అందరికీ అందని ఆన్​లైన్​ విద్య..!

అందరికీ అందని ఆన్​లైన్​ విద్య..!
  • అందరికీ అందని ఆన్​లైన్​ విద్య.. బడులు తెరవాల్సిందే!

కరోనా దెబ్బతో నిరుడు మార్చిలో మూతబడిన స్కూళ్లు ఇంకా తెరుచుకోలేదు. ప్రభుత్వ ఆదేశాలతో ఆన్​లైన్​క్లాసులు నడుస్తున్నా.. స్మార్ట్​ఫోన్లు, టీవీలు లేక నిరుపేద, మధ్యతరగతి స్టూడెంట్స్​కు అవి పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇటు ఫిజికల్​క్లాసులు లేక, ఆన్​లైన్​విద్య అందక, గ్రామీణ ప్రాంతాలు, గిరిజన, తండాల స్టూడెంట్స్​ విద్యకు దూరమవుతున్నారు. బాలికల బాల్యవివాహాలు పెరుగుతున్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. బడ్జెట్​ స్కూళ్లు మూతబడుతున్నాయి. అస్తమానం స్మార్ట్​ఫోన్లు వాడుతున్న కొందరు స్టూడెంట్స్​ వాటికి బానిసలవుతున్నారు. వీటన్నిటినీ అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడులు తెరిచేందుకు ఉన్న అవకాశాలపై సీరియస్​గా అధ్యయనం చేయాలి. పిల్లలపై వ్యాక్సిన్​ ట్రయల్స్​ వేగవంతం చేయాలి. ఫైనల్​గా బడులు రీఓపెన్​చేసి నేటి పిల్లలు రేపటి భావి భారత పౌరులుగా ఎదిగేందుకు బాటలు వేయాలి. 

యునైటెడ్ నేషన్స్ పాలసీ బ్రీఫ్ – ఆగస్టు 2020 ప్రకారం కరోనా వల్ల  ప్రపంచవ్యాప్తంగా 1.6 బిలియన్ స్టూడెంట్స్ చదువులపై ఎఫెక్ట్​పడింది. ఇండియాలో 26 కోట్లకు పైగా స్టూడెంట్స్​ఉండగా తెలంగాణ రాష్ట్రంలో 28 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో, 32 లక్షల మంది ప్రైవేటు స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా 2020 మార్చి నెల జనతా కర్ఫ్యూ నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల విద్యాసంస్థలు మూసే ఉన్నాయి. స్టూడెంట్స్ కు నష్టం జరగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాలతో విద్యాసంస్థలు ఆన్​లైన్​  క్లాసెస్​నిర్వహిస్తున్నాయి. అయితే ఆన్​లైన్ పాఠాలకు అవసరమైన ఎక్విప్​మెంట్ చాలా మంది స్టూడెంట్స్​కు అందుబాటులో లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. మన దేశంలో ఆన్​లైన్ ఎడ్యుకేషన్​ కొత్తది కావడం వల్ల స్టూడెంట్స్, టీచర్లు దీన్ని అలవాటు చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఆన్​లైన్​లో బోధిస్తున్న మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జియోగ్రఫీ టాపిక్స్ ​పిల్లలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆన్​లైన్​లో ఒక రీసోర్స్ పర్సన్ ఒక టాపిక్ ను రాష్ట్ర/దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు బోధిస్తాడు. అయితే ఆ బోధన పిల్లలకు ఎంతవరకు చేరిందనే అంశానికి సమాధానం ఉండదు.  ఆన్​లైన్ విద్యలో ఇదో  ప్రధాన లోపం.  క్లాస్​రూంలో టీచర్ స్టూడెంట్స్​ అందరినీ గమనిస్తూ, వారి ఆసక్తి, అభిరుచులకు తగినట్లుగా టాపిక్​ చెబుతూ.. వారికి విషయం అర్థమయ్యేటట్లు బోధిస్తాడు. పిల్లలు కూడా టీచర్ చెప్పేది శ్రద్ధగా వింటూ క్లాస్​లో నిమగ్నమవడమే కాకుండా, ఏమైనా డౌట్స్​వస్తే అప్పుడే అడిగి నివృత్తి చేసుకుంటారు. ఇలాంటి వెసులుబాట్లు ఆన్​లైన్ విద్యలో లేకపోవడంవల్ల అది మన దేశంలో పెద్దగా సక్సెస్​కాలేకపోతోంది. పిల్లలు స్మార్ట్ ఫోన్లు గంటల కొద్దీ చూడటం వల్ల వారి కండ్లు ఎర్రబడటం, కంటి నుంచి నీరు రావడం, మెడనరాలు పట్టేయడం, తలనొప్పి, నిద్రలేమి తదితర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటికి తోడు పేద విద్యార్థులు ఆన్​లైన్​క్లాసులకు సంబంధించి స్మార్ట్​ఫోన్, ల్యాప్​టాప్, ట్యాబ్​లాంటివి లేక ఆన్​లైన్​చదువులకు దూరమయ్యారు.  ఫ్రెంచ్  సామాజిక శాస్త్రవేత్త పియరీ బౌర్డ్యూ ప్రకారం స్టూడెంట్స్​ విద్యాప్రగతి వారి కుటుంబ ఆర్థిక పెట్టుబడులపైనే కాకుండా సామాజిక, సాంస్కృతిక అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. తరగతి గదిలో టీచర్ వాడే భాష, యాస, అతని హావభావాలు, వ్యవహారశైలి, విజ్ఞానం, పరిణతి మొదలైనవి స్టూడెంట్​ను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అలాగే ఇంటి వాతావరణం, వసతులు, ఇంట్లో ఉండే వివిధ సమాచార ప్రసార సాధనాలైన వార్తా పత్రికలు, టెలివిజన్, కంప్యూటర్/ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్, పుస్తకాలు, ఎంచుకున్న స్కూల్ కూడా విద్యార్థి విద్యాప్రగతిని నిర్ణయిస్తాయనడంలో సందేహం లేదు. 
ప్రతికూలతలు
ఆన్​లైన్​పాఠాలకు వాడుతున్న స్మార్ట్​ఫోన్ పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉంది. చాలా మంది పేరెంట్స్​కు స్మార్ట్ ఫోన్ కొత్త కావడం వల్ల దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక, పిల్లలకు క్లాసులు ఉంటాయన్న కారణంతో దాన్ని వారి వద్దనే ఉంచుతున్నారు. క్లాసులు, హోం వర్క్, అసైన్​మెంట్ వంటి పేర్లు చెప్పి పిల్లలు అస్తమానం ఫోన్​లోనే గడుపుతున్నారు. చాలా మంది పిల్లలకు స్మార్ట్ ఫోన్​ వ్యసనంగా మారుతోంది. ఫోన్​ను అతిగా వాడటం ఎప్పుడూ నష్టదాయకమే. చాలామంది బడీడు పిల్లలు స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా ఫేస్​బుక్, వాట్సాప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలకు, ఆన్​లైన్ గేములు ఆడడానికి వాడుతున్నారు. ఇంటర్నెట్ లో ఫ్రీగా దొరికే సినిమా, అశ్లీలానికి సంబంధించిన విషయాలకు, వీడియోలకు టీనేజ్ స్టూడెంట్స్ ​సులువుగా ఆకర్షితులయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇవన్నీ తెలియని తల్లిదండ్రులు వారి పిల్లలు ఫోన్​లో చదువుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారనే భ్రమల్లో ఉంటూ వారిని గుడ్డిగా నమ్ముతున్నారు. ఆన్​లైన్​ ఎడ్యుకేషన్​కు ఖర్చుకూడా తక్కువేమీ కాదు. పిల్లలు చదివేది ప్రైవేట్ స్కూలైనా, ప్రభుత్వ బడైనా పేరెంట్స్ కు ఆన్​లైన్ విద్య అదనపు ఆర్థిక భారమే అవుతుంది.  టీవి/స్మార్ట్ ఫోన్ సమకూర్చుకోవడం ఒక ఎత్తైతే, క్రమం తప్పకుండా రీచార్జ్ చేయడం మరో ఎత్తు. ప్రతీ నెల టీ‌వి చానెళ్ల సంఖ్యను బట్టి రీచార్జ్ అమౌంట్ ఉంటుంది. అలాగే స్మార్ట్ ఫోన్​లో ఇంటర్నెట్ కనెక్షన్ కోసం రీఛార్జ్ చేయాలి. ఏ నెట్​వర్క్​ చూసినా తక్కువలో తక్కువ నెలకు రూ. 200తో రీచార్జ్​ చేసుకోవాల్సిందే. వీటికి తోడు ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజు కడితేనే ఆన్​లైన్ క్లాసులకు అనుమతి ఇస్తున్నారు. నిరంతర కరెంట్ సరఫరా, మంచి ఇంటర్నెట్ సిగ్నల్, అనుకూల వాతావరణం కూడా ఆన్​లైన్ ఎడ్యుకేషన్​ను ప్రభావితం చేస్తాయి. ఇలా టీ‌వి, స్మార్ట్ ఫోన్ రీచార్జ్ లు, కరెంట్ బిల్లులకు అయ్యే ఖర్చు తల్లిదండ్రులకు తడిసి మోపెడవుతోంది.    
స్మార్ట్​ఫోన్లు, టీవీలు..
యాన్యువల్ ​స్టేటస్​ ఆఫ్​ ఎడ్యుకేషన్​ (ఏఎస్ఈఆర్-2020) రిపోర్ట్​ ప్రకారం దేశంలో 56 శాతం ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల కుటుంబాల్లో, 72 శాతం ప్రైవేట్ స్కూళ్లలో చదివే స్టూడెంట్స్ ఇండ్లలో టీవి ఉంది. 56.4 శాతం సర్కారు సూళ్ల పిల్లల ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉండగా, 74.2 శాతం ప్రైవేట్ స్కూల్ ​స్టూడెంట్స్​కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్ ఉంది. అంటే 43.6 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు, 25.8 శాతం ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేదు. ఏఎస్ఈఆర్ రిపోర్ట్​ప్రకారం అన్ని  రకాల బడులు కలుపుకొని 2018లో కేవలం 36.5 శాతం కుటుంబాలు మాత్రమే స్మార్ట్ ఫోన్ కలిగి ఉంటే, 2020 లో స్మార్ట్ ఫోన్లు ఉన్న కుటుంబాలు సంఖ్య 61.8 శాతానికి పెరిగింది. తల్లిదండ్రులు వారి పిల్లల ఆన్​లైన్​ఎడ్యుకేషన్​కోసం స్మార్ట్ ఫోన్ కొనడం తప్పనిసరిగా మారింది. ఏఎస్ఈఆర్ 2020 ప్రకారం కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, ప్రైవేట్ బడులు మూసివేయడం వల్ల  సర్కారు స్కూళ్లలో ఎన్​రోల్​మెంట్​ పెరిగింది. దీంతోపాటు 5.3 శాతం అబ్బాయిలు, 5.7 శాతం అమ్మాయిలు బడికి దూరమయ్యారు. 15 నుంచి 16  ఏండ్ల వయసున్న అమ్మాయిల్లో బడి బంజేసిన వారు 11.1 శాతంగా ఉన్నారు. కరోనా ఎఫెక్ట్​తో  గ్రామీణ ప్రాంత అమ్మాయిలు విద్యకు దూరమవుతున్నారు. దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో  హై స్కూల్ చదివే అమ్మాయిలకు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. 
                                                                                                                                                                       - డాక్టర్ శ్రీరాములు గోసికొండ, అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్