యాప్‌లో పెట్టుబడి పెడితే నాలుగైదు రెట్లు ఇస్తామని.. పండ్లు, ఐస్‌క్రీమ్‌లు చూపెట్టి.. రూ.15 కోట్లు కాజేశారు

  • కోస్టా వెల్‌ గ్రోన్‌ యాప్‌ నిర్వాకం
  • రూ. వేల నుంచి రూ. లక్షల వరకు పెట్టుబడిన పెట్టిన కూలీలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు
  • నాలుగైదు రోజులుగా పనిచేయని విత్‌డ్రా ఆప్షన్‌
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

జనగామ, వెలుగు: యాప్‌లో కనిపించే పండ్లు, ఐస్‌క్రీమ్‌, జ్యూస్‌లు కొనుగోలు చేసినట్లుగా డబ్బులు పెట్టుబడి పెడితే.. కొన్ని రోజుల్లోనే మూడు నుంచి నాలుగు రెట్లు తిరిగి ఇస్తామని నమ్మించి రూ. 15 కోట్లు వసూలు చేసిన ఓ సంస్థ చివరకు చేతులెత్తేసింది. దీంతో పెట్టుబడి పెట్టిన జనగామ జిల్లాకు చెందిన వేలాది మంది లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్​కు చెందినదిగి చెబుతున్న కోస్టా వెల్‌ గ్రోన్‌ యాప్‌లో మొదటగా రూ.570 కట్టి ప్రాథమిక సభ్యత్వం చేయిస్తారు.

తర్వాత 40 రోజుల పాటు ప్రతిరోజు రూ. 37 చొప్పున వాలెట్‌లో డిపాజిట్‌ చేయిస్తారు. ఈ లెక్కన మొత్తం రూ.1,480 ఆదాయం వస్తుంది. అలాగే రూ.97 వేలు పెట్టుబడిగా పెట్టి యాప్‌లో ఓ పండు కొంటే (పండు ఇంటికి రాదు.. జస్ట్‌ పెట్టుబడి మాత్రమే) 58 రోజుల పాటు ప్రతీరోజు రూ.5,141 వారి వాలెట్‌లో జమ అవుతాయని, అలామొత్తం రూ.2,98,178 ఆదాయం వస్తుందని యాప్‌ నిర్వాహకులు నమ్మించారు. ఇలా రూ. 1000 నుంచి రూ. 7 లక్షల వరకు పండ్లు, జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్‌లు యాప్‌లో డిస్‌ప్లే చేశారు. 

కూలీల నుంచి ఆఫీసర్ల వరకు..

మొదట్లో డబ్బులు బాగానే రావడంతో నిజమేనని నమ్మిన జనగామ పట్టణంతో పాటు శివారు గ్రామాలకు చెందిన సుమారు రెండు వేల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని పండ్లు, జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్‌లను కొనుగోలు చేస్తూ వేల రూపాయల నుంచి లక్షల వరకు పెట్టుబడిగా పెట్టారు. బాధితుల్లో ఆటో డ్రైవర్లు, చిరు, బడా వ్యాపారులు, డయాగ్నస్టిక్‌ సెంటర్ల నిర్వాహకులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ డాక్టర్లు, హాస్పిటల్‌ సిబ్బంది సైతం ఉన్నారు.

జనగామ కలెక్టరేట్‌లో పనిచేసే ఉద్యోగుల్లో సగం మంది ఈ యాప్‌ బాధితులేనని తెలుస్తోంది. జనగామ ప్రాంతంలో నాలుగు నెలల కింద ఈ యాప్​ కార్యకలాపాలు ప్రారంభం కాగా గత నెల చివరి వారంలో యశ్వంతాపూర్‌ సమీపంలో నిర్వహించిన ఈవెంట్‌తో ఊపందుకున్నాయి. 

కనిపించని విత్‌డ్రా ఆప్షన్‌

వేలు, లక్షల్లో పెట్టుబడి పెట్టిన వారికి సంక్రాంతి ముందు యాప్‌ నిర్వాహకులు షాక్‌ ఇచ్చారు. యాప్‌లో డౌన్‌లోడ్‌, పెట్టుబడులకు సంబంధించిన ఆప్షన్లు పనిచేస్తున్నా.. డబ్బులు విత్‌డ్రా చేసుకునే ఆప్షన్‌ కనిపించడం లేదు. దీంతో ఆందోళన చెందిన బాధితులు లోకల్‌ ఏజెంట్లు అయిన శ్రీధర్, విక్రముద్దీన్‌లను కలువగా పండుగ తర్వాత విత్‌డ్రా ఆప్షన్‌ పనిచేస్తుందని నచ్చజెప్పారు. ఇప్పటివరకు ఆ ఆప్షన్‌ పనిచేయకపోవడంతో మోసపోయామని గ్రహించిన కొందరు వ్యక్తులు ఏజెంట్లను నిలదీయడంతో పాటు, జనగామ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

విచారణ చేపడుతాం

కోస్టా వెల్‌ గ్రోన్‌ యాప్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు బాధితులు చేసిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నాం. ఆర్‌బీఐ అనుమతులు లేకుండా నడిచే యాప్‌లను ఎవరూ నమ్మొద్దు.. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోవద్దు. పూర్తి విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.
- పి.చేతన్‌ నితిన్‌, ఏఎస్పీ, జనగామ