న నాఫ్తా 2 శాతం వృద్ధి రేటును సాధించింది.   లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్,  బిటుమెన్  సంయుక్త వినియోగం దాదాపు 4 శాతం పెరిగింది. 

క్రిసిల్ రేటింగ్స్‌‌‌‌‌‌‌‌లో సీనియర్ డైరెక్టర్ అనూజ్ సేథీ మాట్లాడుతూ, మొత్తం పెట్రోలియం ఉత్పత్తిలో వచ్చే ఆరేళ్లలో 3 శాతం వార్షిక వృద్ధి ఉండొచ్చని అన్నారు.  2023–-2030 కాలంలో రోజుకు 1.2 మిలియన్ బ్యారెల్స్  వినియోగంతో 2027 నాటికి భారతదేశ చమురు డిమాండ్ వృద్ధి చైనాను అధిగమిస్తుందని ఇంటర్నేషనల్​ఎనర్జీ ఏజెన్సీ  అంచనా వేసింది.  ప్రపంచ చమురు డిమాండ్​లో భారతదేశం వాటా భారీగా ఉంటుందని పేర్కొంది.  బలమైన ఆర్థిక,  జనాభా విస్తరణ ఇందుకు కారణమని పేర్కొంది.