గురుకుల పోస్టులకు వన్ టైం రిజిస్ట్రేషన్ నమోదులో సమస్యలు

  • ఓటీఆర్ లోని డీటైల్స్ నే మళ్లా అప్లికేషన్లలో అడుగుతున్నరు  
  • సేవ్ ఆప్షన్ ఉన్నా.. నో యూజ్  
  •  ఓటీఆర్ నుంచి అప్లికేషన్ దాకా.. అంతా తక్లీఫ్  
  •  అప్లై చేసేందుకు ఆరేడు గంటలు పడుతుంది
  • అభ్యర్థులను తిప్పిపంపుతున్న మీసేవ సెంటర్లు   

హైదరాబాద్, వెలుగు:  గురుకుల పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఓటీఆర్ (వన్ టైం రిజిస్ట్రేషన్) నమోదులో సమస్యల కారణంగా నానా అవస్థలు పడుతున్నారు. టీఎస్ పీఎస్సీ తరహాలో గురుకులాల్లోనూ ఓటీఆర్ నమోదు ప్రక్రియ ఈ నెల 12న ప్రారంభం కాగా, ఇప్పటికీ అది గాడిన పడలేదు. డీటైల్స్ ఎంటర్ చేసే సమయంలో ఎక్కడ తప్పు జరిగినా మళ్లా ఫస్ట్ నుంచి మొదలుపెట్టాల్సి వస్తోంది. చివరకు ఓటీఆర్ పూర్తి చేసుకుని అప్లికేషన్ కు వెళ్తే.. మళ్లా ఓటీఆర్ లోని డీటైల్స్ నే నింపాల్సి వస్తోంది. దీంతో అప్లికేషన్ కు గంటల కొద్దీ సమయం పడుతుండటంతో అభ్యర్థులకు ఇదే అసలు పరీక్షలా తయారైంది. గురుకులాల్లో పీజీటీ, టీజీటీ, జేఎల్, డీఎల్, ఆర్ట్ టీచర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్, మ్యూజిక్​టీచర్ల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్​స్టిట్యూషన్స్​ రిక్రూట్​మెంట్ బోర్డు ఇటీవలే నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. మొత్తం 9,200 పోస్టులకు అప్లికేషన్లు మొదలయ్యాయి. అయితే, మొదట్నుంచి ఓటీఆర్​తో సమస్యలు ఎదుర్కొన్న అభ్యర్థులు.. ఇప్పుడు అప్లికేషన్​లోనూ ఇబ్బందులు పడ్తున్నారు. ఓటీఆర్​లో నింపిన వివరాలన్నింటినీ మళ్లీ అప్లికేషన్​లోనూ నింపాలని అడుగుతున్నారని అభ్యర్థులు చెప్తున్నారు. పర్సనల్ డేటా, విద్యార్హతలు, సర్టిఫికెట్ల అప్​లోడ్ వంటి వాటికే నాలుగైదు గంటల టైం పడుతున్నదని అంటున్నారు.  

తప్పు పోతే.. మళ్లా ఫస్ట్ కు 


సెంటర్ల ఎంపికలోనూ అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 12 సెంటర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉండగా.. ఒక సెంటర్​ను సెలెక్ట్​ చేసుకుంటే మరో సెంటర్​ను సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇక, ఓటీఆర్​లోగానీ, అప్లికేషన్​లోగానీ ఒక్కచోట తప్పు దొర్లినా మళ్లీ మొదటి నుంచి ఫారాన్ని నింపాల్సి వస్తున్నది. ఓటీఆర్​లోగానీ, అప్లికేషన్​లోగానీ ఒక స్టేజ్ తర్వాత వివరాలు సేవ్ అవ్వాలి. గురుకుల పోస్టుల విషయంలో అలా జరగడం లేదని చెప్తున్నారు. దీంతో ఒక అభ్యర్థి ఒక పోస్టుకు అప్లై చేసుకునేందుకే 5 గంటలు పడితే.. మిగతా పోస్టులకూ అర్హతులుండే అదే అభ్యర్థి ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఒకట్రెండు రోజులు పడుతున్నది. పరీక్ష రాసి ఎంపికయ్యాక.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగాక.. ఉద్యోగం చేసే ప్లేస్​కు ఆప్షన్ ఇవ్వాల్సి ఉన్నా.. అప్లికేషన్​లోనే ఆ వివరాలనూ బోర్డు అడుగుతున్నది. 4 సొసైటీల్లో అప్లై చేసే జాబ్స్​కు ఏడు జోన్ల ఆప్షన్లను పెట్టాల్సిందిగా అడుగుతున్నది. అంటే 28 ఆప్షన్లు ఇవ్వాల్సి వస్తున్నది. ఒక ఆప్షన్​ను నమోదు చేసుకున్నాక.. రెండో ఆప్షన్​కు వెళితే అది లోడ్ అయ్యేందుకే చాలా సమయం పడుతున్నది. ఒక్కోసారి ఎర్రర్​లూ వస్తున్నాయి.   

పరీక్ష రాసుడే ఈజీ 

గురుకుల ఉద్యోగాల పరీక్షలకు టైం రెండున్నర గంటలు. కానీ, ఆ పరీక్షకు అప్లై చేసుకోవాలంటేనే ఇప్పుడు అభ్యర్థులు జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్లై చేసుకోవడం కన్నా పరీక్ష రాసుడే ఈజీ అనే పరిస్థితి వచ్చింది. అభ్యర్థులు మీసేవ సెంటర్లకు వెళ్తుంటే.. అప్లై చేసేందుకు ఆ సెంటర్ నిర్వాహకులు కూడా నిరాకరిస్తున్నట్టు అభ్యర్థులు వాపోతున్నారు. ఆరేడు గంటల టైం పడుతుండడంతో తమ వ్యాపారం దెబ్బతింటున్నదని మొహం మీదే చెప్పేస్తున్నారు. అప్లై చేయకుండా అభ్యర్థులను తిప్పి పంపుతున్నారు. దీంతో ఓటీఆర్, అప్లికేషన్ల ప్రాసెస్​ను ఇంత కాంప్లికేట్ ఎందుకు చేయాల్సి వచ్చిందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మీసేవ సెంటర్ల వాళ్లు తిప్పి పంపుతుండడంతో.. ఇంట్లో కంప్యూటర్లు, ల్యాప్​టాప్​లు లేని అభ్యర్థుల పరిస్థితేందని ప్రశ్నిస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.  

సర్వర్​ను మార్చినా తప్పని తిప్పలు 

గురుకుల బోర్డు వెబ్​సైట్​లో ఓటీఆర్ తోపాటు అప్లికేషన్లకు మొదట్నుంచీ సమస్యలే వెంటాడుతున్నాయి. ఓటీఆర్ అందుబాటులోకి వచ్చిన తొలి రోజే లింక్ ఓపెన్ కాకుండా సతాయించింది. చాలా మంది అభ్యర్థులు ఓటీఆర్ నమోదు చేసుకోలేకపోయారు. ఫస్ట్ రోజు కేవలం 4 వేల మందే నమోదు చేసుకోగలిగారు. తర్వాత మార్కుల సమస్య కూడా వచ్చిపడింది. 55 శాతం కంటే తక్కువ మార్కులను ఎంటర్ చేస్తే ఓటీఆర్ లో ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోయింది. మార్కులపై బోర్డు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. ఈడబ్ల్యూఎస్​ సర్టిఫికెట్ల అప్​లోడింగ్​లోనూ సమస్యలు ఎదురయ్యాయి. ఓటీఆర్ సంక్లిష్టంగా మారడంతో గురుకుల బోర్డు సర్వర్​ను మార్చింది. ఆ తర్వాత పరిస్థితి కొంచెం మెరుగైనప్పటికీ.. అడిగిన డీటెయిల్సే మళ్లీ మళ్లీ అడుగుతుండడంతో పరిస్థితి మళ్లా మొదటికే వచ్చినట్లయింది.   

నాలుగైదు గంటలు పడ్తోంది 

నేను ఫిజికల్ సైన్స్​లో బీఈడీ చేసిన. టీఎస్ పీఎస్సీ సైట్​లో జాబ్​కు అప్లై చేసేటప్పుడు చివర్లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ గురుకుల పోస్టులకు రిజిస్ట్రేషన్​కు ముందే ఫీజు కట్టాలని అడుగుతోంది. క్యాస్ట్ సర్టిఫికెట్ నంబర్, ఇష్యూయింగ్ డేట్ ఎంట్రీ చేస్తే సర్టిఫికెట్ వివరాలు డిస్ ప్లే కావడం లేదు. టెట్ హాల్ టికెట్ నంబర్ ఎంట్రీ చేస్తే ఆటోమేటిగ్గా మార్కులు డిస్ ప్లే కావాలి. కానీ మార్కులు కూడా ఎంటర్ చేయాల్సి వస్తోంది. టెన్త్ నుంచి పీజీ వరకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మార్కులు, పర్సంటేజీ ఇలా అన్నింటినీ ఎంట్రీ చేయడానికి నాలుగైదు గంటలు పడుతోంది.  
- మహేశుని ప్రశాంత్, కరీంనగర్ 
‌‌